మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ (Max Life Insurance) కంపెనీ మరో కొత్త పాలసీని లాంచ్ చేసింది. మ్యాక్స్ లైఫ్ స్మార్ట్ సెక్యూర్ ఈజీ సొల్యూషన్ (Max Life Smart Secure Easy Solution) పేరుతో కొత్త ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇది త్రీ-ఇన్-వన్ ప్రొటెక్షన్ ప్లాన్. ఇది లైఫ్ పాలసీ(Policy) ప్రయోజనాలు, క్లిష్టమైన అనారోగ్యం, వైకల్యం, ఇతర ప్రమాదాలను కవర్ చేస్తుంది. ప్రధానంగా స్వయం ఉపాధి పొందే వ్యక్తులే లక్ష్యంగా పాలసీని తీసుకొచ్చారు. అయితే వీరితో పాటు ఫిక్స్‌డ్ శాలరీ(Salary) పొందేవారు, ఇతరులు కూడా అనిశ్చితుల నుంచి సమగ్ర రక్షణ పొందడానికి ఈ పాలసీలో సొల్యూషన్స్ ఉన్నాయి.
తాజా పాలసీ మ్యాక్స్ లైఫ్ అందించే స్మార్ట్ సెక్యూర్ ప్లస్ ప్లాన్, క్రిటికల్ ఇల్‌నెస్ అండ్ డిసేబిలిటీ హెల్త్ రైడర్ ప్లాన్‌ల సమ్మేళనంగా చెప్పుకోవచ్చు. స్మార్ట్ సెక్యూర్ ప్లస్ ప్లాన్ అనేది యాక్సిడెంటల్ కవర్ ఆప్షన్‌తో ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ అందిస్తుంది. మాక్స్ లైఫ్ క్రిటికల్ ఇల్‌నెస్ అండ్ డిసేబిలిటీ హెల్త్ రైడర్ ప్లాన్ తీవ్రమైన అనారోగ్యాలు, వైకల్యం, ప్రమాదం కారణంగా మరణం వంటి వాటికి అదనపు కవరేజీని అందిస్తుంది.
ఈజీ ఆన్‌బోర్డింగ్, వీడియో మెడికల్ ఎగ్జామినేషన్, ఈజీ ఫైనాన్షియల్ డాక్యుమెంటేషన్ వంటి ప్రత్యేకతలతో వచ్చే ఈ ప్లాన్ ప్రధానంగా స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తులకు ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సొల్యూషన్ 64 క్లిష్టమైన అనారోగ్యాలకు కవరేజీ అందిస్తుంది. వీటిలో ఐదు చిన్న, 59 పెద్ద అనారోగ్యాలతో సహా శాశ్వత వైకల్యానికి కవరేజీ పొందవచ్చు.
కొత్త పాలసీ లాంచింగ్ సందర్భంగా మాక్స్ లైఫ్ ఎండీ, సీఈఓ ప్రశాంత్ త్రిపాఠి మాట్లాడారు. ‘స్మార్ట్ సెక్యూర్ ఈజీ సొల్యూషన్‌తో స్వయం ఉపాధి పొందే వారికి, ఆర్థిక ఒడిదొడుకులకు ప్రభావితమయ్యే వారికి క్రిటికల్ లైఫ్ ఇన్సూరెన్స్ సొల్యూషన్స్ అందించాలనుకుంటున్నాం. ప్రస్తుతం ఈ సెగ్మెంట్‌లో కవరేజీ తక్కువగా ఉంది. అందుకే వీరికి ఎక్కువ రక్షణ అందించడానికి, అవాంతరాలు లేని ఆన్‌బోర్డింగ్‌తో ఫైనాన్షియల్ ప్రొటెక్షన్‌కు మద్దతు ఇవ్వడానికి ఎదురుచూస్తున్నాం’ అని తెలిపారు. ఈ పాలసీలో మెచూరిటీ సమయంలో పాలసీదారులు ప్రాణాలతో ఉంటే, ప్రీమియంను రిటర్న్ చేసే ఆప్షన్ ఉంటుంది. మొత్తం బేస్ ప్రీమియంను కంపెనీ తిరిగి చెల్లిస్తుంది.
ఈ టర్మ్ ఇన్సూరెన్స్ సొల్యూషన్‌లో భాగంగా క్రిటికల్ అనారోగ్యం లేదా టెర్మినల్ అనారోగ్యం నిర్ధారణ అయినప్పుడు ఒకేసారి మొత్తం బెనిఫిట్ చెల్లిస్తారు. జీవిత బీమా చేసిన వ్యక్తి (సాధారణ లేదా ప్రమాదవశాత్తూ) మరణించిన దురదృష్టకర సందర్భంలో, నామినీకి డెత్ బెనిఫిట్ చెల్లిస్తారు. యాక్సిడెంటల్ కవర్ ఆప్షన్‌లో బేస్ కవరేజీతో పాటు డెత్ బెనిఫిట్‌ను నామినీకి అందిస్తారు. పాలసీకి సంబంధించిన మరిన్ని నియమ నిబంధనల కోసం కంపెనీ వెబ్‌సైట్ సందర్శించవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Health benifits, Health Insurance, Max Life, New policy