కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఆర్థిక సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే. దీంతో సామాన్యులకు ఊరట కలిగించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI ఈఎంఐలపై మూడు నెలలు మారటోరియం ప్రకటించింది. అంటే బ్యాంకులకు, ఫైనాన్స్ సంస్థలకు మీరు చెల్లించాల్సిన ఈఎంఐలను మూడు నెలలు వాయిదా వేయొచ్చు. 2020 మార్చి 1 నుంచి 2020 మే 31 వరకు అన్ని టర్మ్ లోన్ల ఈఎంఐలకు, క్రెడిట్ కార్డ్ బిల్లులకు ఇది వర్తిస్తుంది. అన్ని బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు ఈఎంఐ మారటోరియంను అంగీకరించాయి. అయితే ఈఎంఐల వాయిదా విషయంలో ఒక్కో బ్యాంకు ఒక్కో పద్ధతిని పాటిస్తున్నాయి. అందుకే ఈఎంఐలు వాయిదా వేయాలనుకునే కస్టమర్లు అప్రమత్తంగా ఉండి, తమ ఈఎంఐలు వాయిదా పడేలా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఏఏ బ్యాంకు ఏఏ పద్ధతిలో ఈఎంఐలను వాయిదా వేస్తున్నాయో తెలుసుకోండి.
State Bank of India: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI ఈఎంఐ మారటోరియం విషయంలో కస్టమర్లకు మూడు ఆప్షన్స్ ఇచ్చింది. ఈఎంఐలు ఎప్పట్లాగే చెల్లించడం, ఈఎంఐలను వాయిదా వేయడం, చెల్లించిన ఈఎంఐలను వెనక్కి తీసుకోవడం. వీటిలో కస్టమర్లు ఏదైనా ఎంపిక చేసుకోవచ్చు. మొదటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మీరు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. రెండు, మూడు ఆప్షన్లకు మాత్రం దరఖాస్తు చేయాలి. ఎలాగో తెలుసుకునేందుకు
ఇక్కడ క్లిక్ చేయండి.
HDFC Bank: మీరు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కస్టమర్ అయితే మారటోరియం పొందాలనుకుంటే బ్యాంకు వెబ్సైట్లో దరఖాస్తు చేయాలి. లేదా 022-50042333, 022-50042211 నెంబర్లకు కాల్ చేయాలి.
ICICI Bank: ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లు ఎస్ఎంఎస్ లేదా ఇమెయిల్ ద్వారా వచ్చిన లింక్ క్లిక్ చేసి లేదా https://www.icicibank.com/ వెబ్సైట్ ఓపెన్ చేసి మారటోరియం ఎంచుకోవచ్చు.
Axis Bank: మీరు యాక్సిస్ బ్యాంక్ కస్టమర్ అయితే మీకు మారటోరియం ఆటోమెటిక్‌గా వర్తిస్తుంది. ఒకవేళ మీరు ఈఎంఐ ఎప్పట్లాగే చెల్లించాలనుకుంటే మారటోరియం అవసరం లేదంటూ బ్యాంకుకు తప్పనిసరిగా మెయిల్ పంపాలి. లేకపోతే మీరు మారటోరియం ఎంచుకున్నట్టే బ్యాంకు భావిస్తుంది.
Canara Bank: మీరు కెనెరా బ్యాంక్ కస్టమర్ అయితే ఇప్పటికే ఎస్ఎంఎస్ ద్వారా ఇన్స్ట్రక్షన్స్ పంపింది బ్యాంకు. మారటోరియం కోరుకునే కస్టమర్లు ఎస్ఎంఎస్లో వెల్లడించినట్టుగా no అని రిప్లై ఇవ్వాలి. అప్పుడే ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సిస్టమ్ పేమెంట్, పోస్ట్ డేటెడ్ చెక్స్ లాంటివి మూడు నెలలు వాయిదా పడతాయి.
IDFC First Bank: మీరు ఐడీఎఫ్సీ బ్యాంక్ కస్టమర్ అయితే ఇమెయిల్ అప్లికేషన్ ద్వారా దరఖాస్తు చేయాలి. ఇమెయిల్‌లో లోన్ వివరాలు వెల్లడించాలి.
IDBI Bank: ఐడీబీఐ బ్యాంక్ కస్టమర్లకు ఆటోమెటిక్‌గా అన్ని అకౌంట్లకు మారటోరియం వర్తింపజేసింది. ఒకవేళ మీరు మీ ఈఎంఐ చెల్లించాలనుకుంటే 2020 ఏప్రిల్ 3 లోగా moratorium@idbi.co.in ఇమెయిల్ ఐడీకి మీ లోన్ వివరాలతో మెయిల్ పంపాలి.
మిగతా బ్యాంకులు కూడా దాదాపుగా ఇలాంటి పద్ధతులే పాటిస్తున్నాయి. అందుకే మీరు మీ బ్యాంకుకు కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. అధికారిక వెబ్సైట్లలో కూడా సమాచారం ఉంటుంది. మీరు ఇప్పటికే మార్చి ఈఎంఐ చెల్లించినట్టైతే కొన్ని బ్యాంకులు ఈఎంఐ తిరిగి ఇచ్చేస్తున్నాయి. ఒకవేళ మీ దగ్గర డబ్బులు ఉన్నట్టైతే మారటోరియం ఎంచుకోకుండా ఎప్పట్లాగే ఈఎంఐ చెల్లించడం మంచిది. ఎందుకంటే మీరు మారటోరియం ఎంచుకుంటే ఔట్స్డాండింగ్పై వడ్డీ అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
EPF Withdrawal: మీ పీఎఫ్ డబ్బులు 3 రోజుల్లో మీ అకౌంట్లోకి... విత్‌డ్రా చేయండి ఇలా
Indian Railways: రైలు టికెట్ క్యాన్సిల్ చేశారా? రీఫండ్ ఇలా పొందండి
EPF Account: ఈపీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి హెచ్చరిక... ఈ విషయాలు మర్చిపోవద్దు