గ్రేటర్ నోయిడా వేదికగా ఆటో ఎక్స్‌పో-2023 నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ మెగా ఈవెంట్‌లో ఆటో మొబైల్ కంపెనీలు తమ అప్‌కమింగ్ మోడల్స్‌ను, ప్రస్తుత పోర్టిఫోలియో ప్రొడక్టులను ప్రదర్శిస్తున్నాయి. భారత మార్కెట్‌లో ప్రస్తుతం SUVలకు విపరీతమైన డిమాండ్ ఉంది. దీంతో ఈ మార్కెట్‌ను క్యాష్ చేసుకోవడానికి కంపెనీలు ఈ సెగ్మెంట్‌లో ఎక్కువ మోడల్స్‌ను లాంచ్ చేస్తున్నాయి. గతేడాది మారుతి సుజుకి గ్రాండ్ విటారా కాంపాక్ట్ ఎస్‌యూవీని తీసుకొచ్చింది. తన SUV పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించడానికి చర్యలు తీసుకుంటోంది. తాజాగా ఆటో ఎక్స్‌పోలో జిమ్నీ 5- డోర్ వెర్షన్‌ను ఇంట్రడ్యూస్ చేసింది. ఈ లేటెస్డ్ మోడల్ ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
జిమ్నీ 5 డోర్ ఆవిష్కరణ
ఎట్టకేలకు ఇండియా టాప్ కార్ మ్యానుఫాక్చరింగ్ కంపెనీ మారుతి సుజుకి జిమ్నీ 5-డోర్ వెర్షన్‌ను ఆవిష్కరించింది. టెస్ట్ రన్‌లు, TVC షూట్ సమయంలో చాలాసార్లు ఈ మోడల్‌పై వార్తలు వచ్చాయి. మారుతీ సుజుకి గుజరాత్ ఫెసిలిటీలో స్థానికంగా తయారు చేయడానికి సిద్ధమవుతోంది. జిమ్నీ 3 డోర్ వేరియంట్‌ను మొదటగా ఆటో ఎక్స్‌పో-2020లో ఆవిష్కరించారు. అప్పటి నుంచి భారత్‌లో ఇది విపరీతమైన హైప్‌ను క్రియేట్ చేసింది. అయితే మారుతి సుజుకి కంపెనీ ఇప్పటి వరకు గ్లోబల్ మార్కెట్లలో జిమ్నీ 3.2 మిలియన్ యూనిట్లకు పైగా విక్రయించింది.
ప్రత్యేకమైన ఫీచర్లు ఇవే
మారుతి సుజుకి జిమ్నీ ల్యాడర్-ఫ్రేమ్ ఛాసిస్, సుజుకి టెక్ట్ ప్లాట్‌ఫారమ్‌పై రూపొందించారు. క్యాబిన్ జియోమెట్రిక్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఫ్లాట్ రిక్లైన్ ఫ్రంట్ సీట్లు, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో ఆల్-బ్లాక్ థీమ్‌లో ఉంటుంది. SUV ఫస్ట్-ఇన్-సెగ్మెంట్ ఆటో వాషర్ ఫీచర్, ఆటో LED హెడ్‌ల్యాంప్‌లతో వస్తుంది. ఇండిపెండెంట్ ఇండికేటర్‌లతో కూడిన రౌండ్ హెడ్‌ల్యాంప్స్, క్లామ్‌షెల్ బానెట్, వర్టికల్ ఓపెనింగ్స్‌తో ఫ్రంట్ గ్రిల్, రియర్ కాంబినేషన్ ల్యాంప్స్ వంటి ఫీచర్స్ ఇందులో ఉంటాయి.
మారుతి సుజుకి జిమ్నీ 5-డోర్ 1.5L K-సిరీస్ పెట్రోల్ ఇంజన్‌కు ఐడిల్ స్టార్ట్/స్టాప్ ఫీచర్ ఉంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ అందిస్తుంది. అయితే 4-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షనల్‌గా కూడా అందుబాటులో ఉంది. సుజుకి 4×4 ALLGRIP డ్రైవ్ సిస్టమ్ స్టాండర్డ్‌గా వస్తుంది. ఈ లేటెస్ట్ కార్ సింగిల్-టోన్, డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది.
మొదలైన బుకింగ్స్
మారుతి సుజుకి జిమ్నీ బుకింగ్‌లు ప్రస్తుతం అన్ని కంపెనీ ఆథరైజ్డ్ డీలర్‌షిప్‌లలో ప్రారంభమయ్యాయి. ఈ కార్ కొద్ది వారాల్లో లాంచ్ అయ్యే సూచనలు ఉన్నాయి. భారతదేశంలో ఇప్పటికే పాపులర్ అయిన మహీంద్రా థార్, ఫోర్స్ గూర్ఖా నుంచి జిమ్నీ 5 డోర్ గట్టిపోటీ ఎదుర్కోనుంది. దీని ధర దాదాపు రూ.10 లక్షలు ఉండే అవకాశం ఉంది. థార్, గుర్ఖా ప్రస్తుతం 3-డోర్ ఫార్మాట్‌తో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. 5 డోర్‌తో రానున్న జిమ్నీకి ఇది ఫ్లస్ కానుందని మారుతి సుజుకి భావిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cars, Maruti cars, MARUTI SUZUKI