తెలుగు రాష్ట్రాల్లోని టూరిస్టులకు శుభవార్త. ఐఆర్‌సీటీసీ టూరిజం సికింద్రాబాద్ నుంచి తొలి భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలును (Bharat Gaurav Tourist Train) ప్రకటించింది. పుణ్య క్షేత్ర యాత్ర (Punya Kshetra Yatra) పేరుతో టూర్ ప్యాకేజీ ప్రకటించింది. ఈ టూర్ ప్యాకేజీలో పూరీ, కోణార్క్, గయ, వారణాసి, అయోధ్య, ప్రయాగ్‌రాజ్ లాంటి ఆధ్యాత్మిక క్షేత్రాలన్నీ కవర్ అవుతాయి. ఇది 7 రాత్రులు, 8 రోజుల టూర్ ప్యాకేజీ. మార్చి 18న టూర్ ప్రారంభం అవుతుంది. ఈ టూర్ ప్యాకేజీ బుక్ చేసుకున్న పర్యాటకులు సికింద్రాబాద్, కాజీపేట్, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, విశాఖపట్నం, విజయనగరంలో భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ఎక్కొచ్చు. మరి ఈ టూర్ ప్యాకేజీ ఎలా సాగుతుందో తెలుసుకోండి.
ఐఆర్‌సీటీసీ టూరిజం భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు మొదటి రోజు మధ్యాహ్నం 12 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరుతుంది. కాజీపేట్, ఖమ్మం, విజయవాడ , ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, విశాఖపట్నం , విజయనగరంలో పర్యాటకులు ఈ రైలు ఎక్కొచ్చు. రెండో రోజు మధ్యాహ్నం 12 గంటలకు మాల్తీ పాత్‌పూర్ చేరుకుంటారు. అక్కడ్నుంచి పర్యాటకుల్ని పూరీ తీసుకెళ్తారు. పూరీ జగన్నాథ ఆలయాన్ని దర్శించుకోవచ్చు. రాత్రికి పూరీలో బస చేయాలి.
IRCTC Tirupati Tour: శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనంతో తిరుపతి టూర్ ప్యాకేజీ... రూ.4,000 లోపే
Travel to tranquility & immerse in worship and devotion with IRCTC'S tour package covering Punya, Kashi, & Ayodhya aboard Bharat Gaurav Train. Book on https://t.co/88vrBN4dH5@AmritMahotsav @incredibleindia @tourismgoi #bharatparv23 #AzadiKiRail
— IRCTC (@IRCTCofficial) February 2, 2023
మూడో రోజు పూరీ నుంచి కోణార్క్ తీసుకెళ్తారు. కోణార్క్‌లో సూర్య దేవాలయాన్ని సందర్శించిన తర్వాత మాల్తీ పాత్‌పూర్‌కు తిరిగి తీసుకెళ్తారు. అక్కడ రైలు ఎక్కితే నాలుగో రోజు గయ చేరుకుంటారు. గయలో పిండ ప్రదానం, విష్ణుపాద ఆలయ సందర్శన ఉంటాయి. ఆ తర్వాత అక్కడ్నుంచి వారణాసికి బయల్దేరాలి. ఐదో రోజు వారణాసి చేరుకుంటారు. సారనాథ్, కాశీ విశ్వనాథ ఆలయం, కాశీ విశ్వనాథ కారిడార్, అన్నపూర్మ దేవి ఆలయం సందర్శించుకోవాలి. గంగా హారతి కార్యక్రమంలో పాల్గొనొచ్చు. రాత్రికి వారణాసిలో బస చేయాలి.
ఆరో రోజు ఉదయం వారణాసి నుంచి అయోధ్య బయల్దేరాలి. అయోధ్య చేరుకున్నాక రామ జన్మభూమి, హనుమాన్ గఢి సందర్సన ఉంటుంది. సాయంత్రం సరయు నది తీరంలో సంధ్యాహారతి కార్యక్రమంలో పాల్గొనాలి. ఆ తర్వాత అయోధ్య నుంచి ప్రయాగ్‌రాజ్ బయల్దేరాలి. ఏడో రోజు ప్రయాగ్ రాజ్ చేరుకున్న తర్వాత త్రివేణి సంగమం, హనుమాన్ ఆలయం, శంకర్ విమాన్ మండపం సందర్శించుకోవచ్చు. ఏడో రోజు తిరుగు ప్రయాణం ప్రారంభం అవుతుంది. ఎనిమిదో రోజు పర్యాటకులు స్వస్థలానికి చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.
Train Tickets: ట్రైన్ టికెట్ బుక్ చేసిన తర్వాత టికెట్‌ను మరో స్టేషన్‌కు మార్చుకోవచ్చని మీకు తెలుసా?
ఐఆర్‌సీటీసీ టూరిజం పుణ్య క్షేత్ర యాత్ర ప్యాకేజీ ధరలు చూస్తే భారత్ గౌరవ్ ట్రైన్ స్కీమ్‌లో భాగంగా భారతీయ రైల్వే సుమారు 33 శాతం తగ్గింపు అందిస్తోంది. కన్సెషన్ తర్వాతే ప్యాకేజీ ధరలు చూస్తే మూడు కేటగిరీల్లో ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. ఎకానమి డబుల్, ట్రిపుల్ షేర్ ధర రూ.13,955 కాగా, సింగిల్ షేర్ ధర రూ.15,300. స్టాండర్డ్ డబుల్, ట్రిపుల్ షేర్ ధర రూ.22,510 కాగా, సింగిల్ షేర్ ధర రూ.24,085. ఇక కంఫర్ట్ డబుల్, ట్రిపుల్ షేర్ ధర రూ.29,615 కాగా, సింగిల్ షేర్ ధర రూ.31,510. ఈ టూరిస్ట్ రైలులో మొత్తం 656 బెర్తులు ఉంటాయి. అందులో స్లీపర్ 432, థర్డ్ ఏసీ 180, సెకండ్ ఏసీ 44 బెర్తులు ఉంటాయి.
ఎకానమీ కేటగిరీలో స్లీపర్ క్లాస్ ప్రయాణం, నాన్ ఏసీ గదుల్లో బస, స్టాండర్డ్ కేటగిరీలో థర్డ్ ఏసీ ప్రయాణం, కంఫర్ట్ కేటగిరీలో సెకండ్ ఏసీ ప్రయాణం, ఏసీ గదుల్లో బస, వాహనాల్లో సైట్ సీయింగ్, టీ, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bharat Gaurav Train, IRCTC, IRCTC Tourism, Secunderabad