వాహనాల కోసం తీసుకునే మోటార్ ఇన్సూరెన్స్ ప్రీమియం ధరలు త్వరలో పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మద్రాస్ హైకోర్టు ఆదేశాల వల్ల ఇన్సూరెన్స్ ప్రీమియంలపై ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. సెప్టెంబర్ 1 నుంచే ఇది అమలులోకి రావొచ్చని చెబుతున్నారు. సెప్టెంబర్ 1 తర్వాత కొనే ప్రతీ వాహనానికి బంపర్-టూ-బంపర్ ఇన్సూరెన్స్ తప్పనిసరిగా ఉండాలంటూ మద్రాస్ హైకోర్టు కొన్ని సూచనలు చేసింది. దీంతో ప్రీమియంల పెరుగుదల కచ్చితమనే అంచనాలు వెలువడుతున్నాయి.
బంపర్-టూ-బంపర్ ఇన్సూరెన్స్ తీసుకోవడంతో పాటు అదనంగా డ్రైవర్, ప్యాసింజర్లు, వాహన యజమానికి ఐదు సంవత్సరాల కాలానికి ఇన్సూరెన్స్ కవర్ కూడా అందులో ఉండాలని మద్రాస్ హైకోర్టు చెప్పింది. ఓ బీమాదారుడికి రూ.14.6లక్షల నష్టపరిహారం ఇవ్వాలని ఈరోడ్‌లోని మోటార్ యాక్సిడెంట్ క్లయిమ్స్ ట్రిబ్యూనల్ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ఓ ఇన్సూరెన్స్ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ను న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వైద్యనాథన్ విచారించారు.
కారు యజమాని.. యాక్ట్ పాలసీ ప్రకారమే ఇన్సూరెన్స్ తీసుకున్నారంటూ ఇన్సూరెన్స్ సంస్థ వాదనలు వినిపించింది. ఇది వాహనానికి డ్యామేజీ జరిగితే వర్తిస్తుందని, అందులో ప్రయాణించే వారికి కవర్ కాదని చెప్పింది. ఈ సందర్భంగా బాధితుడికి నష్టపరిహారం చెల్లించడం ఇన్సూరెన్స్ సంస్థ బాధ్యత కాదని, వాహన యజమాని చెల్లించాలని ఈ కేసులో కోర్టు తీర్పునిచ్చింది. ఆ సందర్భంగా సెప్టెంబర్ 1 తర్వాత కొనుగోలు చేసే ప్రతీ వాహనానికి బంపర్-టూ-బంపర్ ఇన్సూరెన్స్‌తో పాటు దాంట్లోనే యజమాని, ప్యాసింజర్లు, డ్రైవర్లకు బీమా కవర్ అయ్యేలా ఐదు సంవత్సరాల పాలసీ ఉండాలన్నారు.
“సెప్టెంబర్ 1వ తేదీ తర్వాత కొనుగోలు చేసే ప్రతీ వాహనానికి ప్రతీ ఏడాది బంపర్-టూ-బంపర్ ఇన్సూరెన్స్ తీసుకోవడం తప్పనిసరి. అదనంగా ఇందులోనే డ్రైవర్, ప్యాసింజర్లు, వాహన యజమానికి ఐదేళ్ల ఇన్సూరెన్స్ కవరేజీ ఉండాలి” అని జస్టిస్ వైద్యనాథన్ చెప్పారు.
ఇప్పటి వరకు బంపర్-టూ-బంపర్ మోటార్ ఇన్సూరెన్స్.. వాహనాల విడిభాగాలకు డ్యామేజీ అయితే కవరేజీని ఇస్తున్నాయి. ఇక కోర్టు ఆదేశాల ప్రకారం దీంట్లోనే వాహన యజమాని, డ్రైవర్, ప్యాసింజర్లకు కవర్ వర్తించాలనడంతో ప్రీమియంల ధరలు పెరుగుతాయని విశ్లేషకులు చెబుతున్నారు. కోర్టు ఆదేశాలు యథాతథంగా కొనసాగితే ప్రీమియంలు అధికమవుతాయంటున్నారు.
కోర్టు ఆదేశాల ప్రకారం ఇన్సూరెన్స్ సంస్థలు ఓ కొత్త పాలసీని డిజైన్ చేసుకోవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ కొత్త విధానం ఇన్సూరెన్స్ సంస్థలకు లాభించే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం మోటార్ ఇన్సూరెన్స్‌లతో మూడు విధానాలు ఉన్నాయి. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్, ఓన్ డ్యామేజీ పాలసీ, పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవరేజీ పాలసీలు ఉన్నాయి. వాహనం కొన్న తొలి సంవత్సరం పర్సనల్ యాక్సిడెంట్ పాలసీ తీసుకోవడం కచ్చితం కాగా.. రెండో సంవత్సరం నుంచి ఇష్టం ఉంటే తీసుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Business