ఇండియాలో సొంత ఇల్లు ఉండాలనేది చాలా మందికి ఉండే పెద్ద కల. ఎక్కువ డబ్బుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి చాలామంది ఇందుకు హోమ్ లోన్‌లపై (Home Loan) ఆధారపడుతుంటారు. అయితే హోమ్ లోన్ తీసుకునే సమయంలో అగ్రిమెంట్‌లోని నిబంధనల గురించి పూర్తిగా తెలుసుకోవడం అవసరం. భవిష్యత్తులో ఇబ్బందులకు గురికాకుండా జాగ్రత్త పడటం ముఖ్యం. హోమ్ లోన్ అగ్రిమెంట్ అనేది రుణగ్రహీత, రుణదాత నిబంధనలు, షరతులకు చట్టబద్ధంగా కట్టుబడి ఉండే డాక్యుమెంట్. రుణగ్రహీత, రుణదాత ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత, వారు తప్పనిసరిగా దానికి కట్టుబడి ఉండాలి. హోమ్ లోన్ అగ్రిమెంట్‌పై సంతకం చేసిన తర్వాత, వెనక్కి తీసుకోవడం అంత సులభం కాదు. కాబట్టి హోమ్ లోన్ అగ్రిమెంట్‌ను పూర్తిగా చదవడం ఎల్లప్పుడూ మంచిది. ఇందులోని కీలకమైన విషయాల గురించి తెలుసుకుందాం.
హోమ్ లోన్ వడ్డీ సవరణ
బ్యాంకుల నుంచి తీసుకున్న గృహ రుణాలతో, ఫ్లోటింగ్ వడ్డీ రేట్లు(ఉదాహరణకు రెపో రేటు వంటివి) అనుసంధానమై ఉంటాయి. బెంచ్‌మార్క్ రేటులో పెరుగుదల లేదా తగ్గుదల ఉన్నప్పుడల్లా, హోమ్ లోన్ ఇంట్రస్ట్ రేటు తదనుగుణంగా రీసెట్ అవుతుంది. మూడు నెలలకు ఒకసారి రీసెట్ అయ్యే అవకాశం ఉంది. ఇది ఆయా బ్యాంకులను బట్టి మారవచ్చు. కొన్ని బ్యాంకులు తమ వడ్డీ రేటును బెంచ్‌మార్క్ రేటులో మార్పుతో వెంటనే రీసెట్ చేస్తాయి, మరికొన్ని నెలవారీ లేదా ప్రతి మూడు నెలలకు ఒకసారి రీసెట్ చేస్తాయి.
రుణదాత రకాన్ని బట్టి, వడ్డీ మారే విధానం, EMIలో మార్పులు ఉంటాయని బ్యాంక్‌బజార్.కామ్ జనరల్ లాయర్ సౌమీ భట్ చెప్పారు. బ్యాంకుల విషయానికొస్తే, ఎప్పుడెప్పుడు వడ్డీ రేటులో సవరణ జరుగుతుంది, దానికి సంబంధించి ప్రత్యేక సమాచారం ఉంటుందో లేదో తెలుసుకోవాలని తెలిపారు. ఉదాహరణకు హెచ్‌ఎఫ్‌సీ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇంటర్నల్ RPLRని పెంచితే, EMI ఆటోమేటిక్‌గా పెరుగుతుంది. అయితే RPLRని తగ్గించకుండానే హెచ్‌ఎఫ్‌సీ తక్కువ వడ్డీని అందిస్తుంది కాబట్టి EMI ఆటోమేటిక్‌గా తగ్గకపోవచ్చు. కన్వర్షన్ రుసుము చెల్లించడం ద్వారా లోయర్ ఇంట్రస్ట్ స్ప్రెడ్ కోసం హెచ్‌ఎఫ్‌సీని సంప్రదించవచ్చు.
ముందస్తు చెల్లింపు/జప్తు
ఫ్లోటింగ్ వడ్డీ రేటుపై నడుస్తున్న గృహ రుణాలపై బ్యాంకులు ముందస్తు చెల్లింపు లేదా జప్తు ఛార్జీలు విధించవు. అయితే, ఫిక్స్‌డ్-రేట్ లోన్ తీసుకుంటే, ఒప్పందంలో పేర్కొన్న రేటు ప్రకారం బ్యాంక్ రుసుము వసూలు చేయవచ్చు. ఈ నిబంధనను చదవడంతో సరైన రీపేమెంట్ ప్లాన్ రూపొందించుకునే సదుపాయం ఉంటుంది.
LTV మార్జిన్ (సెక్యూరిటీ క్లాజ్)
రుణగ్రహీత ఆదాయం, క్రెడిట్ స్కోర్, వయస్సు, తిరిగి చెల్లించే సామర్థ్యం ఆధారంగా ఆస్తి విలువలో కొంత శాతం వరకు గృహ రుణం తీసుకునేలా బ్యాంక్ అనుమతిస్తుంది. దీనినే లోన్ టు వాల్యూ (LTV) అని కూడా అంటారు. ఒప్పందంలో, రుణదాత రుణ వ్యవధిలో ఆస్తి విలువ పడిపోతే, LTV నిష్పత్తి పెరిగితే, రుణదాత ఒరిజినల్ LTV నిష్పత్తి పునరుద్ధరించడానికి అవసరమైన నిధులను డిపాజిట్ చేయమని రుణగ్రహీతను కోరవచ్చు.
లోన్ అగ్రిమెంట్ సవరణ
రెండు పార్టీలు లోన్ అగ్రిమెంట్‌పై సంతకం చేసిన తర్వాత ఏదైనా సవరణ సాధ్యం కాదు. సవరణ చేయడానికి, రెండు పార్టీలు అంగీకరించడం అవసరం. అగ్రిమెంట్ సవరించడానికి రుణదాతను అనుమతించే ఒప్పందంలోని పాయింట్లను జాగ్రత్తగా తెలుసుకోవాలి.
డిఫాల్ట్ క్లాజ్
సాధారణంగా, రుణగ్రహీత సకాలంలో EMIని తిరిగి చెల్లించనప్పుడు, బ్యాంక్ వారిని డిఫాల్టర్‌గా గుర్తిస్తుంది. అయితే, బ్యాంకు రుణగ్రహీతను డిఫాల్టర్‌గా పరిగణించే ఇతర పరిస్థితులు కూడా ఉన్నాయి. కొన్ని డిఫాల్ట్ పరిస్థితులు రుణగ్రహీత మరణం, భార్యాభర్తల ఉమ్మడి లోన్ దరఖాస్తు ఉన్నప్పుడు విడాకులు తీసుకోవడం వంటివి. డిఫాల్ట్ నిబంధనను అమలు చేసే విభిన్న పరిస్థితులను అర్థం చేసుకోవడానికి అగ్రిమెంట్‌ను జాగ్రత్తగా చదవాలి.
ఇతర అంశాలు..
కొంతమంది రుణదాతలు ఉద్యోగం లేదా చిరునామాలో మార్పు ఉంటే వారికి తెలియజేయాల్సి ఉంటుంది. అలా చేయకుంటే పెనాల్టీ ఉండవచ్చు. అటువంటి నిబంధనలు జాగ్రత్తగా పరిశీలించాలి. సంతకం చేసే ముందు వాటిని అర్థం చేసుకోవాలి. అగ్రిమెంట్‌పై సంతకం చేసిన తర్వాత తిరిగి వెళ్లే మార్గం లేదని గుర్తుంచుకోవాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank loans, BUSINESS NEWS, Deposits, Home loan