KNOW BENEFITS OF POST OFFICE SAVINGS ACCOUNT AND HOW TO OPEN ACCOUNT SS GH
నష్టభయం వద్దనుకుంటున్నారా? Post Office డిపాజిట్లను ఎంచుకోండి
నష్టభయం వద్దనుకుంటున్నారా? Post Office డిపాజిట్లను ఎంచుకోండి
(ప్రతీకాత్మక చిత్రం)
Post Office Savings Account | మీరు బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నారా? బ్యాంకు కన్నా పోస్ట్ ఆఫీస్‌లో అకౌంట్ ఓపెన్ చేస్తే ఎక్కువ బెనిఫిట్స్ పొందొచ్చు. ఎలాగో తెలుసుకోండి.
కరోనా మన ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. దీంతో బ్యాంకులు, ఆర్థిక సంస్థలు వడ్డీ రేట్లను తగ్గిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులు పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్‌పై దృష్టి పెడుతున్నారు. పోస్ట్ ఆఫీస్‌లో పెట్టుబడులు పెట్టడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఎలాంటి నష్టభయం లేకుండా పెట్టుబడి పెట్టాలనుకునే వారిని పోస్ట్ ఆఫీస్ బ్యాంకు మంచి ఎంపిక. పోస్ట్ ఆఫీస్ డిపాజిట్లు సురక్షితమైన పెట్టుబడి మార్గాలు. సీనియర్ సిటిజన్లు, రిస్క్ ఫ్రీ పెట్టుబడులు కోరుకునే వారు వీటిని ఎంచుకోవచ్చు. పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ సాధారణ సేవింగ్స్ అకౌంట్ మాదిరిగానే ఉంటుంది. పోస్ట్ ఆఫీస్ పెట్టుబడులపై నిర్దిష్ట రాబడి పొందవచ్చు. గ్రామీణ ప్రాంతాల వినియోగదారులు వీటి ద్వారా మంచి లబ్ధి పొందవచ్చు. పోస్ట్ ఆఫీస్ బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్లను కూడా అందిస్తాయి. బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డి)తో పోలిస్తే, వీటిల్లో ఎఫ్డీలు చేయడం వల్ల మెరుగైన రాబడి లభిస్తుంది. పోస్ట్ ఆఫీస్ ఎఫ్డీలు 6.25 శాతం నుంచి 7.5 శాతం వరకు వడ్డీని అందిస్తాయి. బ్యాంకుల్లో ఎఫ్డీలు 3.75 నుంచి 7.25 శాతం వరకు మాత్రమే ఉంటాయి.
మీకు దగ్గరలో ఉండే పోస్ట్ ఆఫీస్‌కు వెళ్లి, సేవింగ్స్ అకౌంట్ అప్లికేషన్ తీసుకోండి. దాన్ని పూర్తిగా నింపిన తరువాత సంబంధిత KYC పత్రాలు, పాస్‌పోర్ట్ సైజు ఫోటోలతో కలిపి దరఖాస్తు ఇవ్వండి. ఆ తరువాత అకౌంట్లో ప్రారంభ డిపాజిట్ చేయండి. అది కనీసం రూ.20కు మించి ఉండాలి. డిపాజిట్ నగదు రూపంలోనే చెల్లించాలి. మీరు చెక్ బుక్ లేకుండా పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్‌ను పొందాలనుకుంటే, కనీసం రూ.50 డిపాజిట్ మొత్తాన్ని చెల్లించాలి.
పోస్ట్ ఆఫీస్ ఖాతాదారులు నామినేషన్ సదుపాయాన్ని పొందవచ్చు. నామినీ ఖాతాదారుడి తరఫున అకౌంట్‌ను ఆపరేట్ చేయవచ్చు. ఈ సేవింగ్స్ అకౌంట్‌ను ఒక పోస్టాఫీసు నుంచి మరొక పోస్టాఫీసు కార్యాలయానికి బదిలీ చేసుకోవచ్చు. పది సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న మైనర్లు పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్‌ను స్వతంత్రంగా తెరిచి నిర్వహించుకోవచ్చు. జాయింట్ అకౌంట్ సదుపాయాన్ని కూడా వినియోగదారులు పొందవచ్చు. సెకండ్ పార్టీ KYC పత్రాలను సమర్పించి వ్యక్తిగత సేవింగ్స్ అకౌంట్‌ను జాయింట్ అకౌంట్‌గా మార్చుకోవచ్చు. ఖాతాదారుడు మూడేళ్లలో కనీసం ఒక లావాదేవీ అయినా చేయాలి. పోస్టాఫీసు సేవింగ్స్ అకౌంట్ తీసుకున్నవారికి డెబిట్ కార్డు కూడా ఇస్తారు. అకౌంట్‌ను వేరే కార్యాలయానికి బదిలీ చేసుకున్న తరువాత, అందులో ఉండే బ్యాలెన్స్ కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. వడ్డీతో సహా రూ.10,000 వరకు పొదుపు చేసేవారు ట్యాక్స్ మినహాయింపు పొందవచ్చు.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.