భారతదేశంలోని పర్యాటకుల్ని వేర్వేరు ప్రాంతాలకు తీసుకెళ్లేందుకు ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్‌కు (IRCTC) చెందిన ఐఆర్‌సీటీసీ టూరిజం (IRCTC Tourism) వేర్వేరు టూర్ ప్యాకేజీలను ప్రకటిస్తోంది. అందులో భాగంగా విస్టాడోమ్ రైల్ టూర్ (Vistadome rail tour) ప్యాకేజీని ప్రకటించింది. అద్దాల రైలు నుంచి హిమాలయాల అందాలు వీక్షించాలనుకునేవారిని ఆకర్షించేందుకు ఈ టూర్ ప్యాకేజీని అందిస్తోంది. హిమాలయాల పాదాల దగ్గర ఉన్న అద్భుతమైన పర్యాటక ప్రాంతం దువార్స్ చూడాలనుకునేవారికి ఈ ప్యాకేజీ ఉపయోగపడుతుంది. ఈ టూర్ ప్యాకేజీలో ఝలోంగ్ బిందు, మూర్తీ రివర్, చప్రమరి వైల్డ్ ఫారెస్ట్ లాంటి ప్రాంతాలు కవర్ అవుతాయి.
ఐఆర్‌సీటీసీ విస్టాడోమ్ రైల్ టూర్ ప్యాకేజీ ప్రతీ శుక్రవారం అందుబాటులో ఉంటుంది. న్యూ జల్పాయ్‌గురి రైల్వే స్టేషన్ దగ్గర ప్రారంభమవుతుంది. కాబట్టి పర్యాటకులు టూర్ ప్రారంభమయ్యే సమయానికి అక్కడికి చేరుకోవాల్సి ఉంటుంది. న్యూ జల్పాయ్‌గురి నుంచి విస్టాడోమ్ రైల్ టూర్ ప్రారంభమవుతుంది. ఒక రాత్రి, రెండు రోజుల టూర్ ప్యాకేజీ ఇది.
మొదటి రోజు అంటే శుక్రవారం ఉదయం పర్యాటకులు న్యూజల్పాయ్‌గురి రైల్వే స్టేషన్‌కు చేరుకోవాలి. అక్కడ ఉదయం 7.20 గంటలకు 05777 నెంబర్ గల విస్టాడోమ్ రైలు ఎక్కాల్సి ఉంటుంది. దారిలో ప్రకృతి అందాలను చూసుకుంటూ ప్రయాణించొచ్చు. ఉదయం 9.10 గంటలకు న్యూ మల్ జంక్షన్ చేరుకుంటారు. అక్కడ్నించి పర్యాటకుల్ని ఐఆర్‌సీటీసీ సిబ్బంది హోటల్‌కు తీసుకెళ్తారు. ఫ్రెషప్ అయిన తర్వాత ఝలోంగ్ బిందు, మూర్తీ రివర్ సందర్శన ఉంటుంది.
రెండో రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత చప్రమరి వైల్డ్ ఫారెస్ట్ సందర్శన ఉంటుంది. సాయంత్రం పర్యాటకుల్ని న్యూ మల్ జంక్షన్ రైల్వే స్టేషన్ దగ్గర డ్రాప్ చేస్తారు. టూరిస్టులు సాయంత్రం 5 గంటలకు 05778 నెంబర్ గల విస్టాడోమ్ రైలు ఎక్కాలి. ఈ రైలు సాయంత్రం 7 గంటలకు న్యూ జల్పాయ్‌గురి రైల్వేస్టేషన్‌కు చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.
IRCTC Karnataka Tour: హైదరాబాద్ నుంచి కర్నాటక టూర్... ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ వివరాలివే
ఐఆర్‌సీటీసీ విస్టాడోమ్ రైల్ టూర్ ప్యాకేజీ ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర రూ.8,580 కాగా, డబుల్ ఆక్యుపెన్సీ ధర రూ.8,780. సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.10,140 చెల్లించాలి. విస్టాడోమ్ రైలు టికెట్లు, ఒక రోజు హోటల్‌లో బస, బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, నాన్ ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ లాంటివి కవర్ అవుతాయి.
సాధారణంగా ఐఆర్‌సీటీసీ టూరిజం దేశంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి టూర్ ప్యాకేజీలను అందిస్తుంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నుంచి ఇప్పటికే టూర్ ప్యాకేజీలు ఉన్నాయి. ఇది విస్టాడోమ్ రైల్ టూర్ ప్యాకేజీ కాబట్టి న్యూ జల్పాయ్‌గురి రైల్వే స్టేషన్ నుంచే ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుందన్న విషయాన్ని పర్యాటకులు గుర్తుంచుకోవాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.