Maruti Suzuki cars: దేశంలో అతి పెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. జనవరి 18 నుంచి తన రకరకాల రేంజ్ కార్ల ధరలను భారీగా పెంచింది. కొన్ని మోడల్స్ ధరలను రూ.34,000 (ఎక్స్ షోరూం - ఢిల్లీ) దాకా పెంచబోతున్నట్లు తెలిసింది. గతేడాది మారుతీ సహా దాదాపు అన్ని కార్ల కంపెనీలు పలిచి మరీ ఆఫర్లు ఇచ్చాయి. భారీగా డిస్కౌంట్లు ప్రకటించాయి. ఇప్పుడు మారుతీ ధరలు పెంచినట్లే... మిగతా కంపెనీలు కూడా పెంచుతామని ప్రకటించాయి. ఉక్కు ధర భారీగా పెరగడం, రా మెటీరియల్ ధరలు కూడా పెరగడం వల్లే ఇలా ధరలు పెంచినట్లు ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం మారుతీలో కార్ల రేంజ్ అతి తక్కువగా ఎంట్రీ లెవెల్ చిన్న కార్లకు రూ.2.95 లక్షల నుంచి... ప్రీమియం సిక్స్ సీట్ల MPV, XL6 వంటి వాటి ధరలు రూ.11.52 (ఎక్స్ షోరూం - ఢిల్లీ) లక్షల దాకా ఉన్నాయి.
సామాన్య, మధ్యతరగతి వారు కొనుక్కునే ఆల్టో (Alto) కారు ధర రూ.9,000 దాకా పెరిగింది. అలాగే ఎస్ప్రెస్సో (Espresso) ధర రూ.7,000 ఎగబాకింది. అలాగే బాలెనో (Baleno) ధర రూ.19,400, బ్రెజ్జా (Brezza) రూ.10,000, సెలెరియో (Celerio) రూ.14,400 పెరిగాయి. ఇక వేగనార్ (Wagon R) కొనుక్కోవాలనుకునేవారు రూ.2,500 నుంచి రూ.18,200 దాకా ఎక్కువ పే చెయ్యాల్సి ఉంటుంది.
ప్రస్తుతం మారుతీ సుజుకీ కార్ల సేల్స్ అంతంతమాత్రంగానే ఉంది. కరోనా ఎఫెక్ట్ అన్ని ఆటో మొబైల్ కంపెనీల పైనా పడింది. ఇప్పుడిప్పుడే ఈ కంపెనీలు తిరిగి పూర్వపు స్థితికి వస్తున్నాయి. ఇలాంటి సమయంలో ధరలు పెంచడం వల్ల వినియోగదారులపై ప్రభావం చూపే అవకాశం ఉంది. కార్లు కొనుక్కోవాలనుకునేవారు, విడి పార్టులు కొనుక్కోవాలనుకునేవారికి ఇబ్బందే.
2020 నవంబర్‌లో మారుతీ సుజుకీ దేశీయ వాహన అమ్మకాలు 1,35,775 మాత్రమే జరిగాయి. అంతకు ముందు సంవత్సరం అదే నెలలో అవి 1,39,133 ఉన్నాయి. అంటే అమ్మకాలు 2.4 శాతం తగ్గాయి. మారుతీ లాగే... కియా, హ్యూందయ్, హోండా, రెనాల్ట్, ఫోర్డ్, స్కోడా, వోక్స్వ్యాగన్, నిస్సాన్, డాట్సన్ కంపెనీలు కూడా జనవరిలో ధరలు పెంచుతామని ప్రకటించాయి.
మారుతీ సుజుకీ కార్లలో పెరిగిన ధరలు:
ఆల్టో: ధర రూ.9,000 దాకా పెరిగింది.
ఎస్ప్రెస్సో ధర రూ.7,000 ఎక్కువైంది.
బాలెనో ధర రూ.19,400 పెరిగింది.
వ్యాగన్ ఆర్ ధర రూ.2,500 నుంచి రూ.18,200 దాకా పెరిగింది.
బ్రెజ్జా ధర రూ.10,000 ఎగబాకింది.
సెలెరియో కావాలంటే రూ.14,400 అదనంగా వెచ్చించాల్సిందే.
ఇది కూడా చదవండి:Horoscope Today: జనవరి 19 రాశి ఫలాలు... ఈ రాశుల వారికి వివాహ యోగం
కంపెనీలు కార్ల ధరలు పెంచుతున్నాయి కాబట్టి జనవరిలో కార్ల కొనుగోళ్లు నెమ్మదించే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. ఫిబ్రవరిలో బడ్జెట్‌ని బట్టి అమ్మకాలు ఉంటాయంటున్నారు.