ITR FILING DID YOU FORGET TO VERIFY YOUR INCOME TAX RETURN FOLLOW THIS STEPS GH SK
ITR Filing: మీ ఆదాయ పన్ను రిటర్న్‌ను వెరిఫై చేయడం మర్చిపోయారా? ఐతే ఇలా చేయండి
ప్రతీకాత్మక చిత్రం
ITR filing: పన్ను చెల్లింపుదారులు ఆరు మార్గాల్లో తమ ఐటీఆర్‌ని వెరిఫై చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఐదు మార్గాల్లో ఐటీఆర్‌ని వెరిఫికేషన్ చేయవచ్చు. అంతేకాకుండా ఫిజికల్ కాపీని బెంగళూరులోని సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ సెంటర్ (CPC)కి పంపించి కూడా ఐటీఆర్‌ను ధ్రువీకరించొచ్చు.
పన్ను చెల్లింపుదారులు (Tax Payers) ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఆదాయపు పన్ను రిటర్న్ (IT Returns) దాఖలు చేయడం తప్పనిసరి. ఐటీఆర్ (ITR) ఫారంలో అన్ని వివరాలను కచ్చితంగా నమోదు చేసి గడువు తేదీకి లేదా అంతకన్నా ముందే ఫైల్ చేయాల్సి ఉంటుంది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రిటర్న్స్‌ను డిసెంబర్ 31, 2021 నాటికి ఫైల్ చేసుకోవచ్చు. అయితే ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ (Income Tax Returns) దాఖలు చేసే ప్రక్రియలో చివరిది, అత్యంత ముఖ్యమైనదైన వెరిఫికేషన్ స్టెప్ (Verification Steps)ను ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోకూడదు. ఆదాయపు పన్ను చట్టాల ప్రకారం, ఐటీఆర్ (ITR) ఫైల్ చేసిన తేదీ నుంచి 120 రోజులలోగా ఐటీఆర్‌ను వెరిఫై చేయాల్సి ఉంటుంది.
పన్ను చెల్లింపుదారులు ఆరు మార్గాల్లో తమ ఐటీఆర్‌ని వెరిఫై చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఐదు మార్గాల్లో ఐటీఆర్‌ని వెరిఫికేషన్ చేయవచ్చు. అంతేకాకుండా ఫిజికల్ కాపీని బెంగళూరులోని సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ సెంటర్ (CPC)కి పంపించి కూడా ఐటీఆర్‌ను ధ్రువీకరించొచ్చు. ఒకవేళ 120 రోజుల లోపు వెరిఫికేషన్ చెయ్యకపోతే.. దానిని ఇన్వాలిడ్ రిటర్న్‌గా ఆదాయపు పన్ను శాఖ పరిగణిస్తుంది. అలాగే దాన్ని ప్రాసెస్ చేయకుండా పక్కన పెట్టేస్తుంది. దీనికితోడు పన్ను చెల్లింపుదారులు క్లెయిమ్ చేసిన ఎలాంటి టాక్స్ రాయితీలను అందించదు. ఒకవేళ మీరు నిర్ణీత గడువులోపు ఐటీఆర్‌ని వెరిఫై చేయకపోతే.. ఏం చేయాలి? ఐటీఆర్ ఫైల్ చేయకపోతే ఎలాంటి పర్యవసానాలు ఎదుర్కోవాలి? వంటి విషయాలు తెలుసుకుందాం.
* నిర్ణీత గడువులోపు ఐటీఆర్‌ని వెరిఫై చేయకపోతే ఇలా చేయండి
నిర్ణీత గడువులోపు ఐటీఆర్‌ని వెరిఫై చేయకపోవడానికి తగిన కారణాలు ఉన్నట్లయితే.. పన్ను చెల్లింపుదారులు ఇ-ఫైలింగ్ ఇన్కమ్ టాక్స్ పోర్టల్‌లో కండోనేషన్ డిలే రిక్వెస్ట్ (Condonation delay request) ఫైల్ చేయవచ్చు. ఆలస్యమైనందుకు క్షమించమని అభ్యర్థించడాన్నే కండోనేషన్ డిలే రిక్వెస్ట్ అని పిలిస్తారు. ఇలాంటి అభ్యర్థనను దాఖలు చేసే సమయంలో.. ముందుగా ఐటీఆర్‌ని ఎందుకు వెరిఫై చేయలేదో వివరణాత్మక కారణం తెలియజేయాల్సి ఉంటుంది.
మీ కండోనేషన్ డిలే రిక్వెస్ట్ కొన్ని షరతులకు లోబడి ఉన్నట్లయితే.. ఆదాయపు పన్ను శాఖ దానిని అంగీకరిస్తుంది. ఆ షరతులు తెలుసుకుంటే.. క్లెయిమ్ నిజమైనది, సరైనది అయ్యుండాలి. పన్ను రిటర్న్ దాఖలులో పేర్కొన్న ఆదాయాన్ని మరే ఇతర వ్యక్తి అంచనా వేయకూడదు. అలాగే ఐటీఆర్‌ని సకాలంలో వెరిఫై చేయకపోవడానికి సరైన కారణాలు చెప్తే.. కండోనేషన్ డిలే రిక్వెస్ట్‌ను ఆదాయపు పన్ను శాఖ యాక్సెప్ట్ చేస్తుంది.
* కండోనేషన్ డిలే రిక్వెస్ట్‌ను ఫైల్ చేయండి..
స్టెప్ 1: ఇన్కమ్ టాక్స్ పోర్టల్‌లో మీ ఖాతాలో లాగిన్ అవ్వండి.
స్టెప్ 2: మీ డ్యాష్‌బోర్డ్‌లోని 'సర్వీసెస్(Services)' ట్యాబ్ కింద, 'కండోనేషన్ రిక్వెస్ట్(Condonation request)' ఆప్షన్ ను సెలక్ట్ చేయండి.
స్టెప్ 3: కండోనేషన్ రిక్వెస్ట్ పేజీలో 'డిలే ఇన్ సబ్మిషన్ ఆఫ్ ఐటీఆర్-వీ(Delay in submission of ITR-V) ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని 'కంటిన్యూ' పై క్లిక్ చేయండి.
స్టెప్ 4: 'డిలే ఇన్ సబ్మిషన్ ఆఫ్ ఐటీఆర్-వీ' పేజీలో 'క్రియేట్ కండోనేషన్ రిక్వెస్ట్(Create Condonation Request)'పై క్లిక్ చేయండి.
స్టెప్ 5: తరువాత సెలక్ట్ ఐటీఆర్ (Select ITR) పేజీలో మీరు ఫైల్ చేయదలుచుకున్న ITR-V సబ్మిషన్ రిక్వెస్ట్ రికార్డ్‌ను సెలక్ట్ చేయండి(మీకు ఇక్కడ అక్నాలెడ్జ్మెంట్ నంబర్ అని ఒక ఫైల్ రికార్డ్ నెంబర్ కనిపిస్తుంది). తరువాత 'కంటిన్యూ(continue) బటన్ పై క్లిక్ చేయండి.
స్టెప్ 6: మీ స్క్రీన్ పై ఇప్పుడు తదుపరి పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో 'Reason for delay' ఆప్షన్ లో మీరు చెప్పదలచుకున్న కారణాన్ని వివరించండి. ఆపై submit బటన్ పై క్లిక్ చేయండి. దీంతో మీ కండోనేషన్ డిలే రిక్వెస్ట్ ఫైల్ అయిపోతుంది.
ట్రాన్సాక్షన్ ఐడీతో పాటు ఒక సక్సెస్ మెసేజ్ కూడా స్క్రీన్ పై కనిపిస్తుంది. భవిష్యత్ అవసరాల నిమిత్తం ట్రాన్సాక్షన్ ఐడీని నోట్ చేసుకోండి. మీరు ఇ-ఫైలింగ్ పోర్టల్‌తో రిజిస్టర్ చేయబడిన ఇమెయిల్ ఐడీ మొబైల్ నంబర్‌కు కూడా ఒక కన్ఫర్మేషన్ అందుతుంది.
* డిలే కండోనేషన్ దరఖాస్తు స్టేటస్ ఎలా ట్రాక్ చేయాలి
కొత్త ఇన్కమ్ టాక్స్ పోర్టల్‌లో 'సర్వీసెస్' ట్యాబ్‌లో ఉన్న 'కండోనేషన్ రిక్వెస్ట్' ఆప్షన్ ద్వారా స్టేటస్ ట్రాక్ చేయవచ్చు. దీనికి అప్రూవల్ లభించినంత వరకు మీరు ఐటీఆర్‌ని ఫైల్ చేయలేరు. సాధారణంగా కండోనేషన్ రిక్వెస్ట్‌లను టాక్స్ డిపార్ట్మెంట్ 3-4 నెలలలోపు ప్రాసెస్ చేస్తుంది.
* డిలే కండోనేషన్ రిక్వెస్ట్ తిరస్కరిస్తే?
ఒకవేళ మీ కండోనేషన్ రిక్వెస్ట్ రిజెక్ట్ అయితే, మీ రిటర్న్ అనేది వెరిఫై కాని(unverified) ఐటీఆర్ గానే ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టాల ప్రకారం, వెరిఫై కాని రిటర్న్ ను.. చెల్లని రిటర్న్‌గా పరిగణిస్తారు. ఫలితంగా మీరు పన్ను రిటర్న్‌ను దాఖలు చేయనందున కొన్ని పర్యావసానాలు భరించవలసి ఉంటుంది. పన్ను చెల్లింపుదారుని డిలే కండోనేషన్ మంజూరు కాని పక్షంలో.. వారు ఐటీ చట్టం ప్రకారం జరిమానా నిబంధనలకు లోబడి ఉంటారు.
- సెక్షన్ 234F కింద రూ. 5,000 లేట్ ఫైలింగ్ ఫీజు చేయాల్సి ఉంటుంది. అయితే, పన్ను చెల్లింపుదారుల మొత్తం ఆదాయం రూ. 5 లక్షల వరకు ఉంటే, ఆలస్య రుసుముగా రూ. 1,000 వరకు చెల్లిస్తే సరిపోతుంది.
- పన్ను చెల్లింపుదారులు సెక్షన్ 234A కింద నెలకు 1% లేదా చెల్లించని పన్ను మొత్తంపై వడ్డీకి లోబడి ఉంటారు.
- కొన్ని తగ్గింపుల ప్రయోజనాలను క్లెయిమ్ చేసే అవకాశాన్ని కోల్పోతారు. ఇంటి ఆస్తి నష్టం కాకుండా ఇతర నష్టాలను సెట్ చేయడం, క్యారీ ఫార్వర్డ్ చేసుకోడానికి కూడా అనుమతి ఉండదు.
- పన్ను చెల్లించని వ్యక్తికి సంబంధించి సెక్షన్ 276CC కింద ప్రాసిక్యూషన్ కూడా ప్రారంభించవచ్చు. ట్యాక్స్ పేయర్ ఎగవేసిన పన్ను మొత్తాన్ని బట్టి కనీసం 3 నెలల నుంచి రెండేళ్ల వరకు పెట్టిన కారాగార శిక్షతో పాటు జరిమానా కట్టాల్సి రావచ్చు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.