ఎకో ఫ్రెండ్లీ(Eco Friendly)ఉత్పత్తులకు ఇప్పుడు డిమాండ్ పెరుగుతోంది. ఇలాంటి వాటిని వాడేందుకు పెద్ద సంస్థలు కూడా ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ ట్రెండ్‌ను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు భారత్‌లో కొత్త ఇన్నోవేషన్లు ఎన్నో పుట్టుకొస్తున్నాయి. అలాంటి వాటిలో ఓ కొత్త ఆసక్తికరమైన ఇన్నోవేషన్(Innovation)ఏనుగు పేడ(Elephant dung)తో ఆఫీసు ఫైళ్లి(Office files)తయారీ. అది ఎక్కడో, ఆ వివరాలేంటో చదివేయండి.
కేరళలో తయారి..
కేరళలో పాతనంతిట్ట అనే ఊరుంది. అక్కడున్న ‘కొన్ని ఎలిఫేంట్ క్యాంప్’(Konni Elephant camp) పెద్ద టూరిస్ట్ డెస్టినేషన్. అటవీ శాఖ పరిధిలో ఉండే ఆ క్యాంప్‌కు ఎందరో పర్యాటకులు వస్తుంటారు. అక్కడ ఆరు ఏనుగులు (Elephants) ఉన్నాయి. కొచయ్యప్పన్(1), కృష్ణ(9), మీన(31), ప్రియదర్శిని(38), ఇవా(20), కొన్ని నీల కండన్(25) అనే పేర్లతో ఈ ఏనుగులు ఉన్నాయి.
ఏనుగు పేడతో ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్..
వీటి నుంచి రోజూ పెద్ద ఎత్తున ఏనుగు పేడ పోగవుతుంది. దాన్ని అదే క్యాంపులో ఓ మూలన డంప్ చేస్తున్నారు. దీన్ని ఉపయోగకరంగా మార్చాలని అక్కడి క్యాంపు అధికారులకు ఓ ఆలోచన వచ్చింది. వచ్చిందే తడవుగా ఈ పేడ నుంచి ఆఫీసు ఫైళ్లు తయారు చేయడానికి సాధ్యాసాధ్యాలు ఏమిటో సాంకేతికంగా అధ్యయనం చేయాలని ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కొత్త ప్రాజెక్టు కోసం క్యాంపు లోపల ఓ వెంచర్‌ను ఏర్పాటు చేయనున్నారు. దీనివల్ల 10 నుంచి 15 మందికి ఉపాధి కలుగుతుంది.
ఆదాయ వనరుగా..
ఈ ఐడియా వర్కవుట్ అయితే అటవీ శాఖకు అదనపు ఆదాయం సమకూరనుంది. సాంకేతిక అధ్యయనాన్ని పూర్తి చేసిన తర్వాత, అటవీ శాఖ ప్రధాన కార్యాలయానికి వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదిక (DPR) సమర్పిస్తామని చెప్పారు కొన్ని డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ ఆయుష్ కుమార్ కోరి. ‘యూనిట్ సజావుగా పనిచేయడానికి మేము అధునాతన యంత్రాలను అమర్చాల్సి ఉంది. క్యాంపు లోపల ఉన్న భవనాన్ని కూడా రెనోవేషన్ చేయాలి. ఎందుకంటే ఈ భవనాన్ని ఇంతకు ముందు కూడా ఈ పని కోసం ఉపయోగించాం. గతంలో వచ్చిన ప్రొడక్ట్ నాణ్యతపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. దీంతో మొదటి వెంచర్‌ని అప్పట్లో నిలిపివేశాం. ఇప్పుడు రెండో ప్రయత్నంలో దీన్ని మళ్లీ తిరిగి ప్రారంభించాలని అనుకుంటున్నాం. ఈ సారి నాణ్యమైన ఫైళ్లను తయారు చేయడంపై ప్రత్యేకమైన శ్రద్ద వహిస్తున్నాం.’ అని ఆయుష్ కుమార్ తెలిపారు.
ఎలా చేస్తారు..?
ఈ ప్రొడక్షన్ యూనిట్ ప్రారంభించిన తర్వాత ముందుగా పేడను రీసైకిల్ చేస్తారు. తర్వాత డిసిన్ఫెక్ట్ చేసి అందులో ఉండే బ్యాక్టీరియా లాంటి వాటిని సంహరిస్తారు. దానిలో ఉండే పీచు పదార్థాన్ని మాత్రమే ఫైళ్ల తయారీలో వాడతారు. నాన్-ఫైబర్ కంటెంట్ అంతటినీ తీసి వేస్తారు. అప్పుడు అది కాగితపు గుజ్జులాంటి పదార్థంగా మారుతుంది. కాగితాన్ని మరింత మృదువుగా చేయడానికి దానిలో మరికొన్ని పదార్థాలను జోడిస్తారు. దాన్ని కాగితం షీట్లలా చేసి అవసరమైన ఆకారాలలో కట్ చేస్తారు. దీంతో అవి వాడుకోడానికి యోగ్యంగా మారతాయన్నమాట.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Elephant, Kerala, National News