కాకీబో... జపాన్‌కు చెందిన ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ టెక్నిక్. అంటే మీ దగ్గరున్న డబ్బుల్ని ఎలా మేనేజ్ చేయాలన్న అంశాన్ని ఈ టెక్నిక్ నేర్పిస్తుంది. డబ్బు పొదుపు చేయడానికి ఈ టెక్నిక్ మీకు తప్పనిసరిగా ఉపయోగపడుతుంది. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టేవారైనా సరే... ఈ టెక్నిక్‌ను అర్థం చేసుకొని అమలు చేస్తే ఖర్చులు తగ్గించుకోవచ్చు. పొదుపు పెంచుకోవచ్చు. అసలు కాకీబో అంటే ఏంటంటే... ఇంటి జమాఖర్చుల్ని రాసే పుస్తకం అని అర్థం. 1904 సంవత్సరంలో హని మొటోకో అనే మహిళ కాకీబో టెక్నిక్‌ను పరిచయం చేశారు. కొందరు అవసరానికి మించి ఖర్చులు చేసి అప్పులపాలవడం మనం చూస్తూనే ఉంటాం. ఆన్లైన్ షాపింగ్ వలలో పడి అవసరం లేకపోయినా వస్తువులు కొనేవారినీ చూస్తుంటాం. అలాంటివారికి తమ ఖర్చుల్ని అదుపులో పెట్టుకోవడానికి 116 ఏళ్ల నాటి ఈ టెక్నిక్ చాలా బాగా ఉపయోగపడుతుంది.
కాకీబో టెక్నిక్ కోసం మీకు ఎలాంటి టెక్నాలజీ అవసరం లేదు. కేవలం ఓ పుస్తకం, పెన్ ఉంటే చాలు. మీరు నాలుగు ప్రశ్నలు వేయాలి. మీ ఆదాయం ఎంత? దాంట్లో ఎంత పొదుపు చేయాలనుకుంటున్నారా? ఎంత ఖర్చు చేస్తున్నారు? ఆర్థిక పరిస్థితిని ఎలా మెరుగుపర్చుకోవాలి? అని లెక్కలు రాయాలి. మీ ఆదాయానికి మించి ఖర్చులు ఉన్నట్టైతే మీరు అతిగా ఖర్చు చేస్తున్నట్టే. ఆ అలవాటు మిమ్మల్ని అప్పులపాలు చేయొచ్చు. అయితే నిజంగానే మీకు అవసరమైన వస్తువులపైన మీరు ఖర్చులు పెడుతున్నారా అని ఆలోచించాలి. కాకీబో పద్ధతి ఇందుకు ఉపయోగపడుతుంది. ఏదైనా ఓ వస్తువు కొనాలనుకునే ముందు ఈ కింది 7 ప్రశ్నలు మీకు మీరే వేసుకోవాలి.
1. ఈ వస్తువు లేకుండా నేను జీవించగలనా?
2. నా ఆర్థిక పరిస్థితులను బట్టి ఈ వస్తువు కొనగలిగే స్తోమత నాకు ఉందా?
3. నేను ఈ వస్తువును ఉపయోగిస్తానా?
4. ఈ వస్తువు దాచుకోవడానికి ఇంట్లో స్థలం ఉందా?
5. ఆ వస్తువును నేను మొదటిసారి ఎక్కడ చూశాను?
6. ఈ రోజు నా మానసిక స్థితి ఎలా ఉంది?
7. ఈ వస్తువు కొన్న తర్వాత నేను ఎలా ఉంటాను?
ఏదైనా వస్తువు కొనేముందు 7 ప్రశ్నలు వేసుకోవాలి. వాస్తవానికి 7 ప్రశ్నలు అవసరం లేదు. మొదటి 4 ప్రశ్నలకే మీకు సరైన సమాధానం దొరుకుతుంది. మొదటి నాలుగు ప్రశ్నల్లో మీకు ఈ వస్తువు అవసరం లేదు అనిపిస్తే కొనొద్దు. ఇలా మీరు ఏ వస్తువు కొనాలనుకున్నా, ఏ ఖర్చు చేయాలనుకున్నా, ఎక్కడైనా టూర్ వెళ్లాలనుకున్నా, సినిమాకు వెళ్లాలన్నా ఈ ప్రశ్నలు వేసుకోండి. మీ ఖర్చుల్ని కంట్రోల్ చేయడానికి ఈ టెక్నిక్ బాగా పనిచేస్తుంది. ఇలా పొదుపు చేసిన డబ్బును మీరు మీ సేవింగ్స్ వైపు మళ్లించండి. మీకు తెలియకుండానే కొన్నేళ్లలో లక్షలు సంపాదించడం పెద్ద కష్టమేమీ కాదు.
ఇవి కూడా చదవండి:
SBI Alert: ఎస్బీఐలో ఫిబ్రవరి 28 లోగా మీ వివరాలు అప్డేట్ చేయకపోతే చిక్కులే
Auto Sweep: ఈ టెక్నిక్ తెలిస్తే... మీ బ్యాంక్ అకౌంట్లోకి డబుల్ వడ్డీ
Home Loan: హోమ్ లోన్‌కు అప్లై చేసేముందు ఈ టిప్స్ గుర్తుంచుకోండి