MORE THAN 100 MILLIONAIRES MADE AN UNUSUAL PLEA ON WEDNESDAY TAX US NOW NS GH
WEF Davos: ‘మాకు పన్నులు విధించండి ప్లీజ్’.. ప్రపంచ కుబేరుల అభ్యర్థన.. ఎందుకంటే?
ప్రతీకాత్మక చిత్రం
ప్రపంచవ్యాప్తంగా ఉన్న 100కు పైగా మిలియనీర్లు తమకు పన్ను విధించాల్సిందిగా అభ్యర్ధించారు. ఈ మేరకు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో నిర్వహిస్తున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్(WEF) ఆన్లైన్ సమావేశానికి ఓ బహిరంగ లేఖను పంపారు.
భారత్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయన్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 100కు పైగా మిలియనీర్లు తమకు పన్ను విధించాల్సిందిగా అభ్యర్ధించారు. ఈ మేరకు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో నిర్వహిస్తున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్(WEF) ఆన్లైన్ సమావేశానికి ఓ బహిరంగ లేఖను పంపారు. ఆర్థిక అసమానతలపై ఆక్స్‌ఫామ్ రూపొందించిన నివేదిక అనంతరం వీరంతా ఈ విధంగా స్పందించినట్లు తెలుస్తోంది. ప్రపంచంలోని అత్యంత సంపన్నులపై పన్ను విధిస్తే సంవత్సరానికి 2.52 ట్రిలియన్ డాలర్లు సమకూరుతాయని.. సంపన్న వ్యక్తులు, లాభాపేక్ష రహిత స్వచ్ఛంద సంస్థల సహకారంతో జరిపిన ఓ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.
ప్రపంచ నలుమూలల నుంచి తమకు సెకనుకు 15,000 డాలర్లు, అంటే రోజుకు 1.3 బిలియన్ డాలర్ల సంపద పోగుపడుతోందని, అందువల్ల తమపై వెల్త్ టాక్స్(wealth tax) విధించాల్సిన అవసరం ఉందని పేట్రియాటిక్ మిలియనీర్లు ట్వీట్ చేశారు. "గత రెండేళ్లలో ప్రపంచం విపరీతమైన బాధలను ఎదుర్కొన్నప్పటికీ, మహమ్మారి సమయంలో మా సంపద పెరిగిందని చాలా మంది అంటున్నారు. ఇప్పటికైనా మాలో కొందరు న్యాయంగా పన్నులు చెల్లిస్తామని చెప్పాలి" అని పేర్కొన్నారు. ఈ లేఖపై సంతకం చేసినవారిలో అమెరికా, కెనడా, జర్మనీ, బ్రిటన్, డెన్మార్క్, నార్వే, ఆస్ట్రియా, నెదర్లాండ్స్, ఇరాన్‌లకు చెందిన సంపన్నులు ఉన్నారు.
చట్టాలన్నీ చుట్టాలే..
దావోస్ సమావేశానికి(Davos meet) లేఖ పంపిన జాబితాలో ప్రపంచ ప్రఖ్యాత సంస్థ డిస్నీ వారసురాలు అబిగైల్ డిస్నీ సహా 102 మంది మిలియనీర్లు ఉన్నారు. ఈ సందర్భంగా చాలా దేశాల్లో ప్రస్తుత పన్ను విధానం అన్యాయంగా ఉందని, ధనవంతులను మరింత ధనవంతులుగా మార్చేలా ఉద్దేశపూర్వకంగా చట్టాలు రూపొందాయని అబిగైల్ డిస్నీ అభిప్రాయపడ్డారు. ప్రపంచంలోని ప్రతి దేశంలోని సంపన్నులు న్యాయబద్ధంగా పన్నులు చెల్లించాలని డిమాండ్ చేయాలని ఈ లేఖలో డిస్నీ పేర్కొన్నారు. ‘మేమంతా అత్యంత ధనవంతులం. మాకు పన్ను విధించండి’ అంటూ అసాధారణ డిమాండ్‌ను వినిపించారు.
కరోనాతో దిగజారిన పరిస్థితి..
కరోనా ప్రారంభమైన తొలి రెండేళ్లలోనే ప్రపంచంలోని 10 మంది కుబేరుల సంపద 1.5 ట్రిలియన్ డాలర్లకు పెరింగిదని ఆక్స్‌ఫామ్(Oxfom) నివేదించింది. ఫలితంగా అసమానతలు, పేదరికం పెరిగాయని తెలిపింది. 10 మంది ధనవంతుల సంపద రెట్టింపు అయిందని, 99% మంది ప్రజల ఆదాయం మాత్రం కరోనా కారణంగా అధ్వాన్నంగా మారిందని స్పష్టీకరించింది. ఫైట్ ఫర్ ఇన్‌ఈక్వాలిటీ(Fight for Inequality) అలయన్స్, ఆక్స్‌ఫామ్, అమెరికాకు చెందిన ఇన్స్టిట్యూట్ ఫర్ పాలసీ స్టడీస్ థింక్ ట్యాంక్ సహా లాభాపేక్ష రహిత సంస్థల నెట్‌వర్క్‌తో వెల్త్ ట్యాక్స్ అధ్యయనం జరిగింది. ఈ పన్నులతో ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్లకు నిధులు సమకూర్చడం సహా.. పేదరికాన్ని తగ్గించడంతో పాటు తక్కువ, అల్పాదాయ దేశాల్లో 3.6 బిలియన్ల మందికి ఆరోగ్య సంరక్షణ, సామాజిక రక్షణను కల్పించవచ్చని ఈ అధ్యయనం పేర్కొంది.
రియాలిటీ ట్యాక్స్..
బిలియనీర్లపై 10 శాతం పన్నులు విధిస్తే సంవత్సరానికి 3.62 ట్రిలియన్ డాలర్లు సమకూరుతాయని ఓ అధ్యయనం చెబుతోంది. మరోవైపు దాదాపు 700 మంది అమెరికన్ బిలియనీర్ల సంపదపై పన్ను విధింపు ప్రణాళికను గతేడాది అమెరికా కాంగ్రెస్‌లో డెమొక్రాట్లు ప్రతిపాదించారు. ప్రపంచంలోని అత్యంత ధనవంతుల సంపదను ఇబ్బడిముబ్బడిగా పెంచే వ్యవస్థను పెంచి పోషించాలనుకోవడం లేదు. వారికి విధించే పన్నులతో పేదరికాన్ని సులభంగా నివారించవచ్చు అని పేట్రియాటిక్ మిలియనీర్స్ చైర్మన్ మోరిస్ పెర్ల్ తెలిపారు.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.