హోమ్ /వార్తలు /బిజినెస్ /

ఎరిక్‌సన్ కేసులో అనిల్ అంబానీని ఆదుకున్న ముఖేష్ అంబానీ... ముఖేష్, నీతా అంబానీలకు థాంక్స్ చెప్పిన అనిల్

ఎరిక్‌సన్ కేసులో అనిల్ అంబానీని ఆదుకున్న ముఖేష్ అంబానీ... ముఖేష్, నీతా అంబానీలకు థాంక్స్ చెప్పిన అనిల్

ముఖేష్ అంబానీ (left), అనిల్ అంబానీ (Right)

ముఖేష్ అంబానీ (left), అనిల్ అంబానీ (Right)

సుప్రీంకోర్టు ఇచ్చిన గడువులోపు ఎరిక్‌సన్‌కు చెల్లించాల్సిన రూ.550 కోట్ల బకాయిలను తీర్చేశామని ఆర్‌కామ్ అధికార ప్రతినిధి తెలిపారు.

  రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ, ఆయన భార్య నీతా అంబానీకి రిలయన్స్ కమ్యూనికేషన్ చైర్మన్ అనిల్ అంబానీ కృతజ్ఞతలు తెలిపారు. స్వీడిష్ సంస్థ ఎరిక్ సన్‌కు బకాయిలు చెల్లించడంలో తనకు సాయపడినందుకు అనిల్ అంబానీ థాంక్స్ చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం న్యాయస్థానం ఇచ్చిన గడువులోపు ఎరిక్‌సన్‌కు చెల్లించాల్సిన మొత్తం రూ.550 కోట్లు, వడ్డీ బకాయిలను తీర్చేశామని ఆర్‌కామ్ సంస్థ అధికార ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపారు. 2014వ సంవత్సరంలో రిలయన్స్ కమ్యూనికేషన్స్, ఎరిక్‌సన్ మధ్య ఒప్పందం కుదిరింది. ఆర్‌కామ్ నెట్‌వర్క్‌ను ఆపరేట్ చేయడానికి ఎరిక్‌సన్ అగ్రిమెంట్ చేసుకుంది. ఆ సేవలకు సంబంధించిన బకాయిలు చెల్లించలేదని గత ఏడాది ఎరిక్‌సన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో అనిల్ అంబానీని దోషిగా తేల్చిన న్యాయస్థానం ఎరిక్‌సన్‌కు బకాయిలు చెల్లించేందుకు నాలుగు వారాల గడువు విధించింది. అనిల్ అంబానీతో పాటు మరో ఇద్దరు డైరెక్టర్లను కూడా కోర్టు ఆదేశించింది. డబ్బులు చెల్లించకలేకపోతే మూడు నెలల జైలు శిక్ష విధించాల్సి వస్తుందని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు మార్చి 19 (మంగళవారం)తో ముగుస్తుంది. గత ఫిబ్రవరిలోనే ఆర్‌కామ్ సంస్థ సుప్రీంకోర్టు వద్ద రూ.118 కోట్లను జమ చేసింది. ఇప్పుడు ముఖేష్ అంబానీ సాయం చేయడంతో ఎరిక్‌సన్‌తో 18 నెలల వివాదానికి ఫుల్ స్టాప్ పడింది.


  ఈ కష్టసమయంలో నా వెన్నంటి నిలబడిన మా అన్న ముఖేష్ అంబానీ, నీతా అంబానీలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. బలమైన కుటుంబ బంధాలను, విలువలను చాటిచెప్పడంతో పాటు సరైన సమయంలో సహకారం అందించారు. వారు చూపిన ఆదరాభిమానాలకు నేను, నా కుటుంబం కృతజ్ఞులం.

  అనిల్ అంబానీ, ఆర్‌కామ్ చైర్మన్


  రిలయన్స్ గ్రూప్ రెండుగా విడిపోయిన తర్వాత అనిల్ అంబానీని ముఖేష్ అంబానీ ఆదుకోవడం ఇది రెండోసారి. 2018 సంవత్సరంలో రిలయన్స్ కమ్యూనికేషన్స్‌కు చెందిన రూ.3000 కోట్ల విలువైన వైర్‌లెస్ సామగ్రిని ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ కొనుగోలు చేసింది. రిలయన్స్ జియో మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఆర్‌కామ్ కొంత ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంది.


  మరోవైపు బీఎస్‌ఈలో ఆర్‌కామ్ షేర్ సోమవారం 9.30శాతం పడిపోయి రూ.4 వద్ద ముగిసింది. ఒకప్పుడు దేశంలోనే రెండో అతి పెద్ద సంస్థ ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోయింది. రూ.46,000 కోట్ల అప్పుల్లో మునిగిపోయింది. ఈ క్రమంలో 2017లో తమ వైర్‌లెస్ బిజినెస్‌ను మూసేయాల్సి వచ్చింది. ఓ దశలో ఇన్‌కం ట్యాక్స్ రీఫండ్స్‌గా వచ్చిన రూ.250 కోట్లను కూడా ఎరిక్‌సన్‌ సంస్థకు కనీసం వడ్డీగా కానీ, కొంత మొత్తంగా కూడా చెల్లించలేని పరిస్థితి వచ్చింది. ఆ నిధులను విడుదల చేయొద్దంటూ ఆ సంస్థకు ప్రధాన బ్యాంకర్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ ఆదేశించడంతో ఆ పరిస్థితి నెలకొంది.


  ఆర్‌కామ్, ఎరిక్‌సన్ మధ్య యుద్ధం 2017లో మొదలైంది. ఏడేళ్ల కాలానికి తాము చేసుకున్న ఒప్పందంలో భాగంగా తమకు చెల్లించాల్సిన రూ.1500 కోట్ల బకాయిలను చెల్లించడం లేదంటూ ఎరిక్‌సన్ సంస్థ న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో వివాదం మొదలైంది. ఆ వివాదం తర్వాత నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ వద్దకు వెళ్లింది. అక్కడ రూ.550 కోట్లకు సింగల్ సెటిల్‌మెంట్ కింద ఒప్పందం కుదిరింది. గత ఏడాది సెప్టెంబర్ 30లోపు చెల్లించాలని ఆర్‌కామ్‌ను ట్రిబ్యునల్ ఆదేశించింది. అయితే, ఆ లోపు బకాయిలు చెల్లించలేకపోవడంతో ఎరిక్‌సన్ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అత్యున్నత న్యాయస్థానం ఆర్‌కామ్‌కు మరోసారి డిసెంబర్ 15, 2018 వరకు గడువు ఇచ్చింది. అయితే, ఆ లోపు కూడా బకాయిలు చెల్లించలేకపోయింది. ఆర్‌కామ్ సంస్థ రూ.550 కోట్లు కూడా చెల్లించలేదంటూ ఎరిక్‌సన్ సంస్థ కోర్టు ధిక్కరణ కింద  న్యాయస్థానంలో మూడు పిటిషన్లు దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం అనిల్ అంబానీకి మార్చి 19 వరకు డెడ్‌లైన్ విధించింది. అయితే, ఒక రోజు ముందు ముఖేష్ అంబానీ సర్దుబాటు చేయడంతో అనిల్ అంబానీ, ఎరిక్‌సన్ వివాదం ముగిసింది.

  First published:

  Tags: Anil Ambani, Mukesh Ambani, Reliance, Supreme Court

  ఉత్తమ కథలు