ఇన్సూరెన్స్ కంపెనీలకు IRDAI కీలక ఆదేశాలు, వరద బాధితులకు ఊరట

వరదల్లో నష్టపోయిన బాధితులు క్లెయిమ్‌ల కోసం దరఖాస్తు చేసుకుంటే వాటిని వెంటనే పరిష్కరించాలని IRDAI స్పష్టం చేసింది.

news18-telugu
Updated: October 22, 2020, 3:03 PM IST
ఇన్సూరెన్స్ కంపెనీలకు IRDAI కీలక ఆదేశాలు, వరద బాధితులకు ఊరట
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వరదలు బీభత్సం సృష్టించాయి. గత కొన్ని రోజులుగా కురిసిన వర్షాలకు రెండు తెలుగు రాష్ట్రాల్లో వందలాది కాలనీలు నీటమునిగాయి. హైదరాబాద్‌ మొత్తం అతలాకుతలం అయిపోయింది. తెలంగాణలో రూ.5000 కోట్ల నష్టం వాటిల్లినట్టు గతంలో సీఎం కేసీఆర్ చెప్పారు. చాలా ప్రాంతాల్లో రైతులు పెద్ద ఎత్తున పంటలు నష్టపోయారు. ఆస్తి నష్టం వాటిల్లింది. కొందరి ప్రాణాలు కూడా పోయాయి. 70 మంది వరకు చనిపోయినట్టు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. వరద తగ్గిన కొన్ని రోజుల తర్వాత మృతదేహాలు బయటపడుతున్నాయి. ఇలాంటి క్రమంలో ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అధారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) ఇన్సూరెన్స్ కంపెనీలకు మార్గదర్శకాలు విడుదల చేసింది. వరదల్లో నష్టపోయిన బాధితులు క్లెయిమ్‌ల కోసం దరఖాస్తు చేసుకుంటే వాటిని వెంటనే పరిష్కరించాలని IRDAI స్పష్టం చేసింది. మరోవైపు వరదల్లో కొట్టుకుపోయిన వారి మృతదేహాలు లభించకపోతే వారికి డెత్ సర్టిఫికెట్లు పొందడం కూడా కష్టం. అలాంటి వారి విషయంలో క్లెయిమ్స్ చెల్లించే విషయంలో జమ్మూకాశ్మీర్ వరదల సమయంలో ఎలాంటి విధానాన్ని అవలంభించారో, ఇక్కడ కూడా అదే విధానాన్ని అమలు చేయాలని ఇన్సూరెన్స్ కంపెనీలకు IRDAI తెలిపింది. అలాగే, వరదల బాధితుల క్లెయిమ్స్ చెల్లింపుల విషయంలో సందేహాల నివృత్తి, ఇతర సమస్యల పరిష్కారం కోసం ఇన్సూరెన్స్ కంపెనీలు రాష్ట్రం, జిల్లాల స్థాయిలో సీనియర్ అధికారులను నోడల్ ఆఫీసర్లుగా నియమించాలని IRDAI ఆదేశించింది.

ఇక భారీ ఎత్తున పంటలు కూడా నష్టపోయాయి. వాటికి కూడా క్లెయిమ్స్ చెల్లించాల్సి ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 14 లక్షల ఎకరాలకు పైగా పంట నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు సమాచారం. ఈ వారంలో మొదటి మూడు రోజుల్లో 8 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లగా, ఆ తర్వాత 12 లక్షల ఎకరాలకు చేరిందని వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా వేసింది. అయితే బుధవారం నాటికి అది కాస్తా 14 లక్షల ఎకరాలకు చేరి ఉండొచ్చని వ్యవసాయ శాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. అయితే తుది నివేదిక ఇంకా రావాల్సి ఉందని పేర్కొంటున్నారు. గత వారం రోజులుగా కురిసిన వర్షాలకే ఇంత నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా భారీగా పంటలు నష్టపోయాయి. ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వాటిల్లిన నష్టాన్ని ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. అలాగే, కేంద్రం హోంశాఖకు కూడా లేఖ రాశారు. కింద రూ.2250 కోట్ల పరిహారం అందించాలని కోరారు.

అలాగే, వాహనాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. కార్లు, బైక్‌లు షెడ్లకు క్యూ కడుతున్నాయి. రోజుల తరబడి వాహనాలు నీళ్లలో ఉండిపోవడంతో వాటికి రిపేర్లు చేయించడానికి చాలా డబ్బులు ఖర్చవుతాయి. వాటికి క్లెయిమ్స్ విషయంలో కూడా చాలా సమస్యలు ఎదురవుతున్నాయి. ఫలానా దానికి ఇన్సూరెన్స్ కవరు కాదు, అది కాదు, ఇది కాదు అంటూ ఇన్సూరెన్స్ కంపెనీలు కొర్రీలు పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే ఇలాంటి సమస్యలను చాలా మంది వాహనదారులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఇన్సూరెన్స్ కంపెనీలు ఎలా స్పందిస్తాయో చూడాలి.
Published by: Ashok Kumar Bonepalli
First published: October 22, 2020, 2:38 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading