MUTUAL FUNDS STRATEGY ACCORDING TO INDIAN ECONOMY UMG GH
High Inflation: ఇండియాలో అధిక ద్రవ్యోల్బణ పరిస్థితులు.. ఇప్పుడు మీ మ్యూచువల్ ఫండ్ స్ట్రాటజీ ఎలా ఉండాలంటే..
ప్రతీకాత్మక చిత్రం
భారత్‌లో ద్రవ్యోల్బణం కొన్ని దశాబ్దాల గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. ఫలితంగా వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి. ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల కారణంగా ఇండియన్ స్టాక్ మార్కెట్లలో అస్థిర పరిస్థితులు నెలకొంటున్నాయి. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారుల పోర్ట్‌ఫోలియో కుంచించ?
భారత్‌లో ద్రవ్యోల్బణం కొన్ని దశాబ్దాల గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. ఫలితంగా వడ్డీ రేట్లు (Interest Rates) పెరుగుతున్నాయి. ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల కారణంగా ఇండియన్ స్టాక్ మార్కెట్ల (Stock Market)లో అస్థిర పరిస్థితులు నెలకొంటున్నాయి. మ్యూచువల్ ఫండ్ (Mutual Funds) పెట్టుబడిదారుల పోర్ట్‌ఫోలియో కుంచించుకుపోతోంది. ముఖ్యంగా ఈక్విటీ ఓరియంటెడ్ స్కీమ్స్‌పై ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. లాంగ్‌టర్మ్ ఇన్వెస్టర్లు అనవసరంగా ఆందోళన చెందనవసరం లేదా భయాందోళనలకు గురికానవసరం లేనప్పటికీ, ప్రస్తుత పరిస్థితులు వారి పోర్ట్‌ఫోలియోను జాగ్రత్తగా చూసుకునే మార్గాలను అన్వేషించాలని, దీర్ఘకాలిక సంపదను సృష్టించగల పెట్టుబడి వ్యూహాన్ని అవలంభించాలని సూచిస్తున్నాయి.
పెట్టుబడిదారులు మ్యూచువల్ ఫండ్లను కేవలం ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్‌గా మాత్రమే కాకుండా వారి దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలకు పరిష్కారాలుగా చూడాలి. క్రమశిక్షణతో కూడిన, క్రమబద్ధమైన విధానంతో పాటు యాన్యువల్ పోర్ట్‌ఫోలియో రివ్యూ విషయంలో తప్పనిసరిగా ఆర్థిక స్వేచ్ఛను పరిగణనలోకి తీసుకోవాలి. పెట్టుబడుల సమయంలో ప్రాథమిక అంశాలు దెబ్బతినకుండా చూసుకుంటూ మార్కెట్ పరిస్థితులను బట్టి షార్ట్ టర్మ్ నుంచి మిడ్ టర్మ్ వ్యూహాలను మార్చుకోవాలి. ప్రస్తుత అధిక ద్రవ్యోల్బణం పరిస్థితి మిడ్ టర్మ్‌లో కొనసాగే అవకాశం ఉన్నందువల్ల, మీ మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులకు వ్యూహరచన చేయడానికి ఇది ఒక మంచి అవకాశంగా మారింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితిని మెరుగ్గా ఉపయోగించుకోవడానికి ఇన్వెస్టర్లు అనుసరించాల్సిన వ్యూహాలు కొన్ని ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.
ఈక్విటీ స్కీమ్స్‌లో అదనపు కొనుగోళ్లు
ఈక్విటీ ఇన్వెస్టర్లు తమ ఇన్వెస్ట్మెంట్లను SIP లేదా లంప్సమ్ ద్వారా టాప్ అప్ చేస్తూ ఉండాలి. స్టాక్ మార్కెట్లు ఇటీవలి కాలంలో గరిష్ట స్థాయిల నుంచి దాదాపు 20% క్షీణించిన నేపథ్యంలో, పెట్టుబడిదారులు తమ పెట్టుబడుల సగటు వ్యయాన్ని తగ్గించడానికి తక్కువ నికర ఆస్తి విలువ (NAV) వద్ద యూనిట్లను కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల నిధుల లభ్యత ఆధారంగా ప్రస్తుత అస్థిరతను ఎక్కువగా ఉపయోగించుకోవడానికి తక్కువ ధరకు యూనిట్లను కొనుగోలు చేయవచ్చు. అవసరమైతే సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ (STP)ను కూడా ఉపయోగించుకోవచ్చు. ఇందులో లిక్విడ్ స్కీమ్‌లోని మీ మొత్తం పెట్టుబడులు క్రమపద్ధతిలో టార్గెట్ స్కీమ్‌కు ట్రాన్స్ఫర్ అవుతాయి.
షార్ట్, మీడియం- టర్మ్ డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం
ఇప్పటికే ఉన్న డెట్ ఇన్వెస్టర్లు లేదా డెట్ స్కీమ్స్‌లో పెట్టుబడి పెట్టాలనుకునే వారు.. వడ్డీ రేటు హెచ్చుతగ్గులకు తక్కువ అవకాశం ఉన్న షార్ట్ టర్మ్ డెట్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. అయితే వడ్డీ రేట్ల పెరుగుదల.. డెట్ ఇన్స్ట్రుమెంట్స్ విలువతో రివర్స్ రిలేషన్షిప్లో ఉంటుందని పెట్టుబడిదారులు గుర్తుంచుకోవాలి. డెట్ ఫండ్స్ హై- ఇంట్రస్ట్ సర్కిల్లో పేలవంగా పనిచేస్తాయని దీని అర్థం. ఇదే సమయంలో మీరు క్రెడిట్-రిస్క్ డెట్ ఫండ్లకు దూరంగా ఉండవచ్చు.
SGBలు, గోల్డ్ ETFలలో పెట్టుబడి పెట్టడం
బంగారం ద్రవ్యోల్బణానికి రక్షణగా ఉపయోగపడుతుంది. ఇప్పటికే ఉన్న పెట్టుబడిదారులు గోల్డ్ రిలేటెడ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసి పోర్ట్‌ఫోలియోను డైవర్సిఫైడ్‌గా మార్చుకోవచ్చు. ఇందుకు గోల్డ్ ఈటీఎఫ్‌లు లేదా సావరిన్ గోల్డ్ బాండ్లను ఎంచుకోవచ్చు. బంగారంలో పెట్టుబడుల విలువ కేటాయింపు మీ మొత్తం పోర్ట్‌ఫోలియోలో 5-10% మించి ఉండకూడదు. బంగారంపై మీ ఎక్స్పోజర్ 5% కంటే తక్కువగా ఉంటే.. గోల్డ్ ఫండ్స్‌కు ఎక్కువ నిధులు జోడించే ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. కొత్త పెట్టుబడిదారులు గోల్డ్ రిలేటెడ్ ఫండ్స్‌లో కనీసం 5% ఎక్స్పోజర్ ఉండేలా ఇన్వెస్ట్ చేయవచ్చు.
డైనమిక్ అసెట్ అలొకేషన్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం
సక్సెస్ఫుల్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్‌పీరియన్స్‌కు అసెల్ అలొకేషన్ (Asset Allocation) కీలకం. వివిధ అసెట్ క్లాస్‌ల వాల్యుయేషన్ల ఆధారంగా డెట్, ఈక్విటీలలో ఇన్‌బిల్ట్ అసెట్ అలొకేషన్ ఫీచర్లు ఉండే పథకాల కోసం పెట్టుబడిదారులు వెతకాలి. ఈ ఫీచర్ విలువపై ఆధారపడి కేటాయింపులో తరచుగా మార్పులు చేసుకోవచ్చు. పెట్టుబడిదారులు ఈ రెండు అసెట్ క్లాస్‌ల నుంచి మంచి ఫలితాలు పొందవచ్చు. ప్యూర్ ఈక్విటీ లేదా డెట్ స్కీమ్‌లతో పోలిస్తే ఇలాంటి ఫండ్స్‌లో రాబడి మరింత స్థిరంగా ఉంటుంది.
SIP కాంట్రిబ్యూషన్ పెంచడం
యాన్యువల్ పోర్ట్‌ఫోలియో రివ్యూ అనేది ప్రతి ఇన్వెస్టర్‌కు కీలకం. కాబట్టి SIP ఇన్వెస్ట్మెంట్ పరిమాణాన్ని సమీక్షించడం కూడా అంతే ముఖ్యం. ద్రవ్యోల్బణం దృష్ట్యా పెట్టుబడిదారులు SIP మొత్తాన్ని సంవత్సరానికి కనీసం 10% పెంచుతూ ఉండాలి. ఇది మీ పెట్టుబడి విలువల భవిష్యత్తు ఆర్థిక లక్ష్యాన్ని సమర్థవంతంగా మారుస్తుంది. పెట్టుబడి సమయంలో ద్రవ్యోల్బణం నుంచి ఉత్పన్నమయ్యే ఒత్తిడిని కూడా అదుపులో ఉంచుతుంది.
ఆందోళనలు అనవసరం
మీకు నిజంగా నిధుల అవసరం ఉంటేనే మీ ఈక్విటీ పెట్టుబడులను రీడీమ్ చేయాలి. లేదంటే ఈ ఆలోచనకు దూరంగా ఉండాలి. ఈ రిడమ్షన్కు పడిపోతున్న మార్కెట్ విలువ ఒక కారణం కాకూడదు. భయాందోళనగా కనిపించే ఇలాంటి పరిస్థితి ఇన్వెస్ట్ చేయడానికి లేదా పెట్టుబడులకు మరిన్ని నిధులను జోడించడానికి మంచి సమయం. ప్రస్తుత పరిస్థితిని పెద్ద సంపదను సృష్టించే అవకాశంగా భావించండి. మీరు భయాందోళనలకు లోనవుతుంటే, సంపద సృష్టిని కోల్పోవడమే కాకుండా పేలవమైన పెట్టుబడి అనుభవం భవిష్యత్తులో పెట్టుబడి పెట్టకుండా మిమ్మల్ని నిరోధిస్తుంది. అంతే ఇది ఒక దీర్ఘకాలిక ఆర్థిక నష్టంగా చెప్పుకోవచ్చు.
బీటెన్ డౌన్ సెక్టోరల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి
ప్రస్తుత పరిస్థితిలో కోర్ డైవర్సిఫైడ్ ఈక్విటీ పోర్ట్‌ఫోలియోకు సెక్టార్-ఓరియెంటెడ్ ఫండ్లను యాడ్ చేసుకోవచ్చు. వీటిని శాటిలైట్ ఫండ్స్ అని కూడా పిలుస్తారు. ఇటీవలి కాలంలో బ్యాంకింగ్, ఫార్మాస్యూటికల్స్, ఐటీ వంటి రంగాలు (సెక్టార్లు) భారీగా దెబ్బతిన్నాయి. దీర్ఘకాలంలో ఈ సెక్టార్లకు సంబంధించిన ఫండ్స్.. మీ మొత్తం పెట్టుబడి పోర్ట్‌ఫోలియోకు చాలా విలువను జోడించగలవు. ఇలాంటి పథకాలలో ఏకమొత్తంలో పెట్టుబడి పెట్టవచ్చు.
పైన చర్చించిన అన్ని వ్యూహాలు అన్ని రకాల పెట్టుబడిదారులకు తగినవి కాకపోవచ్చు. ఏదైనా వ్యూహాన్ని అనుసరించే ముందు మీరు రిస్క్ ప్రొఫైల్, వయసు, పెట్టుబడుల లక్ష్యాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. మరింత సమాచారం, తుది నిర్ణయం కోసం పెట్టుబడిదారులు ఆర్థిక సలహాదారులను సంప్రదించవచ్చు.
Published by:Mahesh
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.