Car prices hikes: వచ్చే నెల నుంచి పెరగనున్న కార్లు, బైక్‌ల ధరలు.. కారణం ఇదే..

ప్రతీకాత్మక చిత్రం

ఖర్చుల పెరుగుదల వల్ల ఈ జనవరిలోనే వాహనాల ధరలు మరోసారి పెరిగాయి. దీంతో ఈసారి కొనుగోలుదారులు ఎలా స్పందిస్తారోనని కంపెనీలు భయపడుతున్నాయి.

  • Share this:
ఆటోమొబైల్ ఇండస్ట్రీ ప్రస్తుతం మంచి లాభాల్లో కొనసాగుతోంది. చాలా కంపెనీలు డిస్కౌంట్లు, ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. కానీ ఈ డిస్కౌంట్లు త్వరలో తగ్గిపోనున్నాయి. వచ్చే నెల నుంచి అన్ని రకాల వాహనాల ధరలు పెరిగే అవకాశం ఉంది. అల్యూమినియం, ప్లాస్టిక్ వంటి ముడి సరకు ధరలు, కమోడిటీ ఖర్చులు పెరగడం వల్ల కార్లు, ద్విచక్ర వాహనాల ధరలు పెంచుతున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఏప్రిల్ 1 నుంచి ధరలు పెంచుతున్నట్లు కొన్ని కంపెనీలు ఇప్పటికే ప్రకటించాయి. గత సంవత్సరం కరోనా ప్రభావంతో పరిశ్రమ నష్టాల్లో ఉన్నప్పటికీ.. బీఎస్‌ 4 నుంచి బీఎస్6కు మారటంతో వాహనాల ధరలు పెరిగాయి. ఖర్చుల పెరుగుదల వల్ల ఈ జనవరిలోనే వాహనాల ధరలు మరోసారి పెరిగాయి. దీంతో ఈసారి కొనుగోలుదారులు ఎలా స్పందిస్తారోనని కంపెనీలు భయపడుతున్నాయి.

స్వదేశీ, విదేశీ తయారీ సంస్థలన్నీ వాహనాల ధరలు పెంచే సూచనలు కనిపిస్తున్నాయి. భారత్‌లో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన మారుతి సుజుకి వివిధ మోడళ్లు, వేరియంట్లపై ధరలు పెంచనున్నట్లు ప్రకటించింది. సంవత్సరం నుంచి ఇన్‌పుట్ కాస్ట్ పెరగడం వల్ల వాహనాల తయారీకి అయ్యే ఖర్చు పెరుగుతోందని మారుతి సుజుకి తెలిపింది. దీన్ని బ్యాలెన్స్ చేసేందుకు వచ్చే నెలలో ధరలు పెంచనున్నట్లు పేర్కొంది. నిస్సాన్ కూడా కొత్త ఎస్‌యూవీల ధరలను పెంచాలని నిర్ణయించింది. నిస్సాన్, డాట్సన్ సిరీస్‌లోని వివిధ వేరియంట్ల ధరలను విడివిడిగా పెంచనున్నట్లు నిస్సాన్ ప్రకటించింది. ఇతర కంపెనీలు కూడా వాహనాల ధరలను సమీక్షిస్తున్నాయి. త్వరలోనే ధరల పెరుగుదల గురించి సంస్థలు ప్రకటించే అవకాశం ఉంది.

* కారణం ఏంటి?
ఇటీవల డైరెక్ట్ ఇన్‌పుట్ కాస్ట్‌తో పాటు ఇంధన ధరలు, రవాణా ఖర్చులు కూడా పెరిగాయి. ఫలితంగా కంపెనీలపై అధిక భారం పడుతోంది. డీజిల్ రిటైల్ ధరలు పెరగడంతో ఇంతకు ముందుతో పోలిస్తే రవాణా ఖర్చులు భారీగా పెరిగాయి. దీనికి తోడు మౌలిక సదుపాయాల ఖర్చులు (ఇన్‌ఫ్రాస్టక్చర్ కాస్ట్) కూడా పెరిగాయి. అందువల్ల తప్పనిసరి పరిస్థితుల్లో ధరలు పెంచాల్సి వస్తోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

* ద్విచక్ర వాహనాల ధరలు కూడా..
హీరో సంస్థ ద్విచక్ర వాహనాల ధరలను పెంచాలని నిర్ణయించింది. ఏప్రిల్ నుంచి మోటార్ సైకిల్స్, స్కూటర్ల ఎక్స్-షోరూమ్ ధరలను పెంచుతామని కంపెనీ ప్రకటించింది. కస్టమర్లపై ఎక్కువ భారం పడకుండా తయారీ ఖర్చులను తగ్గించే ప్రయత్నం చేస్తామని హీరో మోటోకార్ప్ వెల్లడించింది. ప్రీమియం బైక్స్‌పై కూడా ధరల పెరుగుదల ప్రభావం పడుతోంది. రాయల్ ఎన్ ఫీల్డ్ కొత్త వేరియంట్ల ధరలను రెండు శాతం పెంచింది. సంస్థ నుంచి ఇటీవల మార్కెట్లోకి విడుదలైన ఇంటర్‌సెప్టార్ 650, కాంటినెంటల్ జీటీ 650 బైక్‌ల ధరలు ఈ మేరకు పెరగనున్నాయి.
First published: