news18-telugu
Updated: November 19, 2020, 1:59 PM IST
ప్రతీకాత్మక చిత్రం
ప్రస్తుతం వినియోగదారులకు అందుబాటులో ఉన్న ఇన్సూరెన్స్ పాలసీల్లో ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఉంది. తల్లిదండ్రులు, భార్య, పిల్లలు, ఇతర డిపెండెంట్లు వంటి కుటుంబ సభ్యులను పాలసీలో చేర్చాలనుకునే కస్టమర్లకు ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్స్ మంచి ఎంపిక. కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా వ్యక్తిగత ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేకుండా, ఒకే ప్రీమియంతో ఈ పాలసీలు కవరేజీని అందిస్తాయి.
* రూ.5 లక్షల ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీకి దేశవ్యాప్తంగా ఆధరణ లభిస్తోందని రెన్యూ బై సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బాలచందర్ శేఖర్ చెబుతున్నారు. కుటుంబంలో తక్కువ, చిన్న వయసు ఉన్న వారు ఉంటే ఫ్లోటర్ పాలసీల వల్ల మంచి ప్రయోజనం పొందవచ్చని చెప్పారు. కుటుంబ అవసరాలకు అనుగుణంగా పాలసీలను ఎంచుకోవాలని ఆయన సూచిస్తున్నారు.
* ఎలా పని చేస్తాయి?
ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్లలో మొత్తం బీమా కవరేజీని కుటుంబ సభ్యులందరికీ విభజిస్తారు. కుటుంబంలో ఒక వ్యక్తి పాలసీ తీసుకుంటే, ఆ కుటుంబ సభ్యులు ఎవరైనా పాలసీ విలువ మొత్తంలో ఎంత వరకైనా కవరేజీని పొందే వీలుంటుందని పాలసీబజార్ హెల్త్ ఇన్సూరెన్స్ హెడ్ అమిత్ ఛబ్రా చెబుతున్నారు. ఉదాహరణకు ఒక కస్టమర్ ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్‌ను రూ .20 లక్షలతో కొనుగోలు చేశాడనుకుందాం. ఆ కుటుంబంలో సభ్యులు ఎవరైనా బీమా చేసిన విలువలో ఎంత మొత్తాన్ని అయినా ఉపయోగించుకోవచ్చు. ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ ద్వారా పాలసీ వర్తించే కుటుంబ సభ్యులు మొత్తం ఇన్సూరెన్స్ కవరేజీని ఉపయోగించుకునే సౌలభ్యాన్ని పొందవచ్చు. దీంట్లో కుటుంబ సభ్యుల సంఖ్య, వారి వయస్సు ఒక ముఖ్యమైన అంశం.
* ప్రీమియం ఎలా నిర్ణయిస్తారు?
ఫ్యామిలీ ఫ్లోటర్ ద్వారా కుటుంబ సభ్యులు తక్కువ ప్రీమియంతో పెద్ద మొత్తంలో ఇన్సూరెన్స్ హామీ పొందవచ్చు. కానీ ఈ ప్రీమియం కుటుంబంలోని ఎక్కువ వయసు ఉన్న సభ్యుడిపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ సీనియర్ సిటిజన్స్, వృద్ధ తల్లిదండ్రులను ప్లాన్‌లో చేరిస్తే, చెల్లించాల్సిన ప్రీమియం విలువ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక ఇన్సూరెన్స్ ప్లాన్లు, ఇతర కుటుంబ సభ్యుల కోసం ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్‌ను ఎంచుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
* ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి?కుటుంబ పెద్ద వయసు 26 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉంటే ఫ్యామిలీ ఫ్లోటర్ ఇన్సూరెన్స్ అందరికీ ప్రయోజనకరంగా ఉంటుందని శేఖర్ చెబుతున్నారు. ప్రీమియం, పాలసీ విలువను నిర్ణయించడంలో కుటుంబ సభ్యుల ప్రస్తుత ఆరోగ్య పరిస్థితులు, ఇంతకు ముందే ఉన్న అనారోగ్యాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఎక్కువ మొత్తంలో వైద్య సహాయానికి హామీ కోరుకునేవారు పెద్ద మొత్తంలో ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.
Published by:
Shiva Kumar Addula
First published:
November 19, 2020, 1:59 PM IST