Bogus Bank: ప్రజలను మోసం చేసేందుకు నేరగాళ్లు కొత్త అవతారం ఎత్తుతున్నారు. నకిలీ అధికారుల ముసుగులో ప్రజలను మోసం చేసిన వారిని చూసి ఉంటారు. కానీ ఏకంగా నకిలీ బ్యాంకునే ప్రారంభించిన వ్యక్తిని చూశారా..? తమిళనాడుకు చెందిన ఓ కేటుగాడు ఏకంగా ఎనిమిది ఫేక్ బ్యాంక్ బ్రాంచ్‌లను స్టార్ట్ చేసి, వేలాది మందిని మోసం చేశాడు. చివరికి పోలీసులకు చిక్కాడు.
లండన్‌లో ఎంబీఏ.. చెన్నైలో నకిలీ బ్యాంకు
ప్రధాన నిందితుడు చెన్నైకి చెందిన సుభాష్ చంద్రబోస్(40). అతను లండన్‌లో ఎంబీఏ పూర్తి చేశాడు. అక్కడ బ్యాంకింగ్ రంగంలో పనిచేసిన అనుభవం ఉంది. సుభాష్ చెన్నైలోని అంబత్తూరు, మదురై, ఈరోడ్, నమక్కల్, దిండిగల్, విరుధాచలం, కళ్లకురిచ్చి సహా తమిళనాడు వ్యాప్తంగా ఎనిమిది బోగస్ బ్యాంకు బ్రాంచ్‌లను ఓపెన్ చేశాడు. ఒక ముఠా బోగస్ బ్యాంక్‌ను స్థాపించి రైతులను, వ్యాపారులను మోసం చేస్తోందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) అసిస్టెంట్ జనరల్ మేనేజర్ నుంచి చెన్నై పోలీసు కమిషనర్ ఆఫీస్‌కు ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదుతో చెన్నై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ విచారణ ప్రారంభించింది.
దీనిపై దర్యాప్తు చేసిన అధికారులు.. చెన్నై, అంబత్తూరులోని లేడన్ స్ట్రీట్‌లో ‘రూరల్ అండ్ అగ్రికల్చర్ ఫార్మర్స్ కోఆపరేటివ్ బ్యాంక్’ (RAFC Bank) పేరుతో ఒక నకిలీ బ్యాంక్ ఉన్నట్లు గుర్తించారు. రిజర్వ్ బ్యాంక్ నుంచి అనుమతి ఉన్నట్లుగా తప్పుడు ఆథరైజేషన్ సర్టిఫికెట్ రూపొందించి, బ్యాంకు కార్యకలాపాలు సాగిస్తున్నట్లు తెలిసింది. రూరల్ అండ్ అగ్రికల్చరల్ ఫార్మర్స్ బ్యాంక్ పేరుతో ఎనిమిది వేర్వేరు సైట్లలో బ్రాంచ్‌లు ఉన్నాయని తేలింది. వందలాది మంది ఉద్యోగులు కూడా పని చేస్తున్నట్లు తెలిసింది. ఈ బోగస్ బ్యాంకు శాఖలను ప్రారంభించిన ప్రధాన నిందితుడు సుభాష్ చంద్రబోస్‌ను చెన్నైలోని తిరుముల్లైవాయల్ పరిసరాల్లో పోలీసులు అరెస్ట్ చేశారు.
లోన్ల పేరుతో మోసం
సీనియర్ పోలీసు అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. రూరల్ అండ్ అగ్రికల్చరల్ ఫార్మర్స్ బ్యాంక్ పేరుతో ఎనిమిది ప్రాంతాల్లో ఎనిమిది నకిలీ బ్యాంకు శాఖలను ఏర్పాటు చేశారు. 6.5 శాతం వడ్డీతో రైతులకు రుణాలు ఇప్పిస్తామంటూ రైతులను మోసం చేశారు. బ్యాంకు శాఖలలో సీనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల పేరిట రూ.2 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు వసూలు చేశారు. వారి కింద ఉద్యోగలను రిక్రూట్ చేసి కార్యకలాపాలు సాగించారు. ప్రజల డిపాజిట్లు, పొదుపు సొమ్మును దొంగిలించడం, నగలపై అధిక వడ్డీలు చెల్లించడం, దీర్ఘకాలిక డిపాజిట్లు తీసుకోవడం ద్వారా ఈ కుంభకోణానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
ఒక్క బ్రాంచ్‌లోనే రూ.2 కోట్ల ఫ్రాడ్
ఈ ఫేక్ బ్యాంకు అంబత్తూరు బ్రాంచ్‌లోనే రూ.2 కోట్ల వరకు మోసం జరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది. మిగిలిన ఏడు శాఖల్లో పెద్ద మొత్తంలో కుంభకోణం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. నిందితులు బ్యాంకు నగదు బదిలీ, బిల్లింగ్ మిషన్లు, పాస్‌బుక్ మెషీన్లు, ఇతర పరికరాల కోసం సాఫ్ట్వేర్ కూడా కొనుగోలు చేసి, ఈ పని చేశారని అధికారి పేర్కొన్నారు. వినియోగదారుల కోసం వెబ్సైట్, సోషల్ మీడియా పేజీలు నిర్వహించేవారని చెప్పారు.
చంద్రబోస్ ఒక్కో బ్యాంకు బ్రాంచ్‌లో ఖాతాదారుల సంఖ్యను ఒక్క ఏడాదిలో వెయ్యికి పైగా పెంచినట్లు వెల్లడైంది. ఇప్పటి వరకు దాదాపు 3,000 మంది కస్టమర్లకు సంబంధించిన డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. చంద్రబోస్ సహచరులు, బోగస్ బ్యాంకు అధికారుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితుడి నుంచి నకిలీ పాస్‌పోర్టులు, నకిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు, నకిలీ స్టాంప్ పేపర్లు, బెంజ్ కారు, రూ.57 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank, Crime news, Tamilnadu