ఓవైపు మండుతున్న పెట్రోల్ డీజిల్ ధరలు, మరోవైపు పెరుగుతున్న కాలుష్యం కారణంగా ఎలక్ట్రిక్ వాహనాలకు (Electric vehicles) డిమాండ్ వేగంగా పెరుగుతోంది. దీంతో ప్రముఖ వాహన తయారీ సంస్థలు వరుసగా ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేస్తున్నాయి. ఇప్పుడు ఇదే బాటలో దేశీయ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra and Mahindra)కు చెందిన మహీంద్రా ఎలక్ట్రిక్ మొబిలిటీ సరికొత్త ఎలక్ట్రిక్ త్రీ-వీలర్‌ను (Electric Three Wheeler) లాంచ్ చేసింది. ఇ–ఆల్ఫా కార్గో (E Alfa cargo) పేరుతో దీన్ని మార్కెట్లోకి ఆవిష్కరించింది. ఈ ఎలక్ట్రిక్ కార్గో వాహనాన్ని రూ. 1.44 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ధర వద్ద అందుబాటులోకి తెచ్చింది. ఇ-ఆల్ఫా కార్గో వాహనం (E-Alfa cargo vehicle) చిన్న వ్యాపారులకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపింది. దీని వల్ల ఇంధనం ఆదా చేయడంతో పాటు పర్యావరణం దెబ్బ తినకుండా కాపాడుకోవచ్చని పేర్కొంది.
దాదాపు రూ. 60 వేల సేవింగ్స్‌తో..
ఈ సరికొత్త ఈ–కార్గో వాహనం లాంచింగ్‌పై మహీంద్రా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ (Mahindra Electric Mobility Limited) సీఈవో సుమన్ మిశ్రా మాట్లాడుతూ, "పెట్రోల్, డీజిల్ వంటి శిలాజ ఇంధనాలతో నడిచే త్రీ వీలర్లకు నిర్వహణ ఖర్చు గణనీయంగా వెచ్చించాల్సి వస్తుంది. అందుకే, లాస్ట్ మైల్ డెలివరీ విభాగంలో ఎలక్ట్రిక్ 3- వీలర్లకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. ఈ విభాగంలో కస్టమర్ అవసరాలకు (Customer Needs) అనుగుణంగా మేము ఇప్పుడు ఈ–ఆల్ఫా కార్గో ఇ-కార్ట్ వాహనాన్ని (E-Alfa Cargo e-Cart vehicle) తీసుకొస్తున్నాం. డీజిల్ కార్గో 3- వీలర్‌తో పోలిస్తే దాదాపు రూ. 60 వేల సేవింగ్స్‌తో ఈ వాహనాన్ని విడుదల చేస్తున్నాం. కార్గో విభాగంలో స్థిరమైన, కాలుష్య రహిత పరిష్కారాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.” అని చెప్పారు.
మొబైల్ ఫోన్ ఛార్జ్ చేసినంత సులువుగా ఛార్జింగ్..
ఈ ఎలక్ట్రిక్ 3 వీలర్ ఇ–ఆల్ఫా కార్గో మోడల్ (E-alfa cargo model) 310 కిలోల పేలోడ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. దీన్ని ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 80 కి.మీల ప్రయాణాన్ని అందిస్తుంది. ఇ-ఆల్ఫా కార్గో 1.5 kW గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది గరిష్టంగా 25 km/h వేగంతో ప్రయాణించగలదు.
ఇది కూడా చదవండి: త్వరలోనే టాటా నుంచి బ్లాక్‌బర్డ్ మిడ్ రేంజ్ ఎస్యూవీ లాంచ్.. సీఎన్జీ, ఎలక్ట్రిక్ వేరియంట్లలోనూ లభ్యం
ఆఫ్-బోర్డ్ 48 V/15 A ఛార్జర్‌తో మొబైల్ ఫోన్‌ను ఛార్జింగ్ (Phone charging) చేసినంత సులువుగా దీన్ని ఛార్జ్ చేయవచ్చు. కాగా, భారత మార్కెట్లో ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల హవా నడుస్తోంది. ఇప్పటికే అనేక కంపెనీలు ఎలక్ట్రిక్ స్కూటర్లు (Electric Scooters), కార్లను విడుదల చేస్తున్నాయి. ఇవి పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించడంతో పాటు కాలుష్యాన్ని (Pollution) తగ్గించడంలో సహాయపడుతున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.