కరోనా మహమ్మారి సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. కరోనా బారిన పడి అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇంట్లో సంపాదించే వ్యక్తిని కోల్పోవడంతో అనేక కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇలాంటి కుటుంబాలకు అండగా నిలిచేందుకు కేంద్ర కార్మిక శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఎంప్లాయిస్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ (ఈఎస్ఐసీ) కార్డు ఉండి కరోనా కారణంగా మృతి చెందిన లేదా అంగవైకల్యానికి గురైన కార్మికుల కుటుంబాలకు అండగా నిలిచేందుకు పెన్షన్ విధానాన్ని ప్రకటించింది. కోవిడ్-19 రిలీఫ్ స్కీమ్ కింద ఈ కొత్త విధానానికి నాంది పలికింది. బీమా చేసిన వ్యక్తి మరణిస్తే వారి కుటుంబానికి ఆర్థిక చేయూత అందించేందుకు సెక్షన్ 19 కింద ఈ సరికొత్త స్కీమ్‌ను తీసుకొచ్చింది.
ఒకవేళ ఈఎస్ఐసీ కార్డు హోల్డర్ కరోనాతో మరణిస్తే.. అతని కుటుంబానికి ప్రతినెలా కనీసం రూ.1800 పెన్షన్ ఇవ్వనున్నారు. కుటుంబంలో పోషించే వ్యక్తి ప్రాణాలు కోల్పోతే.. వారి కుటుంబానికి ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు ఈ పథకాన్ని తీసుకొచ్చారు. కాగా, 2020 మార్చి 24 నుంచి 2022 మార్చి 24 మధ్య సంభవించిన కరోనా మరణాలకే ఇది వర్తిస్తుందని ఈఎస్ఐసీ స్పష్టం చేసింది.
అర్హులైన కుటుంబాలకు చెందిన బ్యాంకు ఖాతాలకు నేరుగా ప్రతినెలా పెన్షన్ జమ అవుతుంది. మరణించిన ఉద్యోగి భార్య/ భర్త లేదా 25 ఏళ్ల లోపు ఉన్న పిల్లవాడికి ఈ పెన్షన్ అందజేస్తారు. అదే ఆడపిల్ల అయితే ఆమె వివాహం జరిగే వరకూ అందజేస్తారు. అయితే, ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వితంతువులు ఉంటే, వారికి సమానంగా పెన్షన్ విభజిస్తారు. ఇక, అర్హతల విషయానికి వస్తే.. బీమా సభ్యత్వం ఉన్న వ్యక్తి తనకు కోవిడ్ నిర్థారణ జరగడానికి కనీసం మూడు నెలలు ముందుగా ఈఎస్ఐసీ ఆన్లైన్ పోర్టల్‌లో నమోదు చేసుకొని ఉండాలి.
బీమా సభ్యత్వం ఉన్న వ్యక్తి తనకు కోవిడ్ నిర్ధారణ జరిగిన ముందు ఏడాదిలో ఏదైనా సంస్థలో నియమితుడై ఉండి, తన వేతనం నుంచి కనీసం 78 రోజుల పాటు ఈఎస్ఐసీ చందా చెల్లించి ఉండాలని ఈఎస్ఐసీ తాజా నిబంధనల్లో పేర్కొంది. కాగా, ఈ అర్హతల ఆధారంగా ఎవరికి పెన్షన్ ఇవ్వాలనేది నిర్ణయిస్తారు. సదరు ఉద్యోగి వేతనంలో 90 శాతం చొప్పున నెలవారీ పెన్షన్ కింద అందజేస్తారు. ఈ పెన్షన్ వారి కుటుంబ సభ్యులకు జీవితాంతం అందుతుంది.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.