LIC UNCLAIMED FUNDS ARE EQUAL TO PM KISAN SCHEME INSTALLMENT OR YADADRI TEMPLE CONSTRUCTION COST SS
LIC: ఎల్ఐసీ దగ్గర రూ.21,336 కోట్ల అన్క్లెయిమ్డ్ ఫండ్స్... పీఎం కిసాన్ రైతులకు రూ.2,000 చొప్పున జమ చేయొచ్చు
LIC: ఎల్ఐసీ దగ్గర రూ.21,336 కోట్ల అన్క్లెయిమ్డ్ ఫండ్స్... పీఎం కిసాన్ రైతులకు రూ.2,000 చొప్పున జమ చేయొచ్చు
(ప్రతీకాత్మక చిత్రం)
LIC Unclaimed Funds | ఎల్ఐసీ దగ్గర ఉన్న అన్క్లెయిమ్డ్ ఫండ్స్ విలువ చూస్తే దిమ్మదిగిరిపోవడం ఖాయం. ఎల్ఐసీ అన్క్లెయిమ్డ్ ఫండ్స్‌తో పలు రకాల ప్రభుత్వ పథకాలను (Govt Schemes) ఈజీగా అందించొచ్చు.
ఇటీవలే లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ఐపీఓ సబ్స్క్రిప్షన్ ముగిసింది. ఎల్ఐసీలో 3.5 శాతం వాటాలు అమ్మి రూ.21,000 కోట్ల నిధుల్ని సమీకరించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మరో విచిత్రం ఏంటంటే ఎల్ఐసీ దగ్గర అన్క్లెయిమ్డ్ ఫండ్స్ (LIC Unclaimed Funds) అంటే ఎవరూ క్లెయిమ్ చేయని నిధులు అంతకన్నా ఎక్కువ ఉండటం విశేషం. ఎల్ఐసీ ఫిబ్రవరిలో డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టర్ (DRHP) ఫైల్ చేసినప్పుడు 2021 సెప్టెంబర్ నాటికి రూ.21,539 కోట్ల అన్క్లెయిమ్డ్ ఫండ్స్ ఉన్నాయని ప్రకటించింది. తాజాగా విడుదల చేసిన లెక్కల ప్రకారం 2021 డిసెంబర్ నాటికి రూ.21,336 కోట్ల అన్క్లెయిమ్డ్ ఫండ్స్ ఎల్ఐసీ దగ్గర ఉన్నాయి.
ఎల్ఐసీ దగ్గర ఉన్న అన్‌క్లెయిమ్స్ ఫండ్స్‌తో పీఎం కిసాన్ స్కీమ్‌లోని (PM Kisan Scheme) 10 కోట్ల మంది రైతులకు రూ.2,000 చొప్పున జమ చేయొచ్చు. అంటే పీఎం కిసాన్ స్కీమ్ ఒక ఇన్స్లాట్మెంట్కు కావాల్సిన నిధులతో సమానంగా ఎల్ఐసీ దగ్గర అన్‌క్లెయిమ్స్ ఫండ్స్ ఉన్నాయి. అంతేకాదు... ఎల్ఐసీ అన్క్లెయిమ్డ్ ఫండ్స్‌తో రెండు మానవసహిత గగన్‌యాన్ మిషన్స్ చేపట్టొచ్చు. మొదటి మిషన్‌కు రూ.10,000 కోట్ల బడ్జెట్ కేటాయించిన సంగతి తెలిసిందే. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణానికి పెట్టిన ఖర్చుతో సమానం ఈ నిధులు.
ఎల్ఐసీ దగ్గర అన్‌క్లెయిమ్స్ ఫండ్స్ ఇంతలా ఉండటం కొత్తేమీ కాదు. 2019 ఆర్థిక సంవత్సరంలో రూ.13,843.70 కోట్లు, 2020 ఆర్థిక సంవత్సరంలో రూ.16,052.65 కోట్లు, 2021 ఆర్థిక సంవత్సరంలో రూ.18,495.32 కోట్లు అన్క్లెయిమ్డ్ ఫండ్స్ ఉన్నాయని లెక్కలు చెబుతున్నాయి. 2022 ఆర్థిక సంవత్సరం లెక్కలు ఇంకా పూర్తిగా రాలేదు. 2021 డిసెంబర్ వరకు లెక్కలు మాత్రమే ఉన్నాయి. అయితే 2021 సెప్టెంబర్ కన్నా డిసెంబర్ నాటికి అన్‌క్లెయిమ్స్ ఫండ్స్ తగ్గడం విశేషం.
ఎల్ఐసీ దగ్గర అన్‌క్లెయిమ్స్ ఫండ్స్ ఇలా పేరుకుపోవడానికి కారణం పాలసీదారులు తమ డబ్బుల్ని క్లెయిమ్ చేసుకోకపోవడమే. ఎల్ఐసీ పాలసీకి డబ్బులు చెల్లించిన విషయం మర్చిపోవడం, కొన్నేళ్లు ప్రీమియం చెల్లించి ఆపేయడం, పాలసీహోల్డర్ మరణిస్తే వారి పాలసీ గురించి నామినీకి లేదా వారి కుటుంబ సభ్యులకు తెలియకపోవడం లాంటి పలు కారణాలతో ఎల్ఐసీ పాలసీలు క్లెయిమ్ కాకుండా మిగిలిపోతాయి. ఇలా క్లెయిమ్ కాని పాలసీల డబ్బంతా ఎల్ఐసీ అన్క్లెయిమ్డ్ ఫండ్స్‌లోకి వెళ్తాయి.
ఎల్ఐసీతో పాటు ఇతర ఇన్స్యూరెన్స్ కంపెనీల దగ్గర కూడా అన్క్లెయిమ్డ్ ఫండ్స్ ఉంటాయి. రూ.1,000 లేదా అంతకన్నా ఎక్కువ అన్క్లెయిమ్డ్ అమౌంట్ ఉంటే ఆ వివరాలను సదరు ఇన్స్యూరెన్స్ సంస్థ తమ వెబ్సైట్లో తప్పనిసరిగా వెల్లడించాలి. పాలసీహోల్డర్లు అన్క్లెయిమ్డ్ అమౌంట్ వివరాలు చెక్ చేసి డబ్బులు క్లెయిమ్ చేసుకోవచ్చు.
ఎవరైనా పాలసీహోల్డర్ 10 ఏళ్ల తర్వాత కూడా పాలసీ డబ్బుల్ని క్లెయిమ్ చేసుకోకపోతే కేంద్ర ఆర్థిక శాఖ నిబంధనల ప్రకారం ప్రకారం ఆ నిధులన్నీ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ ఫండ్‌కు ట్రాన్స్ఫర్ అవుతాయి. ఒక వేళ మీరు గతంలో చెల్లించిన ఎల్ఐసీ పాలసీ డబ్బుల్ని క్లెయిమ్ చేసుకోకపోతే ఆ వివరాలు ఎల్ఐసీ వెబ్సైట్లో చెక్ చేయొచ్చు. మీ డబ్బుల్ని మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎలాగో తెలుసుకోండి.
Jio New Plans: జియో నుంచి 4 కొత్త ప్లాన్స్ డిస్నీ+ హాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ ఉచితం
ముందుగా ఎల్ఐసీ అధికారిక వెబ్సైట్ https://licindia.in/ ఓపెన్ చేయాలి.
హోమ్ పేజీలో కిందకు స్క్రోల్ చేసి Unclaimed Amounts of Policyholders లింక్ పైన క్లిక్ చేయాలి.
కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
అందులో ఎల్ఐసీ పాలసీ నెంబర్, పాలసీ హోల్డర్ పేరు, పుట్టిన తేదీ, పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి.
ఈ వివరాలు అందుబాటులో లేకపోతే పాలసీ హోల్డర్ పేరు, పుట్టిన తేదీ ఎంటర్ చేసినా చాలు.
ఆ తర్వాత Submit పైన క్లిక్ చేయాలి.
అన్క్లెయిమ్డ్ ఫండ్‌లో మీ పాలసీకి సంబంధించిన డబ్బులు ఉన్నట్టైతే ఆ వివరాలు తెలుస్తాయి.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.