డబ్బులు సంపాదించాలని అందరికీ ఉంటుంది. కోట్లు సంపాదించి కోటీశ్వరుడు అయిపోవాలని చాలా మంది కలలు కంటుంటారు. ప్రతి వ్యక్తి జీవితంపై డబ్బు అత్యంత ప్రభావాన్ని చూపుతుందనేది ఎవరూ కాదనలేని సత్యం. డబ్బు లేనిదే ఏ పనీ జరగని రోజులివి. ఆర్థిక క్రమశిక్షణ మనకు ఎంత అవసరమో గతేడాది లాక్ డౌన్ చాటి చెప్పింది. డబ్బులు లేని పరిస్థితుల్లో పొదుపు చేసిన మొత్తం ఎంతగానో ఉపయోగపడింది. మరి, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఎదుర్కొనేంత డబ్బు సంపాదించాలంటే? కూడబెట్టాలంటే? అదో పెద్ద ప్రణాళిక అనే చెప్పాలి. పదేళ్ల క్రితం రూ.5 వేల జీతం వచ్చినా సరే సగటు కుటుంబం దానితో నెలంతా గడిపేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఆ డబ్బు ఏమాత్రం సరిపోక అప్పులు చేయాల్సిన పరిస్థితి. దీనికి ప్రధాన కారణం ద్రవ్యోల్బణం.
ద్రవ్యోల్బణం కారణంగా రూపాయి విలువ దారుణంగా పడిపోయి, ప్రజల కొనుగోలు శక్తి తగ్గుతుంది. అందువల్ల, డబ్బు సంపాదించడం ఒక్కటే కాదు.. ద్రవ్యోల్భణాన్ని, మార్కెట్ పరిస్థితులను అంచనా వేస్తూ భవిష్యత్ అవసరాల కోసం తెలివైన పెట్టుబడులు పెట్టాలి. అంతేకాక, మీ ఆర్థిక లక్ష్యాలను భవిష్యత్ ద్రవ్యోల్బణాన్ని అంచనా వేసి ఏర్పర్చుకోవాలి.
ఉదాహరణకు ఎంబీఏ చదవడానికి ప్రస్తుతం రూ .15 లక్షలు ఖర్చవుతుందని అనుకుందాం. రాబోయే 20 ఏళ్లలో 10 శాతం ద్రవ్యోల్బణం పెరుగుతుందని ఊహిస్తే, అప్పడు ఇదే ఎంబీఏ చదవడానికి రూ .1 కోటికి పైగా ఖర్చవుతుంది. కాబట్టి, భవిష్యత్తును అంచనా వేస్తూ లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. రోజులు పెరుగుతున్న కొద్దీ రూపాయి విలువ తగ్గుతుందని గుర్తించుకోవాలి. సాధ్యమైనంత త్వరగా లక్ష్యాన్ని చేరుకునేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలి.
ద్రవ్యోల్బణాన్ని అంచనా వేస్తూ పెట్టుబడి..
ద్రవ్యోల్భణ రేటును 5 % నుంచి 6 % మేర ఉంటుందనే అంచనాతో మీ భవిష్యత్ లక్ష్యాలను రూపొందించుకోండి. ఎందుకంటే 5% లేదా 6% ద్రవ్యోల్బణ రేటును సగటు రేటుగా పరిగణలోకి తీసుకోవచ్చు. తద్వారా, మీ పిల్లల విద్య, వైద్య ఖర్చులను అంచనా వేసుకొని, పెట్టుబడి పెట్టండి. మీరు పెట్టుకున్న లక్ష్యం, భవిష్యత్తులో దానికి అయ్యే ఖర్చు, ద్రవ్యోల్బణ రేటు వంటి వాటిని అంచనా వేసుకొని ముందుకు వెళ్లాలి. దీని కోసం మీరే సొంతంగా మార్కెట్ పరిస్థితులపై పరిశోధన చేయాలి. ఉదాహరణకు మీరు కోటి రూపాయలను సంపాదించాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నారనుకోండి. దాని కోసం రెండు పెట్టుబడి మార్గాలను అనుసరించండి
మొదటిది పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెట్ కాగా, రెండోది, మంత్లీ సిప్ (సిస్టమెటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్). ఈ రెండు విధానాల్లో దేని ద్వారా మీరు త్వరగా కోటి రూపాయల లక్ష్యాన్ని చేరుకుంటారో జాగ్రత్తగా లెక్కగట్టుకోండి. మీరు ఎంత ఎక్కువ పెట్టుబడి పెడితే.. అంత త్వరగా రూ. కోటి లక్ష్యాన్ని చేరుకోవచ్చని గుర్తించుకోండి. ఉదాహరణకు, మీరు ఈ రోజు ఈక్విటీలలో రూ .10 లక్షలు పెట్టుబడి పెడితే, రాబోయే 20 సంవత్సరాలలో మీ పెట్టుబడికి 12 శాతం రాబడి వస్తుందనుకుంటే, అప్పుడు మీ కోటి రూపాయల లక్ష్యాన్ని చేరుకోవచ్చు. లేదా నెలకు రూ.5,000 మొత్తాన్ని SIP ద్వారా ఈక్విటీ పథకంలో పెట్టుబడి పెట్టడం కొనసాగిస్తే, 12 శాతం రాబడి వస్తుందననుకుంటే, వచ్చే 25 సంవత్సరాలలో మీరు కోటి రూపాయల లక్ష్యాన్ని చేరుకోవచ్చు. అందువల్ల, మీ పెట్టుబడి చిన్న మొత్తం అయినా సరే.. తొందరగా ప్రారంభించడం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి. మీరు ఎంత ఎక్కువ పెట్టుబడి పెడితే అంత త్వరగా మీరు టార్గెట్‌ను చేరుకోగలుగుతారని గుర్తించుకోండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Business, Money, Money making