ఈ రోజుల్లో ప్రొడక్టులను తయారు చేయడం ఎంత ముఖ్యమో వాటిని యాడ్స్ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లడం కూడా అంతే ముఖ్యం. చాలా కంపెనీల ప్రొడక్టులు యాడ్స్ ద్వారా పాపులర్ అయ్యాయి. సేల్స్ పెంచుకోవడంలో యాడ్స్ (Ads) కీలక పాత్ర పోషిస్తాయని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు ప్రముఖ బిస్కెట్ తయారీ సంస్థలు పార్లేజీ,(Parle G) బ్రిటానియా(Britannia) మధ్య యాడ్స్‌పై వివాదం చెలరేగింది. బ్రిటానియా సంస్థ తమ ఉత్పత్తులను కించపరుస్తోందని ఆరోపిస్తూ ఢిల్లీ హైకోర్టులో పార్లేజీ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు(Delhi High Court) న్యాయమూర్తి జస్టిస్ ప్రతిభా ఎం.సింగ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
* యాడ్‌ను తప్పుబట్టిన కోర్టు
పార్లేజీ బిస్కెట్లకు వ్యతిరేకంగా బ్రిటానియా చేసిన యాడ్‌ను న్యాయమూర్తి జస్టిస్ ప్రతిభా ఎం.సింగ్తప్పుబట్టారు. బ్రిటానియా తన మిల్క్ బిస్కట్లను ప్రమోట్ చేసుకోవడానికి, మరో కంపెనీ ప్రొడక్ట్‌లను అవమానపరచడాన్ని వ్యతిరేకించారు. ఈ రెండు కంపెనీల మధ్య చెలరేగిన వివాదాన్ని పరిష్కరించాల్సిందిగా ఢిల్లీ హైకోర్టు కేంద్రానికి సిఫార్సు చేసింది. పార్లే ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, బ్రిటానియా ఇండస్ట్రీస్ మధ్య మధ్యవర్తిత్వం, రాజీ కుదుర్చాలని కేంద్రాన్ని ఢిల్లీ హైకోర్టు కోరింది. ఈ రెండు కంపెనీల మధ్య వివాద పరిష్కారాన్ని అన్వేషిస్తున్న క్రమంలో బ్రిటానియా తన యాడ్లు తిరిగి ప్రచురించరాదని, వాటిని వెనక్కి తీసుకోవాలని జస్టిస్ ప్రతిభా M. సింగ్ ఆదేశించారు. వివాదానికి కేంద్ర బిందువైన 'G-NAHI', 'Adhura poshan' వంటి పదాలను తొలగించాలని బ్రిటానియాను సూచనలు చేశారు. బ్రిటానియా ఇచ్చిన వీడియో అడ్వర్టైజ్మెంట్లో చూపిన బిస్కెట్ ప్యాకేజ్ పార్లేజీని పోలి ఉందని, బ్రిటానియా ఉద్దేశపూర్వకంగానే ఈ యాడ్ చేసినట్లు తెలుస్తోందని, ఈ వీడియో యాడ్ యూట్యూబ్‌లో ఇప్పటికీ అందుబాటులో ఉందని చెప్పారు.
* మధ్యవర్తిత్వం చేయాలని కేంద్రానికి సిఫార్సు
బ్రిటానియా, పార్లేజీ మధ్య వివాదాన్ని పరిష్కరించుకోవడానికి పరస్పరం రెండు కంపెనీలు సిద్ధంగా ఉన్నందున, పార్టీలను ఢిల్లీ హైకోర్టు రాజీ కేంద్రానికి పంపామని జస్టిస్ సింగ్ చెప్పారు. మధ్యవర్తిగా సీనియర్ న్యాయవాది జేపీ సింగ్‌ను నియమించింది. మధ్యవర్తిత్వ ప్రక్రియలో భాగంగా ప్రస్తుతం యూట్యూబ్‌లో అందుబాటులో ఉన్న బ్రిటానియా అడ్వర్టైజింగ్ వీడియోలో చేయవలసిన మార్పుల గురించి చర్చించాల్సి ఉంటుందని, మధ్యవర్తిత్వ ప్రక్రియలో, సమర్థులైన వ్యక్తులు నిర్ణయాలు తీసుకోవడానికి భౌతికంగా ఇరు కంపెనీల ప్రతినిధులు పాల్గొనాలని జస్టిస్ సింగ్ నవంబర్ 22 నాటి ఉత్తర్వులో పేర్కొన్నారు. మధ్యవర్తిత్వ ఫలితాలపై డిసెంబర్ 14లోగా నివేదిక ఇవ్వాలని పార్టీలను ఆదేశించారు. ఒకవేళ ఈ వివాదం పరిష్కారం కాకపోతే, బ్రిటానియాపై నిషేధం కోరుతూ దాఖలైన పిటిషన్లపై డిసెంబర్ 12లోగా కౌంటర్ దాఖలు చేయాలని బ్రిటానియాకు తెలిపారు.
* బ్రిటానియాను నిషేధించాలని పిటిషన్
బ్రిటానియాకు వ్యతిరేకంగా పార్లే వేసిన దావాలో కంపెనీ ఉల్లంఘనకు పాల్పడిందని, ఆ కంపెనీపై శాశ్వత నిషేధాన్ని విధించాలని కోరింది. టెలివిజన్ కమర్షియల్ యాడ్స్, ఆన్లైన్ ప్రసారాలు అలాగే ప్రింట్ మీడియా ఈ–పేపర్, వార్తాపత్రికల ద్వారా అవమానకరమైన ప్రచారాలు చేసిన కారణంగా బ్రిటానియా విక్రయించే ఉత్పత్తులను నిలిపివేయాలని కోరింది. పార్లేజీ ఉత్పత్తులను అవమానించి, బ్రిటానియా తమ సేల్స్ పెంచుకోవాలని చూస్తోందని ఆరోపించింది. అయితే పార్లేజీ చేసిన ఆరోపణలపై బ్రిటానియా ప్రతినిధి స్పందిస్తూ.. ఈ వీడియో యాడ్ 2019లో విడుదలైందని, వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కోర్టుకు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Delhi High Court