ఎం ఎస్ ధోనీ.. కోట్లాది మంది భారతీయుల మనసుల్లో నిలిచిపోయిన ఆటగాడు. భారత్ కి ఎన్నో విజయాలను అందించి అభిమానులను సంపాదించుకున్నాడు ధోనీ. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ కి గుడ్ బై చెప్పినా.. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్నాడు. అయితే కేవలం క్రికెట్ వల్లే కాదు.. ధోనీకి ఎన్నో రకాల ఆదాయాలు ఉన్నాయి. అందుకే అంతర్జాతీయ క్రికెట్ లో రిటైర్మెంట్ తీసుకున్నా సరే.. ధోనీ సంపద ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది. ఇటు బ్రాండ్ ఎండార్స్ మెంట్లు, అటు బిజినెస్ లు ధోనీ ఆస్తుల విలువను పెంచుతున్నాయి. ధోనీ ఆదాయ మార్గాల గురించి ఓసారి పరిశీలిస్తే..
ఝార్ఖండ్ లోని చిన్న పట్టణం రాంచీకి చెందిన ధోనీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నో వ్యాపారాలు నిర్వహిస్తున్నాడు. అందులో కొన్ని..
1. ఎం ఎస్ ధోనీ జిమ్ : స్పోర్ట్స్ ఫిట్ వరల్డ్
మంచి క్రికెటర్ గా కొనసాగాలంటే చక్కటి ఫిజిక్ అవసరం. కానీ అలాంటి ఫిజిక్ సాధించే జిమ్ ల ద్వారానే ధోనీ ఆదాయాన్ని సంపాదిస్తున్నాడని చాలామందికి తెలీదు. స్పోర్ట్స్ ఫిట్ వరల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో దేశవ్యాప్తంగా 200 కి పైగా జిమ్ లను నిర్వహిస్తున్నాడు ధోనీ.
2. చెన్నయిన్ ఫుట్‌బాల్ క్లబ్
మహేంద్ర సింగ్ ధోనీకి క్రికెట్ తో పాటు ఇతర ఆటలు కూడా చాలా ఇష్టం. అందులోనూ ఫుట్ బాల్ అయితే మరీ.. అందులో కెరీర్ కొనసాగించలేకపోయినా ఇండియన్ సూపర్ లీగ్ లో ఆయన ఓ ఫుట్ బాల్ క్లబ్ కి యజమానిగా వ్యవహరిస్తున్నారు. చెన్నయిన్ ఫుట్ బాల్ క్లబ్ లో కొంత భాగం షేర్లు తీసుకున్నాడు ధోనీ
3. హాకీ టీమ్
కేవలం ఫుట్ బాల్ టీం మాత్రమే కాదు.. ధోనీ హాకీ టీమ్ కి కూడా యజమానిగా వ్యవహరిస్తున్నారు. ఫుట్ బాల్ లో తనకు ఇష్టమైన చెన్నై ఫ్రాంఛైజీ ఎంచుకోగా హాకీ టీమ్ కోసం రాంచీ పట్టణాన్ని ఎంచుకున్నాడు ధోనీ. రాంచీ బేస్డ్ హాకీ క్లబ్ రాంచీ రేస్ కి యజమానిగా వ్యవహరిస్తున్నారు.
4. మాహీ రేసింగ్ టీమ్ ఇండియా
ధోనీకి బైకులు అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. క్రికెట్ లో ఎవరికి బైక్ బహుమతిగా వచ్చినా మాహి బైక్ పై విహరిస్తుంటాడు. అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే మాహికి ఓ రేసింగ్ టీమ్ కూడా ఉంది. ఇది సూపర్ స్పోర్ట్ వరల్డ్ ఛాంపియన్ షిప్ లోనూ భాగంగా ఉంది. ఈ రేసింగ్ టీమ్ కి ధోనీతో పాటు కింగ్ అక్కినేని నాగార్జున సహ యజమానిగా వ్యవహరిస్తున్నారు.
5. బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు
ఒకప్పుడు టీమిండియాలో అత్యధిక యాడ్స్ ధోనీకే ఉండేవి. ఇప్పుడు కూడా ధోనీ ఏడు హై ప్రొఫైల్ బ్రాండ్స్ కి అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. వీటి ఆధారంగానే ఆయన నెట్ వర్త్ రోజురోజుకీ పెరుగుతోంది. అంతేకాదు.. ఆయన పాపులారిటీ కూడా ఏమాత్రం తగ్గకుండా ఉండేందుకు కూడా ఇదే కారణం అని చెప్పుకోవచ్చు.
6. హోటల్ మాహి రెసిడెన్సీ
ధోనీకి ఝార్ఖండ్ లో మాహి రెసిడెన్సీ పేరుతో ఓ విలాసవంతమైన హోటల్ కూడా ఉంది. అయితే దీనికి మరెక్కడా బ్రాంచీలు లేవు. ఒకే బ్రాంచీతో ఈ హోటల్ కొనసాగుతోంది.
7. సెవెన్ ఫుట్‌వేర్ బ్రాండ్
ఫిబ్రవరి 2016 లో బ్రాండ్ సెవెన్ ని లాంఛ్ చేశారు. ధోనీని ఈ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించేందుకు ఆయనను సంప్రదించారు ఈ సంస్థ యజమానులు. అయితే ఈ బ్రాండ్ బాగా నచ్చి ఇందులో ఫుట్ వేర్ విభాగాన్ని మాత్రం కొనుగోలు చేశారు ధోనీ. ప్రస్తుతం ఈ ఫుట్ వేర్ బ్రాండ్ కి ఆయన యజమానిగా వ్యవహరిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mahendra singh dhoni, MS Dhoni