చైనా కంపెనీల(China Companies) మీద ఉక్కు పాదం మోపుతోంది కేంద్ర ప్రభుత్వం(Central Government). గాల్వాన్(Galwan) ఘటన తర్వాత భారత్ చైనా(Bahrath-China) సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అప్పటి నుంచి భారత్ చైనాపై కఠినంగా వ్యవహరిస్తోంది. దేశ భద్రత దృష్ట్యా టిక్‌టాక్ వంటి 50కి పైగా పాపులర్ యాప్స్‌ను నిషేధించింది. ప్రస్తుతం భారత్‌లో హవా కొనసాగిస్తున్న స్మార్ట్‌ఫోన్(Smart Phone) కంపెనీలపై చర్యలు తీసుకునేందుకు సిద్దమైంది. గత కొన్నేళ్లుగా ఆదాయ పన్ను చట్టాలను ఉల్లంఘిస్తున్నాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న షియోమి, ఒప్పో, వివో వంటి చైనా కంపెనీల మీద గత నెలలో ఆదాయ పన్ను విభాగం అధికారులు రైడ్ చేశారు.
ఈ కంపెనీలపై ఆదాయాన్ని దాచిపెట్టడం, పన్నులు ఎగవేసేందుకు ఉద్దేశపూర్వకంగా లాభాలను అణిచివేసేందుకు ప్రయత్నించడం, ఇక్కడి స్థానిక పరిశ్రమకు నష్టం కలిగించేలా స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఆధిపత్య స్థానాన్ని దుర్వినియోగం చేయడం వంటి అభియోగాలపై ఆదాయపు పన్ను శాఖ, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) దర్యాప్తు ప్రారంభించింది. అంతేకాకుండా, సోర్సింగ్ కాంపోనెంట్లు, ఉత్పత్తుల పంపిణీలో పారదర్శకత పాటించలేదనే ఆరోపణలపై కూడా దర్యాప్తు చేపట్టింది. విచారణలో ఈ అభియోగాలు నిజమేనని తేలితే ఆయా కంపెనీలకు రూ.1000 కోట్ల జరిమానా విధించే అవకాశం ఉంది.
కాగా, చైనా కంపెనీలు ఇక్కడి ఆదాయపు పన్ను చట్టాలను దుర్వినియోగం చేస్తున్నాయని, నిర్బంధ వాణిజ్య పద్ధతులు అవలంభిస్తున్నాయని ఫెయిర్ ప్లే రెగ్యులేటర్ కాంపిటీషన్ కమీషన్ ఆఫ్ ఇండియా కూడా ఆరోపించింది. “గత కొన్ని సంవత్సరాలుగా చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు దాఖలు చేసిన చట్టబద్ధమైన ఫైనాన్షియల్ రిపోర్టింగ్, ఇన్షియల్ అసెస్మెంట్లో అనేక లోపాలను కనుగొన్నాం. ముఖ్యంగా పన్ను ఎగవేత, ఆదాయాలను దాచడం, ఫైళ్లను తారుమారు చేయడం వంటి చట్ట విరుద్దమైన కార్యకలాపాలను ఆయా కంపెనీలు అవలంభిస్తున్నాయి. వీటిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నాం.” అని ఒక ఉన్నత అధికారి తెలిపారు.
ఇది కూడా చదవండి : బంగ్లా ఫీల్డర్లు అంతే.. బంగ్లా ఫీల్డర్లు అంతే.. ఒక బంతికి 7 పరుగులు సమర్పయామి..
ఈ విషయాన్ని ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ (మెయిటీ) కూడా నిశితంగా పరిశీలిస్తోంది. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీల (RoC) ఫైలింగ్ ప్రకారం, ప్రధాన చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీలు బలమైన అమ్మకాలను కలిగి ఉన్నప్పటికీ, మార్కెట్ లీగ్ టేబుల్లలో మాత్రం నష్టాలు వచ్చినట్లు పేర్కొన్నాయి. తద్వారా పన్ను ఎగ్గొట్టాలని ప్రయత్నించాయని మోయిటీ ఆరోపించింది.
పన్ను ఎగ్గొట్టేందుకు నష్టాలు చూపుతున్న కంపెనీలు..
షియోమి, ఒప్పో, వివో కంపెనీలు 2019–20 ఆర్థిక సంవత్సరంలో రూ. 1 లక్ష కోట్లకు పైగా ఆదాయం, మార్కెట్ వాటాను పొందినప్పటికీ (2020–21 ఆర్థిక సంవత్సరానికి వారు ఇంకా ఆర్థిక రికార్డులను దాఖలు చేయలేదు) ఎటువంటి పన్నులు చెల్లించలేదని అధికారులు తెలిపారు. అంతేకాదు, ఒప్పో, వివో సంస్థలు 2016-17 ఆర్థిక సంవత్సరం నుండి భారతదేశంలో నష్టాలు వచ్చినట్లు చూపుతున్నాయి. భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో అగ్రగామిగా చెప్పుకునే షియోమి సైతం భారీ నష్టాలు వస్తున్నట్లు పేర్కొంది.
2018- 19 ఆర్థిక సంవత్సరంలో రూ. 2,447 కోట్లు, 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ. 3,277 కోట్లు నష్టం వాటిల్లినట్లు షియోమి ఐటీ రిటర్న్స్‌లో పేర్కొంది. గత కొన్నేళ్లుగా భారత్‌లో చైనా కంపెనీల హవా పెరగడంతో లావా, కార్బన్, మైక్రోమ్యాక్స్, ఇంటెక్స్ వంటి స్వదేశీ కంపెనీల మార్కెట్ వేగంగా పడిపోయింది. చైనా కంపెనీల రాకతో భారతీయ కంపెనీల వాటా గణనీయంగా తగ్గింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.