KNOW ABOUT SOME CHARACTERISTICS OF GOOD CRYPTOCURRENCY HERE IS THE DETAILS AK GH
Cryptocurrency: మంచి క్రిప్టోకరెన్సీ లక్షణాలు ఏవి? క్రిప్టోలను ఎలా ఎంచుకోవాలి?
ప్రతీకాత్మక చిత్రం
ప్రస్తుతం వివిధ రకాలైన 6000కు పైగా క్రిప్టోకరెన్సీలు చెలామణిలో ఉన్నాయి. కొత్తగా క్రిప్టోకరెన్సీ పెట్టుబడులను ఎంచుకునేవారికి వీటిలో ఉత్తమమైన వాటిని గుర్తించడం చాలా కష్టమైన పని.
ప్రస్తుత డిజిటల్ యుగంలో వర్చువల్ కరెన్సీకి యువత ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. ఈ క్రమంలో భారత్‌లో క్రిప్టో ఇన్వెస్ట్మెంట్లు భారీగా పెరిగాయి. ప్రస్తుతం వివిధ రకాలైన 6000కు పైగా క్రిప్టోకరెన్సీలు చెలామణిలో ఉన్నాయి. కొత్తగా క్రిప్టోకరెన్సీ పెట్టుబడులను ఎంచుకునేవారికి వీటిలో ఉత్తమమైన వాటిని గుర్తించడం చాలా కష్టమైన పని. మనుషుల మాదిరిగానే వీటిలో కూడా మంచి, చెడు క్రిప్టోలు ఉంటాయని చెబుతున్నారు ఆర్థిక నిపుణులు. క్రిప్టో కరెన్సీలపై నియంత్రణ కోసం భారత ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకువచ్చేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో క్రిప్టో బిల్లులో ఏముంటుందోనని ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు. అయితే ప్రైవేటు క్రిప్టోలపైనే ప్రభుత్వం కఠినంగా వ్యవహరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో క్రిప్టోకరెన్సీ విలువను గుర్తించడానికి, వీటిని పెట్టుబడులు పెట్టడానికి ముందు చూడాల్సిన లక్షణాలు ఏవో తెలుసుకుందాం.
* స్థిరత్వం (Stability)
క్రిప్టోకరెన్సీల విషయంలో స్థిరత్వం అనేది దాని విలువను నిర్ధారించడంలో సహాయపడుతుంది. వాస్తవానికి క్రిప్టోకరెన్సీని వ్యక్తులు, సంస్థలు, దేశాలు ఉపయోగించాలని నిర్ణయించుకున్నప్పుడు మాత్రమే అది స్థిరంగా ఉంటుంది. అయితే భవిష్యత్తులో కొంతకాలం తరువాతే ఈ స్థిరత్వం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈథర్ (Ether), బిట్‌కాయిన్ (Bitcoin)వంటి క్రిప్టోకరెన్సీలు స్థిరంగా లేవని దీని అర్థం కాదు. కానీ ఆదర్శ (ఐడియల్) క్రిప్టోకరెన్సీ కాలక్రమంలో స్థిరత్వాన్ని పొందుతుంది. దీంతో ఆ కరెన్సీలో నిర్వహించే లావాదేవీల సంఖ్య పెరుగుతుంది. బిట్‌కాయిన్, ఈథర్ వంటి క్రిప్టోల విషయంలో ఇలాగే జరిగింది. ఈ మోడల్‌ను అనుసరించే క్రిప్టోకరెన్సీలను ఎంచుకోవడం, వాటిలో పెట్టుబడి పెట్టడంపై నిర్ణయం తీసుకోవాలి.
* భద్రత (Security)
పెట్టుబడిదారులు ఎవరైనా తమ ఆర్థిక భద్రతను దృష్టిలో ఉంచుకుని క్రిప్టోకరెన్సీని ఎంచుకోవాలి. ఒక ఐడియల్ క్రిప్టోకరెన్సీకి దాని డిజైన్లోనే భద్రత ఉంటుంది. అంటే టూ-ఫ్యాక్టర్ ఆథరైజేషన్, సంక్లిష్టమైన పాస్వర్డ్లు మాత్రమే కాకుండా హ్యాకింగ్‌కు గురికాకుండా నిరోధించడానికి వీటిలో ఇన్‌బిల్ట్ సెక్యూరిటీ ఫీచర్లు కూడా ఉంటాయి. క్రిప్టోకరెన్సీకి సంబంధించిన సాంకేతిక అంశాలను మరీ లోతుగా పరిశోధించాల్సిన అవసరం లేనప్పటికీ, అధునాతన మార్గాల ద్వారా హ్యాక్‌కు గురికాకుండా అందులో ఇన్‌బిల్ట్ సెక్యూరిటీ ఫీచర్లు ఉన్నాయో లేవో తెలుసుకోవాలి. ఇందుకు కొద్దిపాటి ప్రాథమిక పరిశోధన తప్పనిసరిగా చేయాలి. అవసరమైతే నమ్మదగిన ఎక్స్ఛేంజీల సాయం తీసుకోవాలి.
* సరఫరా (Supply)
సాధారణ లేదా ఫియట్ కరెన్సీని అవసరమైనంత మేరకు ముద్రించి, సప్లైని పెంచుకోవచ్చు. కోవిడ్-19 లాక్డౌన్ల సమయంలో ఆర్థిక వ్యవస్థలకు మద్దతుగా ఇలా నోట్ల ముద్రణ పెరగడం ఆర్థిక వ్యవస్థకు చేటు చేస్తుందని నిపుణులు విశ్లేషించారు. అయితే క్రిప్టోకరెన్సీలు ఈ సప్లై సమస్యను తప్పించుకోగలవు. వాస్తవానికి క్రిప్టోలు నిర్ణీత విలువ కలిగి ఉండే ఉనికిలో లేని వర్చువల్ కరెన్సీలు. ఇవి కొన్ని కాయిన్స్‌గా స్థిర విలువను కలిగి ఉంటాయి. ఉదాహరణకు బిట్‌కాయిన్ ఉనికిలో గరిష్టంగా 21 మిలియన్ కాయిన్స్ మాత్రమే కలిగి ఉంటుంది. అంతకు మంచి ఉండదు. ఇలా నిర్ణీత సంఖ్యలో కాయిన్స్‌ను చెలామణిలో ఉంచడానికి క్రమం తప్పకుండా చర్యలను చేపట్టే క్రిప్టోకరెన్సీ ఉత్తమమైనదిగా చెప్పుకోవచ్చు.
* స్కేలబిలిటీ (Scalability)
క్రిప్టోకరెన్సీ స్కేలబిలిటీ అనేది సెకనుకు ప్రాసెస్ చేయగల లేదా ధ్రువీకరించే లావాదేవీల సంఖ్యను సూచిస్తుంది. ఈ రోజుల్లో చెక్ ద్వారా చేసే లావాదేవీల కంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. మారిన కాలంతో పాటు ఇలాంటి మార్పులు వస్తుంటాయి. క్రిప్టోల విషయంలో కూడా ఈ వేగానికి ప్రాధాన్యం ఇవ్వాలి. అయితే ఇలా వేగంగా ప్రాసెసింగ్ చేయగల బ్లాక్‌చెయిన్‌లు లావాదేవీలను సెటిల్ చేయడానికి వివిధ పద్ధతులను ఉపయోగిస్తాయి. సాధారణంగా ఉత్తమమైనవి వేగవంతమైనవిగా ఉంటాయి. అందువల్ల తక్కువ వ్యవధిలో లావాదేవీలు జరిగే క్రిప్టోకరెన్సీలను ఇన్వెస్టర్లు ఎంచుకోవడం మంచిది.
* వికేంద్రీకరణ (Decentralisation)
క్రిప్టోకరెన్సీలో హోల్డింగ్ ఆర్గనైజేషన్‌కు బదులుగా ప్రజలకు ఎక్కువ అధికారం ఉంటుంది. వీటిలో ఎవరు ఇన్వెస్ట్ చేస్తారనే వివరాలు బయటకు తెలియవు. దీంతో వీకేంద్రీకరణ కారణంగా వీటిని ఎవరూ సొంతంగా నియంత్రించలేరు. అయితే కొన్ని క్రిప్టోకరెన్సీలు తమ కరెన్సీని మార్చటానికి, బ్లాక్‌చెయిన్ అందించే ఈ వికేంద్రీకృత స్వభావాన్ని మార్చడానికి ప్రయత్నిస్తాయి. మీరు ఎప్పుడైనా నిర్దిష్ట క్రిప్టోకరెన్సీ వెనుక ఉన్న వ్యక్తులు లేదా సంస్థ గుర్తింపును తెలుసుకుంటే.. వెంటనే వాటన్నింటినీ అమ్మడం మంచిది.
* ఉపయోగాలు గుర్తించడం
క్రిప్టోకరెన్సీలకు సంబంధించిన మరో ముఖ్యమైన అంశం.. వాటి ఉపయోగాలు, విలువను గుర్తించడం. వస్తుసేవలను కొనుగోలు చేయడానికి, వ్యాపారం చేయడానికి కరెన్సీని ఎలా ఉపయోగించాలో తెలుసుకోవాలి. అయితే క్రిప్టోలను కొనుగోలు చేసేటప్పుడు చాలా మంది వ్యక్తులు దీని గురించి పెద్దగా ఆలోచించరు. కానీ మీ క్రిప్టోతో విలువైన వాటిని ఎంచుకునే సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. అంటే క్రిప్టోలను సరైన ధరకు కొనుగోలు చేస్తూ, అమ్మడం కంటే.. అది మీకు అంతకు మించి ఎలాంటి ప్రయోజనాలు అందిస్తుందో తెలుసుకోగలగాలి.
* డిమాండ్ (Demand)
మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉండే క్రిప్టోకరెన్సీని ఇన్వెస్టర్లు ఎంచుకోవాలి. ఎక్కువగా వార్తల్లో నిలిచే క్రిప్టోలు, WazirX వంటి ఎక్స్ఛేంజీలలో లభించే కరెన్సీలు భవిష్యత్తులో మరింత వృద్ధి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి క్రిప్టోలో పెట్టుబడి పెట్టాలనే ఆలోచన వచ్చిన వెంటనే, ఎక్కువ డిమాండ్, ఎక్కువ విలువ ఉండేవాటి గురించి ఆరా తీయాలి.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.