Kisan Credit Card Scheme | రైతులు పంట పండించడానికి సమయానికి డబ్బులు లేక ఇబ్బందులు పడకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ ప్రారంభించింది. కిసాన్ క్రెడిట్ కార్డ్ ఎలా తీసుకోవాలో తెలుసుకోండి.
కిసాన్ క్రెడిట్ కార్డ్... భారతదేశంలోని రైతులకు తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన స్కీమ్ ఇది. ఈ స్కీమ్ ద్వారా రైతులు తక్కువ వడ్డీకే లోన్ తీసుకోవచ్చు. దీని వల్ల మార్కెట్లో ఎక్కువ వడ్డీకే అప్పులు చేయాల్సిన అవరం లేదు. అంతేకాదు... ఎలాంటి ష్యూరిటీ లేకుండా రూ.1.60 లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు. కాంప్లిమెంటరీ ఇన్స్యూరెన్స్ కవరేజీ కూడా లభిస్తుంది. పంట కోతలు, మార్కెటింగ్‌ను బట్టి అప్పు తిరిగి చెల్లించే వెసులుబాటు ఉంటుంది. రైతులు ఎవరైనా కిసాన్ క్రెడిట్ కార్డు తీసుకోవచ్చు. రైతులు నివసించే ప్రాంతంలోని ఉండే బ్యాంకులో కిసాన్ క్రెడిట్ కార్డుకు అప్లై చేయొచ్చు. పంట ఉత్పత్తి, వ్యవసాయేతర కార్యకలాపాలు, ఇతర అనుబంధ సంస్థలు కిసాన్ క్రెడిట్ కార్డు తీసుకోవచ్చు. గత రెండు నెలల్లో 25 లక్షల కొత్త కిసాన్ క్రెడిట్ కార్డుల్ని జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇటీవల 2.5 కోట్ల మంది రైతులను ఆదుకోవడానికి కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా రూ.2 లక్షల కోట్లు ఇవ్వనున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతే కాదు... రూ.30,000 కోట్లు అదనంగా నాబార్డ్ నుంచి ఎమర్జెన్సీ వర్కింగ్ క్యాపిటల్ కూడా ప్రకటించారు. మరి కిసాన్ క్రెడిట్ కార్డు ఎలా తీసుకోవాలో తెలుసుకోండి.
కిసాన్ క్రెడిట్ కార్డుకు కావాల్సిన ఐడీ ప్రూఫ్ డాక్యుమెంట్స్ ఇవే: పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్, ఓటర్ ఐడీ, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన ఐడీ కార్డ్, యూఐడీఏఐ జారీ చేసిన లెటర్స్.
కిసాన్ క్రెడిట్ కార్డుకు కావాల్సిన అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్స్ ఇవే: పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్, ఓటర్ ఐడీ, మూడు నెలల కరెంట్ బిల్, రేషన్ కార్డు, ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన ఐడీ కార్డ్, బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్, మూడు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు.
కిసాన్ క్రెడిట్ కార్డుకు దరఖాస్తు చేయండిలా: స్థానికంగా ఉండే ఏదైనా బ్యాంకుకు వెళ్లి కిసాన్ క్రెడిట్ కార్డు సెక్షన్లో ఉండే సిబ్బందిని సంప్రదించాలి. దరఖాస్తు ఫామ్ తీసుకొని, అవసరమైన డాక్యుమెంట్స్ జతచేసి సబ్మిట్ చేయాలి. లోన్ అధికారులు దరఖాస్తును పరిశీలించి కిసాన్ క్రెడిట్ కార్డును జారీ చేస్తారు. ఈ మొత్తం ప్రాసెస్‌లో బ్యాంకు సిబ్బంది సహకారం తీసుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.