Cash Withdrawal at Point of Sale Terminals | ప్రజలు నగదు లేక ఇబ్బంది పడకూడదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI అనేక నిర్ణయాలు తీసుకుంటోంది. పాయింట్ ఆఫ్ సేల్ టెర్మినల్స్‌లో డెబిట్ కార్డుల ద్వారా డబ్బులు తీసుకునే అవకాశం కల్పిస్తోంది.
ఏటీఎంలో డబ్బులు లేవా? అయితే ఏదైనా షాపులో కార్డు స్వైప్ చేసి డబ్బులు తీసుకోవచ్చు. పాయింట్ ఆఫ్ సేల్ టెర్మినల్స్ నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకునే అవకాశాన్ని కల్పించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI. ఈ సదుపాయం ఎప్పట్నుంచో ఉంది. అయితే దీనిపై అనేక సందేహాలు ఉన్నాయి. ఆ సందేహాలకు సమాధానాలు ఇచ్చింది ఆర్బీఐ. పాయింట్ ఆఫ్ సేల్ టెర్మినల్స్‌లో క్యాష్ విత్‌డ్రాయల్ విధానాన్ని వివరించింది. బ్యాంకులు జారీ చేసిన డెబిట్ కార్డులు, ఓపెన్ సిస్టమ్ ప్రీపెయిడ్ కార్డ్స్‌తో డబ్బులు డ్రా చేసుకోవచ్చు. కానీ క్రెడిట్ కార్డులతో డబ్బులు డ్రా చేసుకోవడం సాధ్యం కాదు. యూపీఐ ద్వారా కూడా పీఓఎస్ టెర్మినల్స్‌లో డబ్బులు డ్రా చేసుకోవచ్చు. ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం ఉన్న ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన అకౌంట్స్‌కు జారీ చేసిన ఎలక్ట్రానిక్ కార్డుల ద్వారా డబ్బులు తీసుకోవచ్చు.
పీఓఎస్ టెర్మినల్స్‌లో టైర్ 1, టైర్ 2 ప్రాంతాల్లో రోజుకు రూ.1,000 మాత్రమే క్యాష్ డ్రా చేసుకోవచ్చు. టైర్ 3, టైర్ 4 ప్రాంతాల్లో రోజుకు రూ.2,000 వరకు డ్రా చేసుకోవచ్చు. ఇందుకోసం ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. గరిష్టంగా 1% వరకు ఛార్జీలు ఉంటాయి. ఉదాహరణకు పీఓఎస్ టెర్మినల్‌లో రూ.1,000 క్యాష్ డ్రా చేసినట్టైతే రూ.10 ఛార్జీ చెల్లించాలి. అన్ని పీఓఎస్ టెర్మినల్స్‌లో క్యాష్ విత్‌డ్రాయల్ సదుపాయం ఉండదు. ఇందుకోసం పీఓఎస్ టెర్మినల్స్ ఉన్న వ్యాపారులు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏ బ్యాంకు పీఓఎస్ టెర్మినల్‌లో ఏ బ్యాంకు డెబిట్ కార్డు అయినా ఉపయోగించి డబ్బులు డ్రా చేయొచ్చు. కస్టమర్ డబ్బులు డ్రా చేసినప్పుడు వ్యాపారి రిసిప్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ షాపులో ఏదైనా వస్తువులు కొని, డబ్బులు డ్రా చేసినట్టైతే వేర్వేరుగా రిసిప్ట్స్ తీసుకోవాలి.
పీఓఎస్ టెర్మినల్‌లో డబ్బులు డ్రా చేయడంలో ఏవైనా సమస్యలు ఉన్నట్టైతే మీకు కార్డు ఇచ్చిన బ్యాంకుకు కంప్లైంట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ కార్డు జారీ చేసిన బ్యాంకు ఫిర్యాదుపై స్పందించకపోతే బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్ స్కీమ్ లేదా అంబుడ్స్‌మన్ స్కీమ్ ఫర్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్‌కు ఫిర్యాదు చేయొచ్చు. పీఓఎస్ టెర్మినల్స్‌లో డబ్బులు విత్‌డ్రా చేసుకునే సదుపాయాన్ని Cash@pos పేరుతో అందిస్తోంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీన్నే మినీ ఏటీఎం, ఛోటా ఏటీఎం అని పిలుస్తుంటారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.