IRCTC TOURISM ANNOUNCED UTTARA BHARAT YATRA WITH MATA VAISHNO DEVI TOUR PACKAGE FROM TELANGANA AND ANDHRA PRADESH SS
IRCTC Tour: రూ.10 వేలకే 11 రోజులు ఉత్తర భారతదేశ యాత్ర... ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలివే
IRCTC Tour: రూ.10 వేలకే 11 రోజులు ఉత్తర భారతదేశ యాత్ర... ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలివే
(ప్రతీకాత్మక చిత్రం)
IRCTC UTTARA BHARAT YATRA | ఉత్తర భారతదేశ యాత్రకు వెళ్లాలనుకునే పర్యాటకులకు శుభవార్త. ఐఆర్సీటీసీ టూరిజం తక్కువ ధరకే అద్భుతమైన టూర్ ప్యాకేజీ ప్రకటించింది.
కేవలం రూ.10 వేలకే 11 రోజులు ఉత్తర భారతదేశ యాత్రకు తీసుకెళ్లనుంది ఐఆర్సీటీసీ టూరిజం. తెలుగు రాష్ట్రాల పర్యాటకుల కోసం 'ఉత్తర భారత యాత్ర విత్ మాతా వైష్ణో దేవి' పేరుతో ఈ టూర్ ప్యాకేజీ అందిస్తోంది ఐఆర్సీటీసీ. 11 రోజుల్లో ఆగ్రా, మథుర, వైష్ణో దేవి, అమృత్సర్, హరిద్వార్, ఢిల్లీ లాంటి ప్రాంతాలను కవర్ చేస్తుంది. తీర్థయాత్ర ప్రత్యేక పర్యాటక రైలులో ఈ ప్రాంతాలకు తీసుకెళ్తుంది ఐఆర్సీటీసీ టూరిజం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పర్యాటకులు ఈ ప్యాకేజీ బుక్ చేసుకోవచ్చు. పర్యాటకులు రేణిగుంట, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, గుంటూరు, నల్గొండ, సికింద్రాబాద్, పెద్దపల్లి, కాజిపేట్, రామగుండంలో టూరిస్ట్ రైలు ఎక్కొచ్చు.
2021 ఏప్రిల్ 24న టూర్ ప్రారంభం మే 4న ముగుస్తుంది.
ఐఆర్సీటీసీ టూరిజం 'ఉత్తర భారత యాత్ర విత్ మాతా వైష్ణో దేవి' టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.10,400. ఇది స్టాండర్డ్ ధర. కంఫర్ట్ ప్యాకేజీ ధర రూ.17,330. తీర్థయాత్రలకు వెళ్లాలనుకునేవారి కోసం తక్కువ ధరకే 11 రోజుల టూర్ ప్యాకేజీని అందిస్తోంది ఐఆర్సీటీసీ టూరిజం. 11 రోజులు, 10 రాత్రుల టూర్ ప్యాకేజీ ఇది. ఉత్తర భారతదేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలు ఇందులో కవర్ అవుతాయి. స్టాండర్డ్ ప్యాకేజీలో స్లీపర్ క్లాస్ జర్నీ, బస ఏర్పాట్లు, టీ, కాఫీ, శాకాహార భోజనం, రోజూ 1 లీటర్ డ్రింకింగ్ వాటర్, టూర్ ఎస్కార్ట్స్, సెక్యూరిటీ ఏర్పాట్లు, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ లాంటివి కవర్ అవుతాయి. కంఫర్ట్ ప్యాకేజీలో రైలులో 3AC బెర్త్, ఏసీ హోటల్లో బస లభిస్తుంది.
IRCTC UTTARA BHARAT YATRA: ఐఆర్సీటీసీ ఉత్తర భారత యాత్ర టూర్ ప్యాకేజీ వివరాలివే
ఏప్రిల్ 24- మొదటి రోజు పర్యాటుకులు రేణిగుంట, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, గుంటూరు, నల్గొండ, సికింద్రాబాద్, పెద్దపల్లి, కాజిపేట్, రామగుండం రైల్వే స్టేషన్లలో టూరిస్ట్ రైలు ఎక్కాల్సి ఉంటుంది.
ఏప్రిల్ 25- రెండో రోజు రైలు ఆగ్రాకు చేరుకుంటుంది. రాత్రికి ఆగ్రాలో బస చేయాలి.
ఏప్రిల్ 26- మూడో రోజు పర్యాటకులు ఆగ్రాలో తాజ్‌మహల్, ఆగ్రా ఫోర్ట్ చూడొచ్చు. ఆ తర్వాత మథురకు తీసుకెళ్తారు. అక్కడ కృష్ణ జన్మభూమి సందర్శించాలి. తర్వాత మథుర నుంచి బయల్దేరతారు.
ఏప్రిల్ 27- నాలుగో రోజు సాయంత్రానికి పర్యాటకులు కాట్రా చేరుకుంటారు.
ఏప్రిల్ 28- ఐదో రోజు మాతా వైష్ణో దేవి ఆలయాన్ని సందర్శించుకోవాలి. అక్కడ పోనీ, డోలీ, హెలికాప్టర్ లాంటి సర్వీసుల్ని పర్యాటకులు సొంత ఖర్చుతో పొందాల్సి ఉంటుంది. హెలికాప్టర్ సర్వీస్ కావాలంటే రెండు నెలల ముందే బుక్ చేయాలి.
ఏప్రిల్ 29- ఆరో రోజు కాట్రా నుంచి బయల్దేరాలి. ఆ తర్వాత జలంధర్ చేరుకుంటారు. రోడ్డు మార్గంలో అమృత్సర్ బయల్దేరాలి. గోల్డెన్ టెంపుల్, వాఘా బార్డర్ సందర్శించొచ్చు. తిరిగి జలంధర్ చేరుకున్న తర్వాత రైలు ప్రయాణం మొదలవుతుంది.
ఏప్రిల్ 30- ఏడో రోజు హరిద్వార్ చేరుకుంటారు. అక్కడ గంగానదిలో స్నానం చేయొచ్చు. ఆ తర్వాత మానస దేవీ మంది ఆలయాన్ని సందర్శించాలి. సాయంత్రం గంగా హారతి కార్యక్రమానికి హాజరు కావొచ్చు. ఆ తర్వాత హరిద్వార్ నుంచి బయల్దేరాలి.
మే 1- ఎనిమిదో రోజు ఢిల్లీ సఫ్దర్ గంజ్ చేరుకుంటారు. ఎర్రకోట, రాజ్ ఘాట్, ఇందిరా మెమొరియల్, అక్షర్ధామ్ ఆలయాన్ని సందర్శించొచ్చు.
మే 2- తొమ్మిదో రోజు ఢిల్లీలో కుతుబ్ మినార్, లోటస్ టెంపుల్, ఇండియా గేట్ సందర్శించొచ్చు. ఆ తర్వాత షాపింగ్ కోసం సమయం దొరుకుతుంది.
మే 3- పదో రోజు తిరుగు ప్రయాణం మొదలవుతుంది.
మే 4- పదకొండో రోజు పర్యాటకులు రామగుండం, కాజిపేట్, పెద్దపల్లి, సికింద్రాబాద్, నల్గొండ, గుంటూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట రైల్వేస్టేషన్లలో దిగొచ్చు.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.