ప్రీమియం ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్(Royal Enfield) బైక్‌లకు యూత్‌లో ఉన్న క్రేజ్ తెలిసిందే. గత కొన్నేళ్లుగా రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌లకు ఛాలెంజ్ విసురుతూ అదే ఫీచర్లతో భారత మార్కెట్లోకి అనేక బైక్‌లు దూసుకొచ్చాయి. అయినా, బుల్లెట్ బైక్‌లకు మార్కెట్లో ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు. అయితే, 2020 ఏడాదిలో కేవలం మీటియర్ 350(new Meteor 350) బైక్ ను మాత్రమే లాంచ్ చేసిన రాయల్ ఎన్ఫీల్డ్.. 2021లో మాత్రం మూడు కొత్త బైక్‌లను లాంచ్ చేయాలని యోచిస్తోంది. ఈ బైక్‌లన్నింటినీ నూతన BS–6 ప్రమాణాలకు అనుగుణంగా మార్కెట్లోకి అందుబాటులో తీసుకురావడానికి సన్నాహాలు చేస్తుంది. వచ్చే ఏడాది రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి విడుదలకు సిద్దంగా ఉన్న ఈ 3 బైక్‌లపై ఓ లుక్కేయండి.
న్యూ 650 సీసీ క్రూయిజర్
రాయల్ ఎన్ఫీల్డ్ దాదాపు రెండేళ్ల క్రితం ఇంటర్ సెప్టర్(Interceptor) 650, కాంటినెంటల్ జిటి(Continental GT) 650లను భారత మార్కెట్లో విడుదల చేసింది. అయితే, ప్రస్తుతం స్పోర్ట్స్ వీల్స్ లో మాత్రమే లభిస్తున్న ఈ బైక్‌లను అల్లాయ్ వీల్స్ తో వచ్చే ఏడాది భారతదేశంలోకి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ బైక్‌లు 650 సీసీ ఇంజన్, పార్లల్ ట్విన్ ఇంజన్ తో వస్తాయి. ఇవి 7,250 ఆర్పీఎం వద్ద 47 పిఎస్ మాగ్జిమం పవర్, 5,250 ఆర్‌పిఎమ్ వద్ద 52 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను అందిస్తాయి. ఈ బైక్ BS–6 ప్రమాణాలకు అనుగుణంగా మార్కెట్లోకి విడుదల కానుంది.
న్యూ హంటర్ 350
వచ్చే ఏడాది విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సరికొత్త బైక్ కొంత వరకు ఇంటర్‌సెప్టర్(Interceptor) లాగే ఉంటుంది. 350 cc మోటారుతో వచ్చే ఈ బైక్ ను హంటర్ 350 (Hunter 350) అని పిలుస్తారు. రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి ఈ ఏడాది విడుదలైన మేటోర్ 350 బైక్ కు అప్డేటెడ్ వెర్షన్ గా దీన్ని రూపొందిస్తున్నారు. దీని బాడీ స్టైల్, రైడింగ్ విషయానికి వస్తే హోండా CB350 బైక్ ను పోలి ఉంటుంది. ఈ బైక్ ను కూడా నూతన BS–6 ప్రమాణాలకు అనుగుణంగా రూపొందిస్తున్నారు.
హిమాలయన్ ఫేస్ లిఫ్ట్
ఇది వరకే మార్కెట్లో అందుబాటులో ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్(Royal Enfield Himalayan) బైక్ కు కొన్ని మార్పులు చేసి వచ్చే ఏడాది విడుదల చేయనుంది. కాగా, ఈ నూతన రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ బైక్‌లో డిజైన్ తప్ప ఎటువంటి మార్పులు చేయలేదు. 411 సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ ను దీనిలో అమర్చనున్నారు. ఈ ఇంజన్ 23.9 బీహెచ్ పీ శక్తి, 32 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్(Engine) 5 స్పీడ్ గేర్ బాక్స్ తో జతచేయబడుతుంది. విడుదలైన నూతన బైక్ చిత్రాలను పరిశీలిస్తే దీనిలో అనేక మెరుగుదలలను స్పష్టంగా కన్పిస్తున్నాయి.