ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ‘మెటా’ (Meta) వరుస లేఆఫ్స్ (Layoffs) విధిస్తోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగం కోల్పోయిన వారు తమ అనుభవాలను వివిధ రకాలుగా షేర్ చేసుకుంటున్నారు. తాజాగా, ‘మెటా’ మాజీ ఉద్యోగిని చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఏ పనీ చేయనందుకు తనకు రూ.1.50కోట్ల జీతం ఇచ్చేవారని చెప్పుకొచ్చింది. టిక్‌టాక్‌లో చేసిన వీడియోలతో కంపెనీలో తాను పొందిన అనుభవాన్ని గుర్తు చేసుకుంది.
2022 సెప్టెంబర్ నుంచి 2023 ఫిబ్రవరి వరకు ‘మెటా’ కంపెనీలో రిక్రూటర్‌గా పనిచేసిన ‘మేడ్‌లిన్ మచాడో’ ఈ వ్యాఖ్యలు చేసింది. మెటా కంపెనీలో పనేమీ ఉండకపోయేదని చెప్పుకొచ్చింది. ముఖ్యంగా హెచ్‌ఆర్ రిక్రూటింగ్ విభాగంలో తాము ఖాళీగా ఉండేవారమని వెల్లడించింది.
‘కంపెనీలో జాయిన్ అయ్యాక మా బాస్ వచ్చి ఏం చేయొద్దని చెప్పారు. ఆర్నెళ్ల వరకు నియామకాలేవీ జరపొద్దని సూచించారు. బహుశా ఏడాది వరకు కూడా ఇది కొనసాగవచ్చని నాతో చెప్పారు. కంపెనీలో చేరాక మొదటగా వారు చెప్పే మాట ఇదే. దీంతో నాకు దిమ్మ తిరిగింది. ఖాళీగా ఉండటానికి 1,90,000 డాలర్ల(రూ.1.50కోట్లు) వేతనాన్ని ఇస్తున్నారా? అని అనిపించింది’ అని మేడ్‌లిన్ వీడియోలో చెప్పింది.
ఆర్నెళ్ల పాటు ఏ పనీ చేయలేదని మేడ్‌లిన్ తెలిపింది. తనతో పాటు టీంలో ఉన్నవారంత కొత్తవారేనని చెప్పుకొచ్చింది. ‘మా నుంచి పై అధికారులు ఆశించేది ఒక్కటే. మేం బాగా నేర్చుకోవడం. నేర్చుకున్న దానిని అభ్యసించడం. అంతకుమించి చేసేదేం లేదక్కడ. విచిత్రమేంటంటే రోజూ చాలా మీటింగ్‌లు అయ్యేవి. అందులో ఏదైనా మాట్లాడతారా అంటే అదీ లేదు. రిక్రూట్‌మెంట్ చేయకూడదనే తప్ప మరో విషయం ఉండదు. పైగా, మిగతా కంపెనీల నియామక ప్రక్రియ గురించి చర్చించేవారు. ఈ మీటింగ్‌లు నాకు ఆశ్చర్యాన్ని కలిగించేవి. నా టీంలోని వారందరి పరిస్థితి ఇదే’ అని మేడ్‌లిన్ వీడియోలో చెప్పింది.
ఇది కూడా చదవండి : రైల్వే చరిత్రలో తొలిసారి.. ఈ మహిళా టీసీ చేసిన పనికి రైల్వే శాఖ ఫిదా!
ఆర్నెళ్ల పాటు ఇదే విధంగా వృత్తి జీవితం కొనసాగిందని మేడ్‌లిన్ గుర్తు చేసుకుంది. ఆ తర్వాత ఎలాగోలా ఏడాది వరకు ఇలాగే గడిపేద్దామని తాను భావించినట్లు వెల్లడించింది. కానీ, తను అనుకున్నది జరగలేదని చెప్పింది. ఆర్నెళ్లు కాగానే మాస్ లేఆఫ్స్‌లలో భాగంగా ఉద్యోగం కోల్పోయానని తెలిపింది. కానీ, ఆర్నెళ్ల పాటు కొత్తగా నేర్చుకుందేమీ లేదని చెప్పుకొచ్చింది. అదంతా వృథా ప్రయాస అంటూ తీసిపారేసింది. అయితే, మెటాలో ఉత్తమమైన ఆన్‌బోర్డింగ్, ట్రైనింగ్ సెషన్స్ ఉంటాయని కొనియాడింది.
వ్యాఖ్యలపై క్లారిటీ..
ఈ టిక్‌టాక్ వీడియో వైరల్ కావడంతో చాలామంది తనపై విమర్శలు గుప్పించారని తెలిపింది. చాలామంది తనను బద్ధకస్తురాలిగా పిలిచారని, కెరీర్‌తో చెలగాటం ఆడుతున్నావంటూ చెప్పారని వివరించింది. ఈ మేరకు మరో వీడియో రిలీజ్ చేసి లింక్‌డ్‌ఇన్‌లో తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చింది. ‘నేను చేసిన వీడియో టిక్‌టాక్‌లో మరో విధంగా వైరల్ అవుతోంది. నా ఉద్దేశం అది కాదు. జాబ్‌లో చేరగానే నాకు పని అప్పజెబుతారని ఊహించా. ఆర్నెళ్ల పాటు నేర్చుకున్నాం అంతే. మా పై అధికారులు, కొలీగ్స్ మొత్తం చూసుకునేవాళ్లు’ అని లింక్‌డ్ఇన్‌లో మేడ్‌లిన్ క్లారిటీ ఇచ్చింది.
ఆగని మెటా లే ఆఫ్స్
ఆర్థిక అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ‘మెటా’ కంపెనీ భారీ సంఖ్యలో ఉద్యోగాల్లో కోత విధిస్తోంది. మొదటగా 11 వేల మంది ఉద్యోగులకు లే ఆఫ్ విధించింది. తాజాగా మరో 10 వేల మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Layoffs, Meta, Tech news, VIRAL NEWS