Matchbox : అమ్మ బాబోయ్.. అగ్గి పెట్టె ధర 2రూపాయలు -14ఏళ్ల తర్వాత పెంపు -ఇక రూపాయికి వచ్చే వస్తువేది?

అగ్గి పెట్టె రూ.2

Matchbox price doubles: ఒక్క రూపాయికి దొరికే వస్తువులేవి? అని అడిగిగే, అందరికీ ముందుగా గుర్తొచ్చేది అగ్గిపెట్టే. దేశంలో నిత్యావసర వస్తువులు, సేవల ధరలన్నీ ఆకాశాన్ని అంటుతున్నా.. అగ్గి పెట్టె మాత్రం ఒక రూపాయికే లభించింది. కానీ జమదగ్నికీ టైమొచ్చిందిప్పుడు.. అగ్గిపెట్టుందా? అని అవతలి వాళ్లను అంత ఈజీగా అడిగే రోజులు ముగియనున్నాయి. 14ఏళ్ల తర్వాత భారత్ లో అగ్గి పెట్టె ధర రెట్టింపు కానుంది..

  • Share this:
పాల నుంచి పెట్రోల్ దాకా అన్నీ ప్రియమైపోగా, తానేం తక్కువ మండిపోనంటూ అగ్గి పెట్టె ధర రెండింతలు కానుంది. అవును, ఇన్నాళ్లూ 1రూపాయికే దొరికిన మ్యాచ్ బాక్స్ ఇకపై 2రూపాయలకు తక్కువ రానంటోంది. అగ్గి పెట్టె ధరలు 14 ఏళ్ల తరవాత పెరగనున్నాయి. ఈ ఏడాది డిసెంబరు 1 నుంచి అగ్గి పెట్టెను రూ.2 చొప్పున విక్రయిస్తామని తయారీ సంస్థల సమాఖ్య ‘ఆలిండియా ఛాంబర్ ఆఫ్ మ్యాచెస్’ ప్రకటించింది. అగ్గిపుల్లల తయారీలో వినియోగించే 14 రకాల ముడి సరుకుల ధరలు భారీగా పెరగడం వల్లే తప్పని పరిస్థితుల్లో అగ్గి పెట్టె ధరను రెట్టింపు చేస్తున్నట్లు ఛాంబర్ తెలిపింది.

అగ్గి పుల్లల తయారీలో అతి కీలకమైన రెడ్‌ ఫాస్ఫరస్‌ ధర రూ.425 నుంచి రూ.810కు, మైనం ధర రూ.58 నుంచి రూ.80కి పెరిగిందని, అగ్గి పెట్టెల బాక్స్‌ బోర్డులు, పేపర్‌, పొటాషియం క్లోరేట్‌, సల్ఫర్ వంటి ముడి పదార్థాల ధరరూ పెరిగాయని, పెట్రోల్, డీజిల్ రేట్లు ఆకాశాన్నంటుతుండటంతో అగ్గి పెట్టెల రవాణా ఛార్జీలు భారమయ్యాయని, మరో దారి లేని పరిస్థితుల్లోనే అగ్గి పెట్టె ధరను రెట్టింపు చేయాలని నిర్ణయించుకున్నట్లు ‘ఆలిండియా ఛాంబర్ ఆఫ్ మ్యాచెస్’ పేర్కొంది.

అగ్గిపెట్టె తయారీదార్లకు సంబంధించి 5 కీలక సంఘాలు తాజాగా (తమిళనాడులోని)శివకాశీలో సమావేశమై, ధరలు పెంచాలని నిర్ణయించాయి. దేశంలో చివరిసారి 14ఏళ్ల కిందట అగ్గిపెట్టె ధర డబుల్ అయింది. 2007లో ఒక అగ్గిపెట్టె ధరను 50 పైసల నుంచి రూ.1కి పెంచగా, మళ్లీ ఇన్నేళ్లకు రూ.1గా ఉన్న అగ్గిపెట్టెను రూ.2కు పెంచారు. దీంతో ఇప్పటివరకు 600 అగ్గిపెట్టెల బాక్సును రూ.270-300కి తయారీదార్లు విక్రయిస్తుండగా, ఇకపై రూ.430-480కి పెంచాలని నిర్ణయించినట్లు, దీనికి అదనంగా 12 శాతం జీఎస్టీ, రవాణా చార్జీలు ఉంటాయని నేషనల్‌ స్మాల్‌ మ్యాచ్‌బాక్స్‌ మాన్యుఫాక్చరర్స్‌ అసోసియేషన్‌ తెలిపింది.

అగ్గి పెట్టె ధర రూ.2 కానుండటంతో దేశంలో ఒక రూపాయికే లభించే వస్తువుల జాబితా ఇంకాస్త కుచించుకుపోనుంది. అగ్గి పెట్టెల తయారీలో అగ్రగామిగా కొనసాగుతోన్న తమిళనాడులో.. ఈ పరిశ్రమపై ఆధారపడి ప్రత్యక్షంగా, పరోక్షంగా 4 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. కూలీ రేట్లు మరీ తక్కువగా ఉండటంతో చాలా మంది కార్మికులు ఇతర ఉపాధి పనులవైపు మళ్లుతున్నారని మ్యాచెస్ ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
Published by:Madhu Kota
First published: