Ola electric car: స్కూటర్ తరువాత కారు.. 2023 నాటికి తొలి ఎలక్ట్రిక్ కారు లాంచ్

ప్రతీకాత్మక చిత్రం

రాబోయే కాలంలో ఎలక్ట్రిక్​ కార్లను కూడా విడుదల చేస్తామని ఓలా సహ వ్యవస్థాపకుడు, సీఈఓ భవిష్ అగర్వాల్ పేర్కొన్నారు.

  • Share this:
ప్రపంచవ్యాప్తంగా పలు మల్టీనేషనల్​ వాహన తయారీ సంస్థలు ఎలక్ట్రిక్ వాహనాల తయారీపై దృష్టి సారించాయి. భారత్​లో ఇంధన ధరలు పెరగడం, పర్యావరణ కాలుష్యం కారణంగా ఎలక్ట్రిక్​ వాహనాలకు డిమాండ్​ పెరుగుతోంది. మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఎలక్ట్రిక్​ వాహనాలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక రాయితీలను ప్రకటిస్తున్నాయి. దీంతో ఇక్కడ వేగంగా విస్తరించాలని అన్ని ఆటోమొబైల్​ కంపెనీలు ప్రణాళికలు రచిస్తున్నాయి. ఈ రేస్​లో అన్ని సంస్థల కంటే ముందుంది ఓలా ఎలక్ట్రిక్​ సంస్థ. ఈ సంస్థ ఇప్పటికే ఈ–స్కూటర్​ను లాంచ్​ చేసి అమ్మకాలను కూడా ప్రారంభించింది. వీటికి అనూహ్యమైన స్పందన వస్తోంది. ఇప్పుడు ఇదే జోరుతో ఎలక్ట్రిక్ కార్ల తయారీకి కూడా సిద్ధమవుతోంది.

రాబోయే కాలంలో ఎలక్ట్రిక్​ కార్లను కూడా విడుదల చేస్తామని ఓలా సహ వ్యవస్థాపకుడు, సీఈఓ భవిష్ అగర్వాల్ పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ ‘‘రాబోయే రెండేళ్లలో.. అంటే 2023 నాటికి ఎలక్ట్రిక్ కార్ల తయారీ ప్రాజెక్ట్‌ను చేపట్టనున్నాం. ఇప్పటికే ఈ–స్కూటర్​ మార్కెట్​లో విజయం సాధించాం. ఇక దేశీయ ఎలక్ట్రిక్​ కార్ల తయారీపై పనిచేస్తాం” అని అన్నారు. అయితే కంపెనీ ప్రణాళికల గురించి సమాచారాన్ని మాత్రం పంచుకోలేదు.

ఓలా ప్రస్తుతం ఫోర్ వీల్ ఎలక్ట్రిక్ కార్లను విక్రయించనప్పటికీ.. ఓలా క్యాబ్స్​ మాత్రం అనేక నగరాల్లో ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్​ క్యాబ్​లను నడుపుతోంది. అంతేకాదు, ఎలక్ట్రిక్ కార్ల ఛార్జింగ్ హబ్‌లను కూడా నిర్వహిస్తోంది. ఓలా ప్రస్తుతం తమిళనాడులోని కృష్ణగిరి ప్లాంట్‌ను అభివృద్ధి చేసే పనిలో నిమగ్నమైంది. ఇక్కడే తన భవిష్యత్ ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయనుంది. ఈ కేంద్రానికి సమీపంలో సప్లయర్​ పార్కును నిర్మించాలని కంపెనీ యోచిస్తోంది.

ఈ–స్కూటర్లకు అనూహ్యమైన రెస్సాన్స్​..
భవిష్యత్తులో దేశాన్ని 'ఎలక్ట్రిక్ వెహికల్ హబ్' గా మార్చడమే తమ లక్ష్యమని భవిష్​ అగర్వాల్​ పేర్కొన్నారు. ఇందు కోసం అన్ని ఆటోమొబైల్​ సంస్థలు ఎలక్ట్రిక్​ మార్కెట్​లోకి అడుగుపెట్టాల్సిన అవసరం ఉందని, ఈ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలని కోరారు. భారత ఎలక్ట్రిక్​ వాహన మార్కెట్​లో అగ్రగామి సంస్థగా నిలిచేందుకు తమ ప్రయత్నాలు కొనసాగిస్తామని తెలిపారు. ఓలా సంస్థ ఆగస్టు 15న తన మొట్టమొదటి ఎస్ 1, ఎస్ 1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్​ను ప్రారంభించింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్​ రూ .99,999 ధర వద్ద అందుబాటులోకి వచ్చింది. అక్టోబర్ నుంచి వీటి డెలివరీలు ప్రారంభమవుతాయి.
Published by:Kishore Akkaladevi
First published: