కరోనా ప్రభావం కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ ఎన్నో ఒడిదొడుకులకు గురవుతోంది. దీని ప్రభావంతో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న సంస్థలకు శుభవార్త. కెవి కామత్ నేతృత్వంలోని కమిటీ నివేదికను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI విడుదల చేసింది. కమిటీ సిఫార్సులను రిజర్వ్ బ్యాంక్ అంగీకరించింది. దీంతో ఆర్థిక సంక్షోభంతో పోరాడుతున్న సంస్థలకు రుణ పునర్నిర్మాణం రూపంలో ఉపశమనం లభించనుంది. ఈ నేపథ్యంలో రుణ పునర్నిర్మాణం అంటే ఏమిటి, ప్రజలకు ఇది ఏవిధంగా లబ్ధి చేకూర్చనుందో చూద్దాం.
రుణ పునర్నిర్మాణం అంటే ఏమిటి?
రుణ పునర్నిర్మాణం అంటే.. గతంలో తీసుకున్న అప్పులకు సంబంధించి ప్రస్తుత నిబంధనలను మార్చడం. వినియోగదారుల సౌలభ్యం కోసం బ్యాంకులు వీటిని మారుస్తాయి. అప్పుగా తీసుకున్న అసలు, దానిపై వడ్డీని మెరుగైన మార్గంలో నిర్వహించడానికి బ్యాంక్‌లు, ఫైనాన్షియల్ ఇన్స్టిస్ట్యూషన్లు నూతన విధి విధానాలు నిర్ధేశిస్తాయి. దీని వల్ల బ్యాంకులకు, వినియోగదారులకు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది.
SBI ATM: అకౌంట్లో డెబిట్ అయినా ఏటీఎంలో డబ్బులు రాలేదా? ఇలా కంప్లైంట్ చేయండి
Post Office Account: అకౌంట్లో ఈ మార్పులు చేస్తేనే ప్రభుత్వం నుంచి సబ్సిడీ వస్తుంది

ప్రతీకాత్మక చిత్రం
రుణ పునర్నిర్మాణ ప్రక్రియ ఎలా?
పునర్నిర్మాణంలో తీసుకున్న రుణం తిరిగి చెల్లించే కాల వ్యవధిని బ్యాంకులు పెంచవచ్చు. లేదా బ్యాంకులు నిర్ణీత పరిస్థితులలో వడ్డీ చెల్లింపులు చేసే వాయిదాలను మార్చవచ్చు. ఇది ఒక్కో సందర్భంలో ఒక్కో విధంగా ఉంటుంది. రుణాలకు సంబంధించి పునర్నిర్మాణం అనేది ఆఖరున ఎంచుకునే విధానం. రుణగ్రహీత డిఫాల్టర్‌గా మారే ప్రమాదం ఉందని ఆర్థిక సంస్థలు భావించినప్పుడే ఈ ప్రక్రియకు మద్దతు ప్రకటిస్తాయి. కరోనా మహమ్మారి చాలా మంది ప్రజల ఆర్థిక పరిస్థితులను అస్తవ్యస్తం చేసింది. ఇది ప్రజల అప్పులను తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని ప్రభావితం చేసింది. అందుకే రుణ పునర్నిర్మాణ ప్రక్రియను ఆర్బీఐ ప్రతిపాదించింది.
ఉదాహరణకు... ఓ వ్యక్తి సంవత్సరానికి 14% వడ్డీ చొప్పున మూడేళ్ళలో లక్ష రూపాయల రుణం బ్యాంకులకు తిరిగి చెల్లించాల్సి ఉంటుందనుకుందాం. ఆర్థిక సంక్షభం కారణంగా అతడు డబ్బు చెల్లించలేని స్థితికి చేరుకున్నప్పుడు బ్యాంకులు వివిధ మార్గాల్లో రుణ పునర్నిర్మాణం చేస్తాయి. అదెలా అంటే... రుణం చెల్లించే వ్యవధిని కొంత కాలం పొడిగించొచ్చు. ఇందుకు పాత వడ్డీనే ప్రామాణికంగా తీసుకోవచ్చు. ఈ ప్రక్రియలో రుణం తీసుకున్న వ్యక్తి ఆర్థిక వనరులను పరిశీలిస్తారు. ఇలాంటి వెసులుబాట్లతో వినియోగదారులు కాస్త విరామం తరువాత అయినా తీసుకున్న రుణం చెల్లించే అవకాశం ఉంది. ఇలాంటి సందర్భంలో ఓ వ్యక్తి తన వ్యాపారాన్ని మూసివేసే దశ నుంచి పూర్వ స్థితికి తీసుకురావచ్చు.
EPFO KYC: ఈపీఎఫ్ అకౌంట్లో తప్పులున్నాయా? ఆన్లైన్లో సరిచేయండిలా
LPG Subsidy: మీ గ్యాస్ సిలిండర్ సబ్సిడీ రాలేదా? స్టేటస్ ఇలా చెక్ చేయండి

ప్రతీకాత్మక చిత్రం
ఇల్లు, వ్యక్తిగత, ఆటో రుణాలలో ఇది ఎలా సహాయపడుతుంది?
ఈఎమ్ఐ పునర్నిర్మాణంలో బ్యాంకులు రుణ వ్యవధిని పొడిగిస్తాయి. ఇది వినియోగదారులు చెల్లించాల్సిన ఈఎమ్ఐ మొత్తాన్ని తగ్గిస్తుంది. రుణం తిరిగి చెల్లించడానికి ఇది సహాయపడుతుంది.
రుణ పునర్నిర్మాణ షరతులేంటి?
గృహ, వ్యక్తిగత, ఆటో రుణ పునర్నిర్మాణం కోసం ఆర్బీఐ కొన్ని షరతులు నిర్దేశించింది. ఈ పథకాన్ని పొందటానికి రుణగ్రహీత 31 డిసెంబర్ 2020 లోగా దరఖాస్తు చేసుకోవాలి. దీంతో పాటు, ఈ వన్-టైమ్ పునర్నిర్మాణ పథకంలో 180 రోజుల కచ్చితమైన కాలపరిమితిని నిర్ణయించారు. రుణగ్రహీత అభ్యర్థించిన రోజు నుండి 180 రోజుల్లో ఈ ప్రణాళికను బ్యాంకులు అమలు చేయాలి.
రుణ పునర్నిర్మాణంతో లాభాలేంటి?
ఇది బ్యాంకులు, వారి వినియోగదారులకు కూడా లాభదాయకమైన ఒప్పందం. బ్యాంకులు తమ డబ్బు మొండిబాకీలుగా మారకుండా కాపాడుకోవచ్చు. ఇది వారికి నష్టాలు వచ్చే అవకాశాన్ని తగ్గిస్తుంది. ఇదే సమయంలో వినియోగదారులకు రెండేళ్ల సౌకర్యవంతమైన చెల్లింపుల కాలపరిమితి లభిస్తుంది. దీంతో వారు తమ వ్యాపారాన్ని తిరిగి గాడిన పెట్టుకోవచ్చు. దీంతోపాటు బయటి నుంచి వారు అదనపు నిధులను సేకరించునే అవకాశమూ ఉంటుంది. బ్యాంకులకు రుణాల వసూలు, వినియోగదారులకు చెల్లింపుల ప్రక్రియ పూర్తి సులభతరమవుతుంది.