కొంతకాలం క్రితమే కొత్త కార్మిక చట్టాల (New Labour Codes)ను పార్లమెంటు ఆమోదించినప్పటికీ.. ప్రభుత్వం (Government) వీటిని ఇప్పటివరకు అమల్లోకి తేలేదు. జులై ఒకటి అంటే శుక్రవారం నుంచి కార్మిక చట్టాలు అమలులోకి వస్తాయని, ఉద్యోగాల జీవితాల్లో మార్పులు వస్తాయని ఎన్నో వార్తలు వచ్చాయని కానీ ప్రభుత్వ అధికారులు వీటి అమలుకు ఇంకాస్త సమయం పట్టొచ్చని తెలిపారు. అయితే కొత్త కార్మిక చట్టాలలోని ఒక విభాగం (New Wage Code) ఉద్యోగులకు చాలా ప్రయోజనకరంగా కనిపిస్తోంది. ఈ చట్టం ప్రకారం, ఒక ఉద్యోగి (Employee) రాజీనామా చేసినా లేదా కంపెనీ తొలగించినా.. లేక కంపెనీ మూసేసిన కారణంగా ఉద్యోగం కోల్పోయినా.. ఆ ఉద్యోగి చివరి పనిదినం నుంచి రెండు రోజులలోపు పూర్తి జీతం, బకాయిల ఫైనల్ సెటిల్‌మెంట్‌ను కంపెనీ చెల్లించాలి. ఈ చట్టం కారణంగా కంపెనీల నుంచి ఉద్యోగులకు సత్వర ఆర్థిక రక్షణ అందుతుంది.
ప్రస్తుతం, కంపెనీలు ఉద్యోగి చివరి పని దినం నుంచి 45-60 రోజుల తర్వాత జీతం, బకాయిల పూర్తి సెటిల్‌మెంట్‌ను చెల్లిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో ఉద్యోగి చివరిగా పనిచేసిన రోజు నుంచి 90 రోజులకు కంపెనీలు చెల్లించాల్సివన్నీ చెల్లిస్తున్నాయి. ఇన్ని రోజులు ఆలస్యం వల్ల ఉద్యోగులు ఇబ్బందులు పడతారనే ఉద్దేశంతో కొత్త కార్మిక చట్టం వేరే పద్ధతిని తీసుకొచ్చింది. కోడ్ ఆన్ వేజెస్, సోషల్ సెక్యూరిటీ కోడ్, ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్, ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ & వర్కింగ్ కండిషన్స్ కోడ్ అనే నాలుగు లేబర్ కోడ్‌లు ఇప్పటికే పార్లమెంటు ఆమోదించింది.
అయితే కొత్త కార్మిక చట్టంలోని కొత్త వేజెస్ కోడ్ ఏం చెబుతోందంటే.. (i) ఒక ఉద్యోగిని కంపెనీ తొలగించినా లేదా (ii) తీసేసినా లేదా ఉద్యోగి తనంతట తానే రాజీనామా చేసినా లేదా కంపెనీని మూసివేసిన కారణంగా ఉద్యోగం పోయినా.. ఆ ఉద్యోగికి చెల్లించాల్సిన వేతనాలను లాస్ట్ వర్కింగ్ డే నుంచి రెండు పని దినాలలో చెల్లించాలి. ఉదాహరణకి జులై 5 అనేది ఉద్యోగి వర్క్ చేసిన చివరి రోజు అయితే కంపెనీలు కొత్త కోడ్ ప్రకారం జులై 7వ తేదీలోగా.. కంపెనీ జీతము, బకాయిల ఫుల్, ఫైనల్ సెటిల్‌మెంట్‌ను చెల్లించాలి.
ఇంతకు ముందున్న 29 కేంద్ర కార్మిక చట్టాలను సమీక్షించి, కలిసి ఈ నాలుగు కొత్త లేబర్ కోడ్‌లు రూపొందించారు. ప్రభుత్వం జూలై 1 నాటికి ఈ కొత్త చట్టాలను అమలు చేయాలని భావించింది కానీ అనేక రాష్ట్రాలు ఈ నిబంధనలను ఇంకా ఆమోదించలేదు. భారత రాజ్యాంగం ప్రకారం, కార్మిక చట్టాలు ఉమ్మడి జాబితాలో ఉన్నందున, అవి అమల్లోకి రావాలంటే అన్ని రాష్ట్రాలు కొత్త చట్టాలకు అనుగుణంగా నిబంధనలను రూపొందించాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి, నాలుగు కార్మిక చట్టాలకు అవసరమైన నిబంధనలను కొన్ని రాష్ట్రాలు ఇంకా ఏర్పాటు చేయలేదు. దాంతో వీటి అమలు కాస్త ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
లోక్‌సభలో కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తెలి లిఖితపూర్వక సమాధానం ప్రకారం, ఇప్పటివరకు కేవలం 23 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు మాత్రమే వేతనాలపై కోడ్ కింద డ్రాఫ్ట్ మార్గదర్శకాలను విడుదల చేశాయి. కొత్త కార్మిక చట్టాలు అమలులోకి రాగానే కంపెనీలు తమ పేరోల్ ప్రక్రియలను మార్చుకోవాల్సి ఉంటుంది. రెండు పని దినాలలోనే పూర్తి జీతాన్ని సెటిల్ చేసేందుకు సమయాన్ని, విధానాలను కొత్తగా రూపొందించుకోవాల్సి ఉంటుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు తమకు నచ్చిన ప్రకారం జీతాలను చెల్లించేందుకు ఒక టైమ్ లిమిట్ నిర్ణయించవచ్చని కొత్త కోడ్ చెబుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Company, Employees, Full salary, New Labour Codes