కరోనా ప్రతికూల పరిస్థితిలోనూ ఐటీ/సాఫ్ట్వేర్ రంగం వేగంగా వృద్ధి చెందుతోంది. లాక్డౌన్ ఎఫెక్ట్ అన్ని రంగాలపై పడినప్పటికీ ఐటీ రంగంపై ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయింది. ఇతర అన్ని రంగాల్లోని పరిశ్రమలు నష్టాల్లోకి జారుకొని ఉద్యోగులను తీసేశాయి. కానీ సాఫ్ట్వేర్ రంగం మాత్రం కొత్త ఉద్యోగాలు సృష్టించింది. వివిధ సంస్థలు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లతో కొత్త ఉద్యోగులను నియమించుకున్నాయి. ప్రముఖ జాబ్ పోర్టల్ నౌకరీ నివేదిక ప్రకారం కరోనాకు ముందు.. అంటే 2019 జూన్‌లో జరిగిన నియామకాలతో పోలిస్తే గత నెలలో ఏకంగా 52 శాతం నియామకాలు పెరిగాయి. అంతేకాదు, ఈ రంగం గత నెలలో 5 శాతం వృద్ధిని నమోదు చేసింది. అంటే, కరోనా లాక్డౌన్ కారణంగా ఐటీ రంగంలో నియామక కార్యకలాపాలు పెద్దగా ప్రభావితం కాలేదని స్పష్టమవుతోందని పేర్కొంది.
గతేడాది కరోనా ఫస్ట్‌వేవ్ లాక్డౌన్ సమయంలో ఈ రంగం ఎన్నో సవాళ్లను ధీటుగా ఎదుర్కొంది. ఏదేమైనా, 2020 జూన్‌తో పోల్చితే 2021 జూన్‌లో 163 శాతం నియామక వృద్ధి కనబర్చడం విశేషం. ఐటి కంపెనీల కేంద్రంగా ఉన్న బెంగళూరు, పూణే, హైదరాబాద్ వంటి నగరాల్లో ఉండే కంపెనీలు తమ నియామకాల్లో రెండంకెల వృద్ధిని సాధించాయి. ఐటీ ప్రొఫెషనల్స్‌కు ఏమాత్రం డిమాండ్ తగ్గలేదని ఈ గణాంకాలే వివరిస్తున్నాయి.
52 శాతం పెరిగిన నియామకాలు..
ఐటి పరిశ్రమ సంస్థ నాస్కామ్ ప్రకారం, నైపుణ్యం కలిగిన ఐటీ ప్రొఫెషనల్స్‌కు ఈ రంగంలో విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. వారికి అధిక వేతనాలు ఇవ్వడానికి కూడా వెనుకాడటం లేదు. వీరితో పాటు ఫ్రెషర్స్‌ను కూడా భారీగా నియమించుకుంటున్నాయి. ఇందులో భాగంగా 2021–22 సంవత్సరంలో టాప్ 5 భారతీయ ఐటి కంపెనీలు అదనంగా 96,000 మంది ఉద్యోగులను నియమించుకోవాలని యోచిస్తున్నాయి.
సాంకేతిక విప్లవం, పెరుగుతున్న ఆటోమేషన్ కారణంగా ఉద్యోగ నియామకాలు తగ్గుతాయని భావించినప్పటికీ, ఇది కొత్త ఉద్యోగాల సృష్టికి దారితీస్తుంది. అందువల్ల, 2020–21 ఆర్థిక సంవత్సరంలో 1,38,000 మంది కొత్తగా నియమించుకున్నాయి ఆయా ఐటీ సంస్థలు. ఇక, డిజిటల్ స్కిల్స్ నైపుణ్యం ఉన్న 250,000 మందిని, 40,000 మంది ఫ్రెషర్స్‌ను నియమించుకున్నాయి. ఇలా నిరంతరం నియామకాల జోరు కొనసాగిస్తూ ఇతర రంగాల కంటే వేగంగా వృద్ధి చెందుతోంది. ఇదే జోరు కొనసాగితే 2025 నాటికి భారతీయ ఐటీ పరిశ్రమ 300 నుంచి -350 బిలియన్ డాలర్ల ఉత్పాదకత సాధించగలదని ఐటీ నిపుణులు చెబుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Information Technology