PPF: పీపీఎఫ్ గురించి తెలుసుకోవాల్సిన 5 విషయాలు

(ప్రతీకాత్మక చిత్రం)

PPF Rules: లాక్ డౌన్ కారణంగా పీపీఎఫ్ నిబంధనలను ప్రభుత్వం సడలించడంతో ఏడాదికి ఎన్నిసార్లైనా ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు కానీ ఆ మొత్తం ఏడాదికి లక్షన్నర మాత్రం దాటరాదు.

  • Share this:
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) కు మనదేశంలో ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు. వ్యక్తుల పీపీఎఫ్ అకౌంట్లను ఆపరేట్ చేయడం మరింత సులభతరం చేసేందుకు ఈ సేవలను ఆన్ లైన్లో (PPF online)కూడా ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. పోస్టాఫీసు లేదా బ్యాంకు యాపుల్లో (PPF app) ఇప్పుడు పీపీఎఫ్ ను మేనేజ్ చేసుకోవచ్చు. దీర్ఘకాలిక పెట్టుబడుల్లో (long term investment) స్కీమ్స్లో పీపీఎఫ్ ఉత్తమమైనది. ఏడాదికి గరిష్ఠంగా లక్షన్నర వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ప్రస్తుత త్రైమాసికం అంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ కాలానికి దీనిపై 7.9 శాతం వడ్డీ వస్తోంది. పీపీఎఫ్ వడ్డీ రేటును ప్రభుత్వం ఎప్పటికప్పుడు సవరిస్తుంది.

పన్ను నుంచి పూర్తిగా మినహాయింపు
పూర్తి పన్ను రహిత వడ్డీని (tax exemption)ఈ పీపీఎఫ్ ద్వారా ఆర్జించే వీలుంటుంది. ప్రతి ఏటా మీరు ఇన్వెస్ట్ చేసిన మొత్తానికి వడ్డీని కలుపుతుంటారు. అయితే అప్పటికప్పుడు రిటర్న్స్ ఇందులో సాధ్యం కాదు. దీర్ఘకాలంలో మంచి లాభాలు ఉంటాయి. ఇలా విత్ డ్రా చేసిన మొత్తానికి ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు.

5 ఏళ్లకు విత్ డ్రా
పీపీఎఫ్ ఖాతాదారుడు ఐదేళ్ల తర్వాత ఏడాదికోసారి పాక్షికంగా డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు. ఇలా పాక్షికంగా ఉపసంహరించుకున్నందుకు ఎలాంటి పన్ను కూడా పడదు. డబ్బు ఉపసంహరించుకున్నప్పుడు ఆ డబ్బును ఏ అవసరం కోసం తీసుకుంటున్నామనే స్పష్టత వ్యక్తులకు ఉండాలి. పిల్లలకోసం, ఇంటికోసం, లేదా ఏదైనా ఆస్తి కొనుగోలు కోసం చేయడం సరైన పనేకానీ జల్సాలు, విలాసాల కోసం కష్టపడి పొదుపు చేసుకున్న మొత్తాన్ని తగలేసేందుకు పీపీఎఫ్ ను ఆశ్రయించకండి. భవిష్యత్తును పదిలంగా కాపాడే ఆర్థిక భరోసా ఇచ్చే పీపీఎఫ్ మీకు భవిష్య నిధి (future fund) లాంటిది కూడా.

15 ఏళ్ల లాక్ ఇన్
సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందేందుకు ఇది సహకరిస్తుంది కనుక సాధారణంగా పీపీఎఫ్ ను విత్ డ్రా చేసుకునేందుకు వ్యక్తులు ఇష్టపడరు. కానీ అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే విత్ డ్రా (PPF withdrawal)చేసే యోచన చేస్తారు. నిజానికిది 15 ఏళ్లపాటు లాక్ ఇన్ (lock-in) పీరియడ్ కాబట్టి పాక్షిక ఉపసంహరణ మాత్రమే వీలుపడుతుందని గుర్తుంచుకోవాలి. కనీసం ఐదేళ్ల కాలపరిమితి ముగిశాక పీపీఎఫ్ ఖాతా నుంచి 50శాతం బ్యాలెన్స్ ను విత్ డ్రా చేసుకోవచ్చు.

బ్యాంకు బోర్డు తిప్పేసినా
ఒకవేళ బ్యాంకు బోర్డు తిప్పేసినా పీపీఎఫ్‌లో మీరు చేసుకున్న పొదుపుకు వచ్చిన నష్టమేమీ లేదు. ఎందుకంటే ఇది భారత ప్రభుత్వం చేతిలో అత్యంత సురక్షితంగా ఉంటుంది కనుక బ్యాంకులు దివాళా తీసినా మీరు బెదిరిపోవాల్సిన పనిలేదు. ఇక 15 ఏళ్ల నిర్ధిష్ట గడువు ముగిశాక కూడా మీరు పీపీఎఫ్ ఖాతాను ఐదేళ్ల చొప్పున పొడిగించుకుంటూ పోవచ్చు. ఖాతాదారుడు జీవించి ఉన్నంతవరకూ ఎన్నిసార్లైనా ఖాతాను పొడిగించుకోవచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో కనిష్ఠంగా రూ. 500-రూ.1.5 లక్షలు గరిష్టంగా మీరు పీపీఎఫ్ లో పెట్టుపడి పెట్టవచ్చు. అత్యంత ప్రజాదరణ పొందిన చిన్న మొత్తాల పొదుపు పథకాలలో పీపీఎఫ్ ఒకటి. పెట్టుబడులకు ప్రభుత్వ హామీతోపాటు మంచి రాబడి అందిస్తున్న పథకం.

రుణాలు కూడా
పోస్టాఫీసులు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో మాత్రమే కాకుండా కొన్ని ప్రైవేటు రంగ బ్యాంకుల్లోనూ పీపీఎఫ్ ఖాతాను తెరవచ్చు. ఖాతా ప్రారంభించిన 3వ సంవత్సరం నుంచి 6వ సంవత్సరం వరకూ రుణం (PPF loan)తీసుకునే వెసులుబాటు ఉంది. కానీ ఇలా తీసుకునే రుణాలపై పీపీఎఫ్ ఖాతాపై లభించే వడ్డీకంటే ఒక శాతం ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. తీసుకున్న రుణాన్ని తీర్చేందుకు 36 నెలల గడువు ఉంటుంది. 7వ సంవత్సరం నుంచి రుణాలు లభించవు కానీ పాక్షికంగా విత్ డ్రా చేసుకునేందుకు అనుమతిస్తారు. బ్యాంకు వడ్డీ రేట్లు గణనీయంగా తగ్గుతున్న నేపథ్యంలో దీర్ఘకాలిక పొదుపు కోసం పీపీఎఫ్ అత్యుత్తమైన ఎంపికగా ప్రస్తుతం కొనసాగుతోంది.

లాక్ డౌన్‌తో సడలింపు
లాక్ డౌన్ కారణంగా పీపీఎఫ్ నిబంధనలను ప్రభుత్వం సడలించడంతో ఏడాదికి ఎన్నిసార్లైనా ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు కానీ ఆ మొత్తం ఏడాదికి లక్షన్నర మాత్రం దాటరాదు. దీంతోపాటు ఖాతాలో తప్పనిసరిగా చేయాల్సిన కనీస డిపాజిట్ జమ చేయకపోయినా ఎటువంటి జరిమానాను విధించకుండా మార్పులు అమల్లోకి తెచ్చారు.
Published by:Kishore Akkaladevi
First published: