ఓడలు బండ్లయ్యాయి.. బండ్లు ఓడలయ్యాయి., అంటే ఇదేనేమో.. ఒకప్పుడు దర్జాగా జంబో జెట్ బోయింగ్ విమానాలు నడిపిన జెట్ ఎయిర్వేస్ పైలట్లు.. విధి వక్రించడంతో ఇప్పుడు సాధారణ విమానాలు నడిపేందుకు క్యూ కడుతున్నారు. జీతం ఎంతైనా పర్లేదు. ఉద్యోగం ఉంటే చాలు అనే పరిస్థితికి వచ్చేసారు. దివాళా అంచుల్లో ఉన్న ప్రముఖ ఎయిర్ లైన్స్ కంపెనీ జెట్ ఎయిర్ వేస్ నుంచి సుమారు 260 మంది పైలెట్లు బడ్జెట్ ఎయిర్ లైన్స్ గా పేరొందిన స్పైస్ జెట్ లో ఉద్యోగం కోసం క్యూ కట్టారు. అయితే ఒకప్పుడు ఈ పైలెట్లు అంతా బోయింగ్ 737 నడిపే సామర్థ్యం కలవారే కావడం విశేషం. పైలట్లతో పాటు ఎయిర్ క్రాఫ్ట్ ఇంజనీర్స్, అలాగే సీనియర్ మేనేజ్మెంట్ అంతా ఎవరికి వారు వేరే ఎయిర్ లైన్స్ లో ఉద్యోగాలు చూసుకుంటున్నారు. ఇప్పటికే మూడు నెలలుగా జీతాలు పెండింగ్ లో ఉన్నాయని, మున్ముందు ఆర్థిక భారం నుంచి తప్పించుకునేందుకు వేరే మార్గం చూసుకోకతప్పడం లేదని జెట్ ఎయిర్ వేస్ సిబ్బంది వాపోతున్నారు.
స్పైస్ జెట్ మాత్రమే కాదు ఇండిగో ఎయిర్ లైన్స్ లో సైతం పైలెట్లు ఉద్యోగం కోసం క్యూ కట్టినట్లు తెలుస్తోంది. నిజానికి స్పైస్ జెట్ తక్కువ బడ్జెట్ విమాన సర్వీసులు నడుపుతుంది. అయినప్పటికీ బోయింగ్ విమానాలు నడిపే పైలట్లు సైతం జాబ్ కోసం క్యూ కట్టడం గమనార్హం.
అయితే మార్కెట్లో డిమాండ్ కు తగినట్లు వేతనాలు పొందే అవకాశం లేదని జెట్ ఎయిర్ వేస్ సిబ్బంది వాపోతున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే బోయింగ్ 737 విమానాల భద్రతపై ప్రపంచవ్యాప్తంగా అనుమానాలు వస్తున్న నేపథ్యంలో అటు బోయింగ్ విమానాలు నడిపే జెట్ ఎయిర్ వేస్ పైలట్లు ఇప్పుడు సాధారణ విమానాలు నడిపేందుకు సిద్ధమైపోతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Jet Airways, SpiceJet