పాలసీదారులకు మెరుగైన సేవలు అందించేందుకు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీకి ఇటీవల కేంద్రం కొన్ని సూచనలు చేసింది. ఇన్సూరెన్స్ కంపెనీల బలోపేతానికి చర్యలు అవసరమని అభిప్రాయపడింది. అయితే ఇప్పుడు నాలుగు ప్రభుత్వ రంగ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలను లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(LIC)లో విలీనం చేసే అవకాశం ఉందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కాంపోజిట్ ఇన్సూరెన్స్‌ను అనుమతించాలని కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రపోజల్ ఆధారంగా మెర్జింగ్ జరగవచ్చని కొందరు నిపుణులు భావిస్తున్నారు. ఇన్సూరెన్స్ యాక్ట్ 1938, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ యాక్ట్ 1999లోని వివిధ నిబంధనలను సవరించాలని కూడా కేంద్రం సూచించింది.
ప్రపోజ్ చేసిన సవరణలు
కాంపోజిట్ ఇన్సూరెన్స్‌లను అనుమతించడం ద్వారా జనరల్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలను ఒకే ఇన్సూరెన్స్ కంపెనీ అందించే అవకాశం కలుగుతుంది. ఇతర ఫైనాన్షియల్ ప్రొడక్టుల సర్వీసులను అందించే అవకాశం కూడా కలుగుతుంది. ఈ మార్పులతో ఇన్సూరెన్స్ కంపెనీల రెవెన్యూ అభివృద్ధి చెందుతుంది. అదే విధంగా ఇన్సూరెన్స్ కంపెనీలకు అవసరమైన మినిమం క్యాపిటల్‌ను ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ నిర్ణయించాలని సూచించింది. ప్రస్తుతం హెల్త్, జనరల్, లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు మినిమం క్యాపిటల్‌గా రూ.100 కోట్లు చూపాల్సి ఉంటుంది. ఇప్పుడు కొత్త ఇన్సూరెన్స్ కంపెనీ పరిమాణం, కార్యకలాపాల స్థాయి ఆధారంగా మినిమం క్యాపిటల్‌ను నిర్ణయిస్తారు. ఆ మొత్తం ఎంత ఉండాలనే అంశం ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ తీసుకొనే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ బాడీలోని హోల్ టైమ్ మెంబర్స్ మరింత కాలం కొనసాగేలా సవరణలు తీసుకురావాలని కేంద్రం ప్రపోజ్ చేసింది. ప్రస్తుతం వీరి పదవీకాలం 62 సంవత్సరాలుగా ఉండగా.. 65 సంవత్సరాలకు పెంచాలని సూచించింది.
నాన్- స్ట్రాటజిక్ రంగంలో ఒకే కంపెనీ
స్ట్రాటజిక్ రంగాలలో నాలుగు ప్రభుత్వ రంగ యూనిట్లు ఉండవచ్చని, నాన్-స్ట్రాటజిక్ సెక్టార్ల విషయంలో ప్రభుత్వ యాజమాన్యంలోని ఒక యూనిట్ మాత్రమే ఉంటుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గతంలో ప్రకటించారని, ఒక సీనియర్ ఇన్సూరెన్స్ అధికారి IANSకి తెలిపారు. ఆ ప్రకటనకు అనుగుణంగా, ప్రభుత్వం తన నాలుగు నాన్-లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలను ఎల్ఐసీలో విలీనం చేయవచ్చని చెప్పారు.
మెర్జింగ్‌కు ఉద్యోగుల డిమాండ్
ప్రభుత్వ యాజమాన్యంలోని నాలుగు జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలలోని ఉద్యోగుల సంఘాలు కూడా.. ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, ది న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ కంపెనీలను విలీనం చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు ఆ అధికారి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇతర ఇన్సూరెన్స్ కంపెనీలు.. జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(GIC Re), ECGC లిమిటెడ్, అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఉన్నాయన్నారు. GIC Re జాతీయ రీఇన్స్యూరర్, ECGC, అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ ప్రత్యేక వ్యాపార యూనిట్లు అని చెప్పారు. బహుశా అగ్రికల్చర్ ఇన్సూరెన్స్‌ను భవిష్యత్తులో LICతో విలీనం చేయవచ్చని అభిప్రాయపడ్డారు.
గతంలోనూ మెర్జింగ్ ప్రకటన
ప్రభుత్వ రంగ ఇన్సూరెన్స్ కంపెనీలను బలోపేతం చేసే ఏ చర్యనైనా స్వాగతిస్తామని జనరల్ ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ ఆల్ ఇండియా అసోసియేషన్ (GIEAIA) జనరల్ సెక్రటరీ త్రిలోక్ సింగ్ IANSకి చెప్పారు.ప్రభుత్వం ప్రతిపాదించిన చట్టపరమైన సవరణలను GIEAIA అధ్యయనం చేస్తోందని ఆయన అన్నారు. కొన్ని సంవత్సరాల క్రితం.. ప్రభుత్వం ఓరియంటల్ ఇన్సూరెన్స్, నేషనల్ ఇన్సూరెన్స్, యునైటెడ్ ఇండియాలను ఒక కంపెనీగా విలీనం చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఆ తర్వాత ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: LIC, Life Insurance