2021-22వ సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్న్‌లను(ITR-Income Tax Return) ఫైల్ చేయడానికి గడువును 2021 డిసెంబర్ వరకు పొడిగించారు. చాలా మంది జీతం తీసుకొంటున్న ఉద్యోగులు ప్రక్రియను పూర్తి చేసారు. అయితే కొందరు ఇప్పటికీ వారి రీఫండ్ల కోసం వేచి ఉన్నారు. రీఫండ్లను పొందడంలో జాప్యానికి ప్రధాన కారణం కొత్త పోర్టల్‌లో తలెత్తుతున్న సాంకేతిక లోపాలు. అయితే ఈ సమస్యను సంబంధిత అధికారులు పరిష్కరించారు. అదే విధంగా ప్రక్రియను వేగవంతం చేశారు.
ఐటీఆర్ రీఫండ్ పొందకపోవడానికి కారణాలు ఏంటి? 1. అవుట్‌స్టాండింగ్ ట్యాక్సెస్
చెల్లించాల్సిన ట్యాక్స్‌ను తప్పుగా లెక్కించిన కారణంగా రీఫండ్ అభ్యర్థనను తిరస్కరించి ఉండే అవకాశం ఉంది. చెల్లించాల్సిన అవుట్ స్టాండింగ్ ట్యాక్స్ వివరాలను తెలియజేస్తూ పన్ను చెల్లింపుదారులకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి నోటీసులు వస్తాయి. అలాంటి సమయాల్లో తిరిగి అన్ని పత్రాలను సరి చూసుకోవాల్సిన అవసరం ఉంది. చెల్లించిన ట్యాక్స్, చెల్లించాల్సిన ట్యాక్స్, రీఫండ్‌ను తిరిగి లెక్కించాలి. మీరు అందజేసిన వివరాలు అన్నీ సక్రమంగానే ఉంటే.. మీరు రీఫండ్ కోసం మరోసారి ఫైల్ చేసుకొనే అవకాశం ఉంది. ఏవైనా వివరాలలో తప్పులు దొర్లి ఉంటే.. నిర్ణీత వ్యవధిలోపు బకాయి ఉన్న ట్యాక్స్ మొత్తాన్ని చెల్లించాలి.
2. ఇన్వ్యాలిడ్ బ్యాంక్ అకౌంట్
ట్యాక్స్ రీఫండ్ కోసం ఫైల్ చేసిన వారు.. సరైన, ధ్రువీకరించిన బ్యాంకు ఖాతా వివరాలను అందజేయాలి. వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుడు ఈ-వెరిఫికేషన్ ప్రాసెస్ కోసం ఈవీసీ ఎనేబుల్ చేసే ముందుగా ధ్రువీకరించిన బ్యాంకు ఖాతాను వినియోగించవచ్చు. ట్యాక్స్ రిటర్నులు, ఇతర ఫార్మ్స్, ఈ-ప్రొసీడింగ్స్, రీఫండ్ రీ-ఇష్యూ, పాస్వర్డ్ రీసెట్, ఈ-ఫైలింగ్ ఖాతా సురక్షితమైన లాగిన్ కోసం ఈ-ధ్రువీకరణను ఉపయోగించవచ్చు. బ్యాంకు ఖాతా వివరాలు మారితే.. రీఫండ్ ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్‌లోని ప్రాథమిక వివరాలతో ఫోన్ నంబరు, ఈ-మెయిల్ ఐడీ సరిపోలాలి. బ్యాంకు ఖాతాలో పేర్కొన్న వివరాలనే ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లోనూ పొందుపరచాలి.
3. అన్ వెరిఫైడ్ ఐటీఆర్
ట్యాక్స్ రీఫండ్ ఆలస్యం లేదా రద్దు అయ్యేందుకు ముఖ్య కారణం ఐటీఆర్ వెరిఫై చేయకపోవడం. ఐటీఆర్ దాఖలు చేసిన తర్వాత నిర్ణీత సమయంలో వెరిఫికేషన్ పూర్తి చేయాలి. అలా చేయకపోతే ఐటీఆర్‌ను పరిగణలోకి తీసుకోరు. వెరిఫికేషన్ చేయకపోవడం.. ఐటీఆర్ దాఖలు చేయకపోవడంతో సమానం. ఇన్‌కమ్‌ట్యాక్స్ యాక్ట్ 1961 ప్రకారం.. పన్ను దాఖలు చేయనివారికి ఎదురయ్యే అన్ని పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే తగిన కారణాలు చూపి ధ్రువీకరణలో జాప్యానికి క్షమించమని కోరవచ్చు. అభ్యర్థనను ఆమోదించిన తర్వాత మాత్రమే.. రీఫండ్ చెల్లుబాటు అవుతుంది. ఐటీఆర్ దాఖలు చేసిన 120 రోజుల్లోపు ఈ-వెరిఫికేషన్ పూర్తి చేయాలి.
4. అదనపు పత్రాలు
మీ రీఫండ్ రిక్వెస్ట్‌తో రిటర్నులను ప్రాసెస్ చేయడంలో ఆదాయపు పన్ను శాఖకు అదనపు పత్రాలు అవసరమైతే రీఫండ్ ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఈ సమస్యను అధిగమించేందుకు సంబంధిత అసెసింగ్ అధికారిని సంప్రదించి.. అవసరమైన అన్ని పత్రాలను అందించి.. ఎక్నాలెడ్జ్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. రీఫండ్ అందకపోవడానికి మరొక కారణం .. ఫార్మ్ 26AS ద్వారా డిపార్ట్మెంట్ ఖాతాలోకి తీసుకున్న పెట్టుబడి లేదా పొదుపు నుంచి వచ్చే ఆదాయాన్ని లెక్కించడంలో పొరపాటు చేసి ఉండవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.