ద్రవ్యోల్బణం ప్రభావం ఆటోమొబైల్(Auto Mobile) కంపెనీలపై స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే హీరో మోటాకార్ప్ వంటి కంపెనీలు బైక్‌ల ధరలను పెంచిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి ఇండియా లిమిటెడ్ (MSIL) కీలక ప్రకటన చేసింది. వచ్చే ఏడాది 2023 జనవరిలో తమ కార్ల(Cars) ధరలను పెంచబోతున్నట్లు తెలిపింది. అయితే కార్ల మోడల్ బట్టి ధరల పెరుగుదలలో వ్యత్యాసం ఉంటుందని పేర్కొంది.
* పెరుగుతున్న ఇన్పుట్ ఖర్చుల భారం
ద్రవ్యోల్భణంతో పెరిగిన ఇన్పుట్ వ్యయాల భారాన్ని తగ్గించుకునేందుకు కార్ల తయారీ కంపెనీలు తమ మోడల్స్ ధరలను పెంచుతున్నాయి. తాజాగా మరోసారి వివిధ కార్ల మోడల్ ధరలను పెంచుతున్నట్లు మారుతి సుజుకి ప్రకటించింది. అయితే ఎంత పరిమాణంలో పెంపు ఉంటుంది అనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు.
* ఏప్రిల్‌లో 1.3 శాతం పెరిగిన ధరలు
ఇన్పుట్ ఖర్చులు పెరుగుతుండడంతో గత ఏప్రిల్‌లో, మారుతి సుజుకి హ్యాచ్‌బ్యాక్ స్విఫ్ట్, ఆల్ CNG వేరియంట్స్ ధరలను పెంచింది. దీంతో అన్ని మోడళ్ల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) కార్ల ధరలు 1.3 శాతం పెరిగాయి.
* 2021-2022 మధ్య కాలంలోనూ పెంపు
2021 జనవరి, 2022 మార్చి మధ్య కాలంలోనూ మారుతి సుజుకి కార్ల ధరలను పెంచింది. వివిధ మోడల్స్‌పై దాదాపు 8.8 శాతం వరకు ధరలు పెరిగాయి. బహిరంగ మార్కెట్లో కమోడిటీ ధరలు పెరగడంతో ఇన్‌ఫుట్ ఖర్చులు పెరుగుతున్నాయని, దీంతో కార్ల ధరలను పెంచాల్సిన పరిస్థితి ఏర్పడిందని కంపెనీ అప్పుడు ప్రకటించింది.
* అమ్మకాల్లో 14.4 శాతం వృద్ధి
2022 నవంబర్ నెలకు సంబంధించిన సేల్స్ రిపోర్ట్ మారుతి సుజుకి విడుదల చేసింది. గతేడాది కంటే ఈసారి అమ్మకాల్లో వృద్ధి నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే నెలలో 1.39 లక్షల యూనిట్లు(కార్లు) అమ్ముడుపోగా, ఈసారి 1.59 లక్షల యూనిట్లు విక్రయించింది. దీంతో గతేడాది నవంబర్ విక్రయాలతో పోల్చితే ఈసారి అమ్మకాలు 14.4 శాతం అదనంగా పెరిగాయని కంపెనీ వెల్లడించింది.
* 2018-19లో 51 శాతంగా మార్కెట్ వాటా
పోటీ సంస్థ టాటా మోటార్స్ కారణంగా తన మార్కెట్ వాటాను గత మూడు సంవత్సరాలుగా మారుతి సుజుకి కోల్పోయింది . త్వరలోనే తమ వాటాను తిరిగి కైవసం చేసుకుంటామని ఇటీవల ప్రకటించింది. గురుగ్రామ్‌కు చెందిన ఈ కార్‌మేకర్ 2018-19లో భారతీయ కార్ మార్కెట్లో మొత్తం వాటా 51 శాతంగా ఉండేది. త్వరలోనే ఈ స్థాయికి తిరిగి రావాలని లక్ష్యంగా పెట్టుకుంది.
* షేర్ విలువ 1.58 శాతం తగ్గుదల
దేశీయ విపణిలో మారుతి సుజుకి ఆల్టో నుంచి S-క్రాస్ వరకు అనేక రకాల మోడల్స్ విక్రయిస్తోంది. ఇది ఇలా ఉంటే.. వివిధ మోడల్స్ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించిన వెంటనే బీఎస్ఈలో మారుతీ సుజుకి ఇండియా షేర్లు 1.58 శాతం తగ్గి రూ.8,815 వద్ద ట్రేడ్ అవ్వడం గమనార్హం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Business, Maruti su, MARUTI SUZUKI