Naveen Kumar, News18, Nagarkurnool
తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వచ్చే పంటలపై రైతులు దృష్టి సారిస్తున్నారు. సాంప్రదాయ, వాణిజ్య పంటలకు ప్రత్యామ్న్యాయంగా కొందరు రైతులు పూల సాగుకు మొగ్గు చూపుతున్నారు. ఇతర పంటల వలే కాకుండా సీజన్లో పూలకు డిమాండ్ ఉంటుంది కాబట్టి, దిగుబడి బాగుంటే ఆశించిన లాభాలు వస్తాయని పూల సాగు చేస్తున్న రైతులు అంటున్నారు. బంతిపూల సాగును సాంప్రదాయ పంటలతో పోల్చుకుంటే అధిక లాభాలు గడించవచ్చని నాగర్ కర్నూల్ జిల్లా (Nagar Kurnool District) లోని పెద్దకొత్తపల్లి గ్రామానికి చెందిన రైతు శేఖర్ అంటున్నారు. కేవలం 20 గుంటలో పొలంలో బంతిపూల సాగు చేసిన రైతు శేఖర్ అధిక లాభాలు వస్తున్నట్లు తెలిపారు. హైబ్రిడ్ సీడ్ బంతిపూల కంటే స్థానికంగా ఉత్పత్తి అయ్యే విత్తనాలతో ఈ పంటలు సాగు చేయడం ద్వారా వాతావరణ పరిస్థితులను తట్టుకొని దిగుబడులు ఎక్కువగా వస్తాయని చెప్పుకొచ్చారు.
హైబ్రిడ్ సీడ్‌తో సాగు చేసిన పూల తోటలు ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్నాయి. జిల్లాలో చాలావరకు బంతిపూల తోటలన్నీ వర్షం దాటికీ ధ్వంసం అయ్యాయి. కానీ చిలక బంతిపూల తోట చెక్కుచెదరలేదని, వాతావరణ పరిస్థితులను తట్టుకోగల శక్తి ఉంటుందని రైతులు చెప్పుకొచ్చారు. 20 కుంటల్లో బంతిపూల సాగును చేపట్టిన రైతు శేఖర్... కిలో బంతి పూలను రూ.100 వరకు విక్రయిస్తున్నట్టుగా చెప్పుకొచ్చారు. కేవలం రూ.3000 పెట్టుబడి ఖర్చులయ్యాయని లాభం మాత్రం రూ.20,000 వరకు వచ్చే అవకాశం ఉందని రైతు తెలిపాడు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందాలంటే చిలక బంతిపూల సాగును ఎంచుకోవాలి. ఈ బంతిపూల సాగును కేవలం రెండు నెలలు మాత్రమే పంట ఉండేలా సాగు చేస్తామని వివరించారు.
దసరా దీపావళి పండుగ ముందు బంతిపూలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ పండుగ కంటే రెండు నెలల ముందు విత్తనాలు నాటి పంటను సాగు చేస్తామని రైతు తెలిపాడు. మొక్క ఎదిగే వరకు డ్రిప్ సిస్టం ద్వారా నీటిని అందించి, తర్వాత డిఏపీ యూరియాను అందించడం ద్వారా పంట ఏపుగా పెరుగుతుందని తెలిపారు. తాము గత 8 సంవత్సరాలుగా ఈ బంతిపూల సాగు చేస్తున్నామని దీనివలన మంచి లాభాలను గడిస్తున్నామని ప్రత్యేకంగా చెప్పుకొచ్చారు. కేవలం చిలక బంతిపూలను సాగు చేయడం ద్వారానే అధిక లాభాలు పొందుతున్నామని వివరించారు.
హైబ్రిడ్ బంతిపూల తోట కంటే చిలక బంతిపూల చాలా నాణ్యతగా పువ్వులు పూస్తాయి. వీటితో పాటు బంతిపూలకు ఉండే సహజతను సుగంధాలు వేదలే గుణాన్ని ఈ చిలక బంతిపూలూ కలిగి ఉంటాయి. తెలుపు ఎరుపు పసుపు రంగులో పూలు పూస్తాయి. పూలను నేరుగా మార్కెట్లో విక్రయిస్తామని, మరికొన్ని సందర్భాల్లో తోట దగ్గరికే వచ్చి బంతిపూలు కొనుగోలు చేస్తారని రైతు శేఖర్ చెప్పుకొచ్చారు.
ప్రతి ఏడాది పూల సాగు చేస్తున్నా మార్కెటింగ్ చేసుకునే అవసరం ఇప్పటివరకు రాలేదని వివరించారు. దీపావళి రోజు పూర్తిగా పంట మొత్తం ఖాళీ అవుతుందని రైతు తెలిపాడు. శేఖర్. పూల రైతు, పెద్దకొత్తపల్లి 9440163803.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Agriculture, Local News, Nagarkarnol district, Telangana