• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • IS THIS RIGHT TIME TO INVEST IN SMALL SAVINGS AFTER INTEREST RATE CUT HERE IS THE DETAILS AK GH

Small savings schemes: వడ్డీ రేట్లలో మార్పులు.. ప్రస్తుత పెట్టుబడులను కొనసాగించాలా ?

Small savings schemes: వడ్డీ రేట్లలో మార్పులు.. ప్రస్తుత పెట్టుబడులను కొనసాగించాలా ?

ఫ్రతీకాత్మక చిత్రం

చిన్న మొత్తాల పొదుపు పథకాలు, బ్యాంకు డిపాజిట్లపై వడ్డీరేట్లలో మార్పులను ఇన్వెస్టర్లు గమనించాలి. వీటికి అనుగుణంగా దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలపై నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది.

  • Share this:
ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే కొత్త త్రైమాసికానికి వడ్డీ రేట్లను సవరించిన ప్రభుత్వం.. ఆ ఉత్తర్వులను ఒక్క రోజులోనే వెనక్కు తీసుకుంది. వివిధ రకాల చిన్నమొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లలో 40-110 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. అయితే ఈ ఉత్తర్వులను 24 గంటల్లోనే వెనక్కు తీసుకుంది. కానీ ఈ ఉపశమన చర్యలు తాత్కాలికమే కావచ్చని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ వడ్డీ రేట్లలో మార్పులు వ్యక్తుల ఆర్థిక లక్ష్యాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో తెలుసుకోవాలని వారు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో చిన్న మొత్తాల పొదుపు పథకాలు, బ్యాంకు డిపాజిట్లపై వడ్డీరేట్లలో మార్పులను ఇన్వెస్టర్లు గమనించాలి. వీటికి అనుగుణంగా దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలపై నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది.

స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్‌పై వడ్డీ రేట్లలో కోత విధిస్తున్నామని కేంద్ర ప్రభుత్వ బుధవారం ప్రకటించింది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ వడ్డీ రేట్లను 7.1 శాతం నుంచి 6.4 శాతానికి, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ వడ్డీని 6.8 నుంచి 5.9 శాతానికి, సుకన్య సమృద్ధి యోజనపై 7.6 శాతం నుంచి 6.9 శాతానికి తగ్గిస్తున్నట్లు వెల్లడించింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలోని మొదటి త్రైమాసికంలో చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీని నాలుగు శాతం నుంచి 3.5 శాతానికి తగ్గించారు. కానీ ఈ ఉత్తర్వులను వెనక్కు తీసుకుంటున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అంతకు ముందు త్రైమాసికంలోని వడ్డీ రేట్లనే కొనసాగిస్తామని చెప్పారు.

* మళ్లీ కోతలు ఉంటాయా?
కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ పతనం కాకుండా కాపాడటానికి గత ఏడాది డిపాజిట్లపై వడ్డీ రేట్లను రిజర్వు బ్యాంకు తగ్గించింది. ఇప్పటి వరకు ఆ వడ్డీ రేట్లే అమల్లో ఉన్నాయి. కానీ ప్రస్తుతం వివిధ రకాల లోన్‌పై వడ్డీ రేట్లు తగ్గుతున్నాయి. హోమ్ లోన్ వడ్డీ రేట్లు 7 శాతం కంటే తక్కువగా ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో ఆర్థిక సంస్థలు డిపాజిట్లపై 7-8 శాతం వడ్డీని ఇస్తాయని ఆశించలేం. అందువల్ల ప్రస్తుతానికి వడ్డీ రేట్ల కోతను ప్రభుత్వం వాయిదా వేసినప్పటికీ, జులై 1 నుంచి ప్రారంభమయ్యే రెండో త్రైమాసికంలో మళ్లీ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉందని బ్యాంకర్లు విశ్లేషిస్తున్నారు.

* ఆర్థికవేత్తలు ఏమంటున్నారు?
కేంద్ర ప్రభుత్వం ఆర్థిక లోటును పూడ్చుకోవడానికి చిన్న పొదుపు పథకాల నిధిని ఉపయోగిస్తోంది. ఈ డెఫిసిట్ ఫైనాన్సింగ్ ఖర్చులను తగ్గించాలని ప్రభుత్వం ఆశిస్తోంది. అందుకే వడ్డీ రేట్లలో కోత విధించింది. కారణాలు ఏవైనా మళ్లీ ఉత్తర్వులను వెనక్కు తీసుకుంది. ప్రభుత్వ ధోరణి స్పష్టంగా ఉంది కాబట్టి.. రానున్న రెండు లేదా మూడో త్రైమాసికంలో వడ్డీ రేట్లపై మళ్లీ కోత విధించవచ్చని ఆర్థికవేత్తలు విశ్లేషిస్తున్నారు. వడ్డీ రేట్ల కోతల వల్ల ప్రజలు పొదుపులను తగ్గించి ఖర్చు చేయడం ప్రారంభిస్తారని, తద్వారా ఆర్థిక వ్యవస్థకు ఊతం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.

* ద్రవ్యోల్భణం ప్రభావం ఉందా?
చిన్న మొత్తాల పొదుపు పథకాల ఫండ్‌ ఆర్థిక లోటును (deficit) భర్తీ చేయడానికి కీలక వనరుగా మారింది. కరోనా తరువాత ఏర్పడ్డ ప్రభుత్వ లోటును పూడ్చడానికి ఈ మార్గాన్ని ప్రభుత్వం ఎంచుకోవాల్సి వచ్చింది. దీనికి తోడు వడ్డీ రేట్లు ద్రవ్యోల్బణం ఆధారంగా కూడా ప్రభావితమవుతాయి. ఈ సంవత్సరం జనవరిలో ద్రవ్యోల్భణం 4.06 శాతంతో 16 నెలల కనిష్టానికి పడిపోయింది. కానీ ఫిబ్రవరిలో ఇది 5.03 శాతానికి పెరిగింది. ఈ నేపథ్యంలో కొన్ని చిన్న పొదుపు పథకాలపై బ్యాంకులు వాస్తవ వడ్డీ రేట్ల పరంగా ఎక్కువ మొత్తాన్ని ఇవ్వకపోవచ్చు. దీనివల్ల కూడా సేవింగ్స్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించాలని బ్యాంకులు నిర్ణయం తీసుకున్నాయని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు.

* ప్రస్తుతం పెట్టుబడులు పెట్టవచ్చా?
ప్రస్తుతం వడ్డీ రేట్ల తగ్గింపుల భయం లేనందున స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్‌లో పెట్టుబడులను ఎంచుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఎంచుకునేవారు కనీసం ప్రస్తుత త్రైమాసికంలో అయినా ఎక్కువ వడ్డీ రేట్లను పొందవచ్చు. చిన్నమొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం త్రైమాసికాల వారీగా సమీక్షిస్తుంది. కానీ మే లేదా జూన్ నెలలో ప్రభుత్వం వడ్డీ రేట్లలో కోత విధించి, అవి ప్రస్తుత త్రైమాసికానికి కూడా అమల్లో ఉంటాయని ప్రకటిస్తే చేసేదేం లేదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. డెట్ స్కీమ్‌లపై ప్రస్తుతం తక్కువ వడ్డీ రేట్లు ఉన్నాయి. ఇవి మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది. అందువల్ల లాంగ్ టర్మ్ డెట్ స్కీమ్‌లలో పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిదని సలహా ఇస్తున్నారు. ఇన్వెస్టర్లు రెండు, మూడేళ్ల వరకు అమల్లో ఉండే పథకాలనే ఎంచుకోవాలి. ఆ తరువాత రాబడి పెరుగుతుందనే భరోసా ఉంటే పెట్టుబడులను కొనసాగించుకోవచ్చు.
First published:

అగ్ర కథనాలు