కోవిడ్ పరిస్థితుల తర్వాత హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్(Health Insurance) అవసరం ప్రజలకు తెలిసి వచ్చింది. అయితే అవగాహన పెరిగినప్పటికీ, చాలామంది ఇంకా బీమా పాలసీలు తీసుకోవడంలో జాప్యం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇన్సూరెన్స్‌ను అందరికీ చేరువచేయడానికి కృషి చేస్తోంది ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI). అభివృద్ధి చెందని ప్రాంతాలు, మారుమూల ప్రదేశాలకు కూడా ఇన్సూరెన్స్ పథకాలను తీసుకెళ్లాలని ఈ సంస్థ భావిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు కూడా ఇన్సూరెన్స్ ఆవశ్యకతను వివరించేందుకు మహిళలతో డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్(Network) అభివృద్ధి చేసే యోచనలో ఉంది. ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ లక్ష్యాన్ని సాధించడానికి వివిధ సంస్కరణలను తీసుకొస్తోంది. IRDAI తీసుకొస్తున్న సంస్కరణ వివరాలు చూద్దాం.
* 24 మంది సభ్యులతో కమిటీ
గ్రామీణ జనాభా కోసం కాంప్రహెన్సివ్, ఆఫర్డ్‌బుల్ కవర్‌ను అభివృద్ధి చేయడానికి, సూచించడానికి IRDAI 24 మంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ గ్రామీణ ప్రజల అవసరాలను తెలుసుకుంటుంది. గ్రామీణులకు సరిపడే ఇన్సూరెన్స్ ప్లాన్‌లను రూపొందించడంలో సలహాలు, సూచనలు అందజేస్తుంది. ఈ కమిటీ బీమా వాహక్, బీమా విస్తార్, డిజిటల్ ప్లాట్‌ఫారమ్ బీమా సుగమ్ పని, కార్యకలాపాలలో సినర్జీలను ఎలా తీసుకురావాలనే దానిపై పనిచేస్తుంది.
మారుమూల ప్రాంతాలు, గ్రామీణ జనాభాకు కూడా ఇన్సూరెన్స్‌ను చేరువచేసేందుకు ఈ కమిటీ కృషి చేస్తుందని IRDAI తెలిపింది. గ్రామీణులకు తక్కువ ప్రీమియంతో, సమగ్ర ఇన్సూరెన్స్ పథకాన్ని అందించే ప్రయత్నాల్లో ఉన్నట్లు పేర్కొంది. ఇందుకు ఆ ప్రాంతాలలో అవసరాలు అర్థం చేసుకోవడం అవసరమని, ఆ ప్రాంతాల్లోని డైనమిక్స్‌ను గౌరవిస్తామని పేర్కొంది. అటువంటి ప్రాంతాలు, మారుమూల ప్రాంతాల్లోని ఫీల్డ్ ఫోర్స్ స్థానిక జనాభాపై నమ్మకాన్ని పెంపొందించుకోవాలని, మరింత ఓపికగా, రిస్క్ కవర్ ఆవశ్యకతను, సూక్ష్మబేధాలను వివరించి ఒప్పించగలగాలని తెలిపింది. అందుకే ఉమెన్ సెంట్రిక్ డిస్ట్రిబ్యూషన్ ఛానెల్‌ను అభివృద్ధి చేయాలనే యోచనలో ఉన్నట్లు IRDAI వివరించింది. చివరి మైలు రాయిని చేరుకోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)/ మెషిన్ లెర్నింగ్ (ML) వంటి టెక్నాలజీలతో క్రియేట్ చేసిన డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించుకోవచ్చని తెలిపింది.
మహిళలు కేంద్రంగా డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్
శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ మేనేజింగ్ డైరెక్టర్ & సీఈఓ కాస్పరస్ JH క్రోమ్‌హౌట్ CNBC TV18తో మాట్లాడుతూ.. ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ కార్యక్రమాలు, ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ లక్ష్యాలు స్వాగతించదగినవని చెప్పారు. దేశంలో ఇన్సూరెన్స్ వ్యాప్తి చాలా అభివృద్ధి చెందిన దేశాల కంటే తక్కువగా ఉందన్నారు. గ్రామీణ, మాస్ మార్కెట్ విభాగాలలో అవసరమైన దానికంటే తక్కువ కవరేజీ అందుకు కారణమని అభిప్రాయపడ్డారు.
ఈ విభాగాలకు ఇన్సూరెన్స్ విస్తరించే కార్యక్రమాలు ఆర్థిక అభివృద్ధికి సహాయపడుతాయని వివరించారు. మహిళలు కేంద్రంగా డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ ఇన్సూరెన్స్ అవసరాలను వేగంగా వ్యాప్తి చేస్తారని కాస్పరస్ తెలిపారు. దీంతో మహిళలకు ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయన్నారు. అయితే ఈ విభాగాల ప్రత్యేక అవసరాలను అర్థం చేసుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Health, Insurance, Life Insurance