వైద్య చికిత్సలకు అయ్యే అన్ని ఖర్చులను కవర్ చేసే ఉత్తమ ఆరోగ్య బీమా (Health Insurance) పాలసీలు మార్కెట్‌లో దొరకడం చాలా అరుదు. అయితే తాజాగా యూనివర్సల్ సోంపో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ (Universal Sompo General Insurance Company) ఒక ఉత్తమ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని లాంచ్ చేసింది. కంప్లీట్ హెల్త్‌కేర్ ఇన్సూరెన్స్ ప్లాన్ (Complete Healthcare Insurance Plan)గా తీసుకొచ్చిన ఈ ప్యాకేజీ పాలసీ వ్యవధిలో అయ్యే అన్ని ఆసుపత్రి ఖర్చులను కవర్ చేస్తుంది. ప్రమాదాలు (Accidents), అనారోగ్యం, ఏదైనా వ్యాధి కారణంగా ఆపరేషన్ చేయించుకోవడానికి ఖర్చులు చేస్తే వాటిని ఈ ప్యాకేజీ కవర్ చేస్తుంది. కంప్లీట్ హెల్త్‌కేర్ ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది సమగ్ర ఆరోగ్య బీమా కవరేజీగా పాలసీదారులకు అన్ని ప్రయోజనాలు అందిస్తుంది. ఇందులో 14 బేస్, 26 యాడ్-ఆన్ కవర్‌లతోపాటు పలు కొత్త ఫీచర్లు కూడా ఉన్నాయి. వైద్య ఖర్చులు పెరగకుండా పాలసీదారులకు అండగా ఉండేందుకు ఈ ప్లాన్ తీసుకువచ్చినట్లు కంపెనీ తెలిపింది.
యూనివర్సల్ సోంపో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ అనేది ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, కర్ణాటక బ్యాంక్, డాబర్ ఇన్వెస్ట్‌మెంట్స్, సోంపో జపాన్ ఇన్సూరెన్స్ కంపెనీల జాయింట్ వెంచర్. ఈ కంపెనీ తాజాగా తీసుకొచ్చిన ప్లాన్ ఐదు ప్రొడక్ట్ వేరియంట్లను ఆఫర్ చేస్తుంది. ఈ పాలసీ గురించి మరిన్ని ప్రయోజనాలు ఇప్పుడు తెలుసుకుందాం.
* యూనివర్సల్ సోంపో కంప్లీట్ హెల్త్‌కేర్ ఇన్సూరెన్స్ ప్లాన్ ప్రయోజనాలు
- యూనివర్సల్ సోంపో హెల్త్‌కేర్ ప్యాకేజీ ఎన్నిసార్లైనా రెన్యువల్ చేసుకునేలా సమగ్ర కవరేజీని అందిస్తుంది.
- సరసమైన ప్రీమియం రేటుతో వివిధ సేవలకుగాను రూ.50 లక్షల వరకు బీమా మొత్తం ఆఫర్ చేస్తుంది.
- పాలసీదారులు పాలసీ నాలుగో ఏడాదికి ప్రీమియం మినహాయింపును పొందే అవకాశం ఉంది.
- కొన్ని నిర్దిష్ట వ్యాధులకు వెయిటింగ్ పీరియడ్ కేవలం ఒక ఏడాది మాత్రమే ఉంటుంది. ముందుగా ఉన్న వ్యాధులకు కూడా వెయిటింగ్ పీరియడ్ తక్కువగానే ఉంటుంది.
- ఔట్‌పేషెంట్ డిపార్ట్‌మెంట్ (OPD), ప్రసూతి కవరేజీతో పాటు అన్ని అత్యవసర సహాయ సేవలకు ఈ పాలసీ కవరేజ్ ఆఫర్ చేస్తుంది.
* పాలసీ ముఖ్య అంశాలు
- పాలసీ వ్యవధి ఏడాది, రెండేళ్లు, మూడు ఏళ్ల మధ్య ఉంటుంది.
- యూనివర్సల్ సోంపో హెల్త్‌కేర్ ప్యాకేజీ కింద ఎసెన్షియల్, ప్రివిలేజ్, ప్లస్, ప్రీమియర్, ఎగ్జిక్యూటివ్, డిజి – ప్రో అనే ఐదు రకాల ప్లాన్‌లు ఉన్నాయి.
- ఈ పాలసీకి దరఖాస్తు చేసుకునేవారికి కనీస వయస్సు 18 ఏళ్లు కాగా గరిష్ట వయస్సు 75 ఏళ్లు. పిల్లలకు విషయానికి వస్తే వారి కనీస వయస్సు 91 రోజులు, గరిష్ట వయస్సు 25 సంవత్సరాలు.
- ఈ ప్యాకేజీ కింద బీమా పాలసీదారుతో బంధుత్వం గల 20 మందికి కవరేజీ లభిస్తుంది.
- బేస్ ప్యాకేజీ డే-కేర్ ప్రొసీజర్స్, పోస్ట్ హాస్పిటలైజేషన్, డొమిసిలియరీ ఖర్చులు, ఆర్గాన్ డోనర్, అంబులెన్స్ ఛార్జీలు, ప్రీ-హాస్పిటలైజేషన్‌తో సహా ఇన్-పేషెంట్ చికిత్సలపై కవరేజీని అందిస్తుంది. అలానే ఔట్-పేషెంట్ చికిత్సలను కూడా కవర్ చేస్తుంది. తల్లి, శిశు సంరక్షణ, దంత చికిత్సకి కూడా కవరేజీ అందుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: General insurance, Health Insurance, Indian Bank, Insurance