Home Loansపై వడ్డీ రేట్లను భారీగా తగ్గించిన కొటక్ మహీంద్రా.. అతి తక్కువ వడ్డీతో లోన్ పొందే ఛాన్స్

ప్రతీకాత్మక చిత్రం

Kotak Mahindra Bank: హోమ్ లోన్లపై వడ్డీ రేట్లను తగ్గిస్తోన్న బ్యాంకుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా ప్రైవేటు రంగ బ్యాంకు కొటక్ మహీంద్రా హోమ్ లోన్ వడ్డీ రేటును మరో 10 బేసిస్ పాయింట్లు తగ్గించి 6.65 శాతానికి పరిమితం చేసింది.

  • Share this:
హోమ్ లోన్లపై వడ్డీ రేట్లను తగ్గిస్తోన్న బ్యాంకుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా ప్రైవేటు రంగ బ్యాంకు కొటక్ మహీంద్రా హోమ్ లోన్ వడ్డీ రేటును మరో 10 బేసిస్ పాయింట్లు తగ్గించి 6.65 శాతానికి పరిమితం చేసింది. ఈ వివరాలను బ్యాంకు సోమవారం ప్రకటించింది. ప్రస్తుతం ఇది మార్కెట్లో అతి తక్కువ వడ్డీ రేటు కావడం విశేషం. సవరించిన వడ్డీ రేటు మార్చి 31 వరకు వర్తిస్తుంది. ఇది అన్ని రకాల లోన్ అకౌంట్లకు వర్తిస్తుంది. ఖాతాదారుల క్రెడిట్ స్కోరు, లోన్ టు వాల్యూ (LTV) రేషియో ఆధారంగా వడ్డీ రేట్లు మారవచ్చని బ్యాంకు వెల్లడించింది. ఈ సందర్భంగా బ్యాంకు కన్స్యూమర్ అసెట్స్ విభాగం ప్రెసిడెంట్ అంభుజ్ చంద్నా మాట్లాడారు. హోమ్ లోన్ మార్కెట్ విభాగంలో కొటక్ మహీంద్రా బ్యాంక్ ఆధిపత్యాన్ని కొనసాగిస్తోందని చెప్పారు.

ఎవరికి వర్తిస్తాయి?
వినియోగదారులకు ఇయర్ ఎండ్ బోనస్‌గా తక్కువ వడ్డీతో హోమ్ లోన్ రేట్లను అందిస్తున్నామని అంభుజ్ తెలిపారు. ఎవరైనా ఇల్లు కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయమని చెప్పారు. నెలవారీ వేతనం ఉండే ఉద్యోగులు, స్వయం ఉపాధి కలిగిన కస్టమర్ సెగ్మెంట్లకు సవరించిన వడ్డీ రేట్లు వర్తిస్తాయని బ్యాంక్ ప్రకటించింది

SBI Home Loan..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా 2021 మార్చి 31 వరకు హోమ్ లోన్లపై వడ్డీ రేటును 6.70 శాతానికి తగ్గించింది. ప్రాసెసింగ్ ఫీజులపై 100 శాతం మినహాయింపు ఇస్తామని కూడా బ్యాంకు సోమవారం ప్రకటించింది. ఖాతాదారుల లోన్ అమౌంట్, సిబిల్ స్కోరు ఆధారంగా వడ్డీ రాయితీ ఉంటుంది. మంచి రీ-పేమెంట్ హిస్టరీ ఉన్న కస్టమర్లకు మెరుగైన వడ్డీ రేటు వర్తించనుంది. హోమ్ ఫైనాన్స్ విభాగంలో ఎస్‌బీఐ మార్కెట్ లీడర్‌గా ఉందని బ్యాంకు తెలిపింది.

‘వినియోగదారుల కోసం మరిన్ని మెరుగైన సేవలను ప్రకటిస్తాం. ప్రస్తుత ఆఫర్లతో కస్టమర్లకు మరింత తక్కువ వడ్డీతో హోమ్ లోన్ లభిస్తుంది. ఈఎమ్ఐ తగ్గుతుంది’ అని స్టేట్ బ్యాంక్ ప్రకటించింది. ఈ బ్యాంకు హోమ్ లోన్ వడ్డీ రేట్లను సిబిల్ స్కోరుతో అనుసంధానం చేసింది. రూ.75 లక్షల వరకు ఇచ్చే లోన్లకు 6.70 శాతం, రూ.75 లక్షలకు మించి ఉండే లోన్‌కు 6.75 శాతం వడ్డీ రేటు వర్తించనుంది.

YONO APP ద్వారా హోమ్ లోన్ కోసం దరఖాస్తు చేసుకున్న కస్టమర్లకు 5 బిపిఎస్ అదనపు వడ్డీ రాయితీ లభిస్తుందని SBI ప్రకటించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ప్రత్యేకంగా 5 బీపీఎస్ రాయితీని అందిస్తామని తెలిపింది. SBI Home Loan విభాగం రూ.5 లక్షల కోట్ల మైలురాయిని అధిగమించడం విశేషం. 2020 డిసెంబర్ 31 నాటికి బ్యాంకుకు సుమారు 35 లక్షల కోట్ల రూపాయల డిపాజిట్ల బేస్ ఉంది. హెమ్ లోన్ల విభాగంలో ఎస్‌బీఐకి 34 శాతం మార్కెట్ వాటా ఉంది.
Published by:Nikhil Kumar S
First published: