LPG Subsidy Not Received | మీ బ్యాంక్ అకౌంట్‌లోకి ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ సబ్సిడీ (LPG Subsidy) రాలేదా? ఎలా చెక్ చేయాలో, ఎలా కంప్లైంట్ చేయాలో తెలుసుకోండి.
గ్యాస్ సిలిండర్ (Gas Cylinder Price) ధర భారీగా పెరుగుతోంది. హైదరాబాద్‌లో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర రూ.937 కి చేరుకుంది. ఆయిల్ కంపెనీలు మరో రెండుమూడుసార్లు గ్యాస్ సిలిండర్ ధరల్ని పెంచితే సిలిండర్ ధర రూ.1000 దాటడం ఖాయం. ప్రతీ ఏడాది 12 గ్యాస్ సిలిండర్లకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. ఈ సబ్సిడీ సిలిండర్ (Gas Cylinder) బుక్ చేసిన తర్వాత కస్టమర్ బ్యాంక్ అకౌంట్‌లోకి నేరుగా క్రెడిట్ అవుతుంది. గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరుగుతున్న సమయంలో సబ్సిడీ రూపంలో ఎంతో కొంత వెనక్కి వస్తుండటం కస్టమర్లకు కాస్త ఊరటే. అయితే సబ్సిడీ ఎంత వస్తుందన్నది ప్రాంతాన్ని బట్టి మారుతుంది. సబ్సిడీ డబ్బులు నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్‌లో క్రెడిట్ అవుతుంటాయి. అయితే పలు కారణాల వల్ల సబ్సిడీ కస్టమర్ల అకౌంట్లకు జమ కాదు.
గ్యాస్ సిలిండర్ సబ్సిడీ రావాలంటే కస్టమర్లు తప్పనిసరిగా తమ ఆధార్ నెంబర్‌ను బ్యాంక్ అకౌంట్‌తో లింక్ చేయడం తప్పనిసరి. దీంతో పాటు బ్యాంక్ అకౌంట్‌ను ఎల్‌పీజీ ఐడీకి కూడా లింక్ చేయాలి. ఈ రెండింటిలో ఏది చేయకపోయినా సబ్సిడీ రాకపోవచ్చు. గ్యాస్ సిలిండర్ సబ్సిడీ అందరికీ రాదు. కుటుంబ వార్షికాదాయం రూ.10 లక్షల పైన ఉన్న ఉన్నవారికి గ్యాస్ సిలిండర్ సబ్సిడీ రాదు. కుటుంబ వార్షికాదాయం అంటే భార్యాభర్తల వార్షికాదాయాన్ని పరిగణలోకి తీసుకుంటారు. ఇద్దరి వార్షికాదాయం రూ.10,00,000 దాటితే సబ్సిడీ రాదు.
సబ్సిడీ జమ కాకపోతే ఏం చేయాలి? ఎవరికి కంప్లైంట్ చేయాలి? అన్న సందేహాలు కస్టమర్లకు ఉంటాయి. గ్యాస్ సిలిండర్ సబ్సిడీ బ్యాంక్ అకౌంట్‌లో జమ అయిందో లేదో ఓసారి చెక్ చేయాలి. సబ్సిడీ రాకపోతే http://www.mylpg.in/ వెబ్‌సైట్‌లో చెక్ చేయాలి. మీ సర్వీస్ ప్రొవైడర్ పేరు సెలెక్ట్ చేయాలి. కొత్త యూజర్ అయితే అకౌంట్ రిజిస్టర్ చేయాలి. ముందే అకౌంట్ ఉంటే సైన్ ఇన్ చేయాలి.
సైన్ ఇన్ చేసిన తర్వాత బుకింగ్ హిస్టరీ ఓపెన్ చేయాలి. అందులో మీకు సబ్సిడీ వచ్చిందో లేదో తెలుస్తుంది. సబ్సిడీ రాకపోతే దగ్గర్లో ఉన్న డిస్ట్రిబ్యూటర్ దగ్గరకు వెళ్లాలి. కస్టమర్ల గ్యాస్ పాస్‌బుక్ వివరాలు ఇచ్చి సబ్సిడీ రాలేదని కంప్లైంట్ చేయాలి. లేదా టోల్ ఫ్రీ నెంబర్ 18002333555 కి కాల్ చేసి కూడా మీ కంప్లైంట్ రిజిస్టర్ చేయొచ్చు.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.