Home /News /business /

IT HAS BECOME SIMPLER AND MORE CONVENIENT TO BUY A CAR INSURANCE POLICY ONLINE MK GH

Buying vehicle insurance online: ఆన్‌లైన్‌లో వాహనాలకు ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా...ఇది మీ కోసం...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

వివిధ సంస్థలు ఆన్‌లైన్‌లోనే సులభంగా ఇన్సూరెన్స్ పాలసీలను అందిస్తున్నాయి. డిజిటల్ విధానంలో కొన్ని డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేసి, నిర్ణీత రుసుము చెల్లించిన తరువాత సంబంధిత వాహనానికి ఇన్సూరెన్స్ పాలసీ అమల్లోకి వస్తుంది.

వాహనాలకు తప్పనిసరిగా ఇన్సూరెన్స్ తీసుకోవాలని మన దేశంలోని వాహన చట్టాలు చెబుతున్నాయి. ఈ రోజుల్లో వెహికిల్ ఇన్సూరెన్స్ లేని కార్లు, ద్విచక్ర వాహనాలకు ట్రాఫిక్ పోలీసులు భారీ జరిమానా విధిస్తున్నారు. అందువల్ల చాలామంది కస్టమర్లు వెహికిల్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. వివిధ సంస్థలు ఆన్‌లైన్‌లోనే సులభంగా ఇన్సూరెన్స్ పాలసీలను అందిస్తున్నాయి. డిజిటల్ విధానంలో కొన్ని డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేసి, నిర్ణీత రుసుము చెల్లించిన తరువాత సంబంధిత వాహనానికి ఇన్సూరెన్స్ పాలసీ అమల్లోకి వస్తుంది. కానీ ఆన్‌లైన్‌లో పాలసీని కొనుగోలు చేయడానికి ముందు దానికి సంబంధించిన లాభనష్టాలను పూర్తిగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. వీటిపై కస్టమర్లు అవగాహన పెంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఆన్‌లైన్‌లో వెహికిల్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల లాభాలు

ఆన్‌లైన్‌లో సులభంగా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవచ్చు. ఆఫ్‌లైన్‌లో మాదిరిగా వివిధ రకాల ఫారంలను నింపడం, ఎన్నో రకాల డాక్యుమెంట్లను సేకరించడం.. వంటి ఇబ్బందులు ఉండవు. అవసరమైన కొన్ని డాక్యుమెంట్ల సాయంతో ఆన్‌లైన్లోనే కంపెనీలు పాలసీని నిర్ణయిస్తాయి. ఖాళీ సమయాల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. దీనికి ప్రత్యేకంగా కంపెనీ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు.

- ఆన్‌లైన్‌లో ఇన్సూరెన్స్ పాలసీ కొనుగోలు చేసేవారు ఎక్కువ సమయాన్ని ఇందుకు కేటాయించాల్సిన అవసరం లేదు. మొత్తం కొనుగోలు ప్రక్రియను కొన్ని నిమిషాల్లోనే పూర్తి చేయవచ్చు. ఆఫీసులకు సెలవు పెట్టాల్సిన అవసరం లేకుండా.. ఖాళీ సమయాల్లో ఎప్పుడైనా పాలసీని కొనుగోలు చేయవచ్చు. కానీ ఆఫ్ లైన్ విధానంలో ఇందుకు ఎక్కువ సమయం పడుతుంది. కస్టమర్లు ఇన్సూరెన్స్ కంపెనీ బ్రాంచ్ ఆఫీసుకు వెళ్లాల్సి ఉంటుంది. లేదంటే ఏజెంట్ ద్వారా పాలసీ తీసుకోవాల్సి ఉంటుంది.

- వివిధ కంపెనీల ఇన్సూరెన్స్ పాలసీలు, వాటి ప్రయోజనాలను ఆన్‌లైన్‌లో సులభంగా పోల్చి చూడవచ్చు. కంపెనీల వెబ్‌సైట్ల ద్వారా ఇందుకు అవసరమైన సమాచారాన్ని సేకరించవచ్చు. ఏజెంట్లు, కంపెనీ ప్రతినిధుల ప్రమేయం లేకుండా.. తమ సొంత నిర్ణయం ప్రకారం పాలసీలను ఎంచుకోవచ్చు. అవసరమైతే ఆన్‌లైన్‌ కార్ ఇన్సూరెన్స్ కాలిక్యులేటర్ల సాయం తీసుకోవచ్చు. ఆఫ్‌లైన్ విధానంలో అయితే వివిధ కంపెనీల బ్రాంచులకు వెళ్లి పాలసీల గురించి ఆరాతీయడం పెద్ద తలనొప్పిగా మారుతుంది.

- ఆన్‌లైన్లో వాహనాలకు ఇన్సూరెన్స్ తీసుకునేందుకు తక్కువ ఖర్చవుతుంది. డిజిటల్ ఇన్సూరెన్స్ కంపెనీలు కేవలం ఆన్‌లైన్ విధానంలోనే పనిచేస్తాయి. అందువల్ల కంపెనీలకు ఆపరేషనల్ కాస్ట్ భారం తగ్గుతుంది. ఫలితంగా కంపెనీలు కస్టమర్లపై విధించే ఛార్జీల భారం తగ్గుతుంది.

ఆన్‌లైన్ ఇన్సూరెన్స్‌తో ఎదురయ్యే ఇబ్బందులు

- ఆన్‌లైన్‌లో పాలసీ తీసుకునేటప్పుడు వెబ్‌సైట్‌లో కంపెనీలు అడిగే కొన్ని ప్రశ్నలను కస్టమర్లు వదిలేసే అవకాశం ఉంది. కొంతమంది తప్పుడు సమాధానాలతో పాలసీ తీసుకుంటారు. దీనివల్ల ఇన్సూరెన్స్ క్లెయిం చేసుకునేటప్పుడు సమస్యలు ఎదురవుతాయి. కొన్నిసార్లు కంపెనీలు క్లెయింను రద్దు చేస్తాయి. పాలసీ విధి విధానాలు, క్లెయిం సెటిల్‌మెంట్, యాడ్ ఆన్ పాలసీ వంటి అంశాలపై అవగాహన లేనప్పుడు.. కస్టమర్లు ఆన్‌లైన్‌లో పూర్తి వివరాలను కంపెనీలకు అందించలేరు. దీని ప్రభావం పాలసీ క్లెయిం సెటిల్‌మెంట్‌పై పడుతుంది.

- ఈ రోజుల్లో ఇన్సూరెన్స్ కంపెనీలు పోటీని తట్టుకోవడానికి ఎన్నో ఆఫర్లు, తగ్గింపులను ప్రకటిస్తున్నాయి. సాధారణంగా కంపెనీలు పాలసీ రిస్కులో కస్టమర్లను కూడా భాగం చేస్తాయి. దీన్ని ‘ఎక్సెస్’ అంటారు. ఈ ఆప్షన్‌ను ఎంచుకునేవారు చెల్లించాల్సిన ప్రీమియం తగ్గుతుంది. దీని గురించి పూర్తి వివరాలను కంపెనీ ప్రతినిధులు లేదా ఏజెంట్లు మాత్రమే వివరించగలుగుతారు. ఆన్‌లైన్‌లో పాలసీ తీసుకునేవారు ప్రీమియం ఖర్చులను తగ్గించే ఇలాంటి ఆప్షన్లను ఎంచుకోలేరు.

- ఆన్‌లైన్‌లో పాలసీలను కొనుగోలు చేసేవారు మోసపూరిత కంపెనీలు, థర్డ్ పార్టీ వెబ్‌సైట్ల ద్వారా మోసపోయే అవకాశాలు ఎక్కువ. సైబర్ నేరగాళ్లు నకిలీ వెబ్‌సైట్ల సాయంతో కస్టమర్లను సులభంగా మోసం చేస్తున్నారు. ఇలాంటి స్కామ్‌లకు కస్టమర్లు దూరంగా ఉండాలి.

- ప్రస్తుతం చాలా ఇన్సూరెన్స్ కంపెనీలకు ఆన్‌లైన్ క్లెయిం ప్రాసెసింగ్ యంత్రాంగం లేదు. అందువల్ల ఆన్‌లైన్లో పాలసీని ఎంచుకునేవారికి క్లెయిం సెటిల్‌మెంట్ ఫైల్ చేయడం కష్టంగా ఉంటుంది. ఈ సేవల కోసం పూర్తిగా కంపెనీ కస్టమర్ కేర్ ప్రతినిధులపైనే ఆధారపడాల్సి ఉంటుంది. ఆఫ్‌లైన్లో అయితే.. క్లెయిమ్ సెటిల్‌మెంట్ విషయంలో ఏజెంట్లు కస్టమర్లకు అన్ని విధాలుగా సాయం చేస్తారు.
Published by:Krishna Adithya
First published:

Tags: Bikes, Business

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు