• Home
  • »
  • News
  • »
  • business
  • »
  • MY HEARTBROKEN BY THE CURRENT SITUATION IN INDIA MICROSOFT CEO SATYA NADELLA MK GH

Satya nadella: ‘భారత్‌ను చూస్తుంటే గుండె భారంగా మారుతోంది’.. మైక్రోసాఫ్ట్ సిఈఓ స‌త్య‌నాదెళ్ల...

No 1: సత్య నాదెళ్ల, సీఈఓ, మైక్రోసాఫ్ట్. (Image: Reuters)

Satya nadella: ‘భారత్‌ను చూస్తుంటే గుండె భారంగా మారుతోంది’.. దేశంలో కోవిడ్ ఉధృతి నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ సిఈఓ స‌త్య‌నాదెళ్ల వ్యాఖ్య

  • Share this:
భార‌త్‌లో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. ఒక్క‌రోజులోనే రికార్డు స్థాయిలో 3,49,691 కొత్త క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. మరో 2,767 మంది చనిపోయారు. ఆదివారం నాటికి కోవిడ్‌-19 యాక్టివ్ కేసులు 26 ల‌క్ష‌లను దాటాయి. మొత్తం మ‌ర‌ణాలు 1,92,311కు చేరుకున్నాయి. రెండ‌వ‌ దశలో కరోనా వేగంగా వ్యాపిస్తోంది. ఇంతకు ముందుతో పోలిస్తే మరణాల శాతం సైతం ఎక్కువగా ఉంది. కేసుల పెరుగుదలతో పాటు వ్యాధి తీవ్రతో హాస్పిటళ్లలో చేరేవారి సంఖ్య సైతం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలు భారత్‌కు తమవంతు సహాయం చేసేందుకు ముందుకు వచ్చాయి. తాజాగా మైక్రోసాఫ్ట్ సిఈఓ స‌త్య‌నాదెళ్ల కూడా ద‌య‌నీయ స్థితిపై స్పందించారు. భారత‌దేశంలో ప్ర‌స్తుత ప‌రిస్థితిని చూస్తుంటే గుండె భారంగా మారుతోందని ట్విట్ట‌ర్ ద్వారా వ్యాఖ్యానించారు. తాజా ట్వీట్‌లో త‌న ఆవేద‌న వెలిబుచ్చారు. భార‌త్‌కు సాయం చేసేందుకు సిద్ధమని చెప్పినందుకు అమెరికాకు ధ‌న్య‌వాదాలు తెలిపారు.

భార‌త‌దేశానికి అవ‌స‌ర‌మైన‌ స‌హాయ‌క చ‌ర్య‌ల్లో తోడ్పాటు అందిస్తామ‌ని సత్య నాదెళ్ల చెప్పారు. ఆక్సిజ‌న్ నిల్వ‌లకు అవ‌స‌ర‌మైన ప‌రిక‌రాల‌ను అంద‌జేస్తామ‌న్నారు. స‌హాయ‌క చ‌ర్య‌ల్లో భాగంగా మైక్రోసాఫ్ట్ వ‌నరులు స‌మ‌కూర్చ‌డంలో, సాంకేతికంగానూ తోడ్ప‌డుతుంద‌ని చెప్పారు. అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ కూడా ఇండియా ప‌రిస్థితిపై స్పందించారు. భారత్‌ కోవిడ్ సంక్షోభం నుంచి గట్టెక్కడానికి అవసరమైన సాయం చేస్తామని చెప్పారు. గ‌తేడాది అమెరికాలో క‌రోనా విజృంభించినప్పుడు ఇండియా స‌హాయం చేసింద‌ని గుర్తుచేసుకున్నారు. జో బైడెన్ చేసిన ట్వీట్‌లో... ‘క‌రోనా మ‌హ‌మ్మారి ప్రారంభంలో మ‌న ఆసుప్ర‌తులు విప‌రీత‌మైన ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఆ స‌మ‌యంలో భార‌త‌దేశం అమెరికాకు స‌హాయం అందించింది. అలాగే ఇప్పుడు ఇండియాకి అవ‌స‌ర‌మైన స‌హాయం చేయ‌డానికి అమెరికా నిశ్చ‌యంగా ముందుకొస్తుంది’ అని పేర్కొన్నారు.

మ‌రోవైపు గూగుల్ సిఈఓ సుంద‌ర్ పిచాయ్ కూడా భార‌త‌దేశానికి అండ‌గా ఉంటామ‌ని ప్ర‌క‌టించారు. త‌న కంపెనీ నుంచి యూనీసెఫ్‌కు, లాభాపేక్ష లేని ‘గివ్ ఇండియా’ సంస్థకు వైద్య స‌దుపాయాల కోసం 135 కోట్లు విరాళంగా ఇస్తామ‌ని ట్విట్ట‌ర్‌ ద్వారా వెల్లడించారు. ఇండియాలో కోవిషీల్డ్ వ్యాక్సిన్ తయారీకి అవ‌స‌ర‌మైన ముడిసరకును అంద‌జేస్తామ‌ని ఆదివారం అమెరికా ప్ర‌క‌టించింది. ముందు ఇందుకు ససేమిరా అన్నప్పటికీ, భారత దౌత్య వర్గాల చర్చల ఫలితంగా అమెరికా వ్యాక్సిన్‌ తయారీకి అవసరమయ్యే ముడి పదార్థాలను సరఫరా చేస్తామని ప్రకటించింది.
Published by:Krishna Adithya
First published: